టీం ఇండియా విజయం కోసం పాట

Song Viral in Social Media  For Cricket World Cup India - Sakshi

టీం ఇండియా విజయం కోసం పాట 

సోషల్‌ మీడియాలో ‘కమాన్‌ ఇండియా’ వైరల్‌ 

ప్రపంచ కప్‌ సాధించాలంటూ నగర యువకుల జోష్‌  

ఇంగ్లిష్‌ లిరిక్స్‌ రాసిన మెక్సికో యువతి 

హిందీ గీతం రాసిన నగరవాసి

హిమాయత్‌నగర్‌: దేశంలో ప్రతి ఇంటా ఇప్పుడు ఒకటే రచ్చ.. ప్రపంచ కప్‌–2019 క్రికెట్‌ గురించే. ఈ పోటీల్లో మరోసారి భారత్‌ విజయం సాధించాలని కొందరు పూజలు చేస్తుంటే.. మరికొందరు తమ కామెంట్లతో సోషల్‌ మీడియా వేదికగా ఆటగాళ్లను ఉత్సాహపరుస్తున్నారు. ఎవరికి తోచిన స్టేటస్‌లను వాళ్లు పెడుతూ, చిన్నచిన్న వీడియోలు చేస్తూ ఫేస్‌బుక్, వాట్సాప్, ఇన్‌స్టాగ్రామ్, ట్విట్టర్‌లలో పోస్ట్‌ చేస్తున్నారు. ఇలాగే నగరంలో ఉంటున్న ఇద్దరు యువకులు తమకున్న క్రికెట్‌ ప్రేమను, భారత జట్టుపై గల ఇష్టాన్ని కలగలిపి భారత్‌ మరోసారి ప్రత్యర్థులను చిత్తు చేసి ప్రపంచ్‌కప్‌ తేవాలంటూ ఓ వీడియో సాంగ్‌ను రూపొందించారు. ఐదు నిమిషాల నిడివి గల ఈ పాట ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ‘కమాన్‌ ఇండియా డూ ఇట్‌ డె నోవా’ అంటూ సాగే ఈ పాటతో మిర్యాల అనిల్, సాయినరేంద్ర బోస్‌ రచ్చరచ్చ చేశారు. పశ్చిమగోదావరి జిల్లా చింతలపూడి గ్రామానికి చెందిన వీరిద్దరూ పదేళ్ల క్రితం నగరానికి వచ్చారు. అనిల్‌ మ్యూజిక్‌ ప్రొడ్యూసర్‌ కాగా, సాయి నరేంద్రబోస్‌ ఎయిర్‌పోర్టులో ఉన్నతోద్యోగి. అనిల్‌ సినిమాలు, షార్ట్‌ ఫిల్మŠస్‌కు సంగీతం అందిస్తుంటారు. వీరిద్దరికీ క్రికెట్‌ అంటే ఎంతో ఇష్టం. దీంతో ఇద్దరూ కలిసి ప్రస్తుతం జరుగుతున్న ప్రపంచకప్‌ పోటీల్లో మన జట్టు విజయంతో తిరిగి రావాలంటూ ఓ సాంగ్‌ని రూపొందించారు.  

‘కమాన్‌ ఇండియా.. డు ఇట్‌ డె నోవా’ (వెనక్కి తగ్గకుండా ప్రపంచ కప్‌ని సాధించుకు రండి) అంటూ సాగే ఈ పాట నిడివి ఐదు నిమిషాలే అయినా ప్రతి సెల్‌ఫోన్‌లోనూ తిరుగుతోంది. పాటలో సగభాగం ఇంగ్లిష్, మిగతా భాగం హిందీలో ఉండడం గమనార్హం. ఇంగ్లిష్‌ లిరిక్‌ను మెక్సికోకు చెందిన రేడియో జాకీ గాబ్రియేల్‌æ పెరోజ్‌ రాయగా.. హిందీ లిరిక్‌ను నగరవాసి స్వరూప్‌ రాశారు. భారత్‌ జట్టుకు మనం ఒక సపోర్ట్‌గా నిలవాలి. మనం యంకరేజ్‌ చేస్తే వారు ఖచ్చితంగా కప్‌ని సాధించగలరు. దేశ అభిమానులంతా వారికి వెన్నుదన్నుగా నిలవాలి అనే విషయాలను గాబ్రియేల్‌æ పెరోజ్, స్వరూప్‌లకు వివరించగా.. వారిద్దరూ ఈ సాంగ్‌ను రాశారు. 

పాడుతూ.. ఆడుతూ..
గాబ్రియేల్‌æ ఫెరోజ్, స్వరూప్‌ రాసిన పాటను అనిల్, సాయినరేంద్రబోస్‌లు వీడియో షూట్‌ చేయాలని నిశ్చయించుకున్నారు. నానక్‌రామ్‌గూడలోని ‘క్రిక్‌రాక్స్‌’ గ్రౌండ్‌లో వీరిద్దరూ డ్యాన్స్‌ చేస్తూ వీడియో షూట్‌ చేశారు. సాంగ్‌ 1983లో అప్పటి కెప్టెన్‌ కపిల్‌దేవ్‌ ప్రపంచ్‌కప్‌ని అందుకుంటున్న విజుల్‌తో ప్రారంభమవుతుంది. తర్వాత సచిన్‌ టెండుల్కర్‌ వరల్డ్‌కప్‌ని అందుకునే విజువల్స్‌తో పాటు మరిన్ని విజయాలు నమోదు చేసుకున్న వైనాన్ని చూపిస్తూ వీడియో చేశౠరు.  

లక్ష మందికిపైగా వీక్షణ
సుమారు రూ.1.5 లక్షల ఖర్చుతో రూపొందించిన ఈ వీడియోను మే 20న యూట్యూబ్, ఫేస్‌బుక్‌లో పోస్ట్‌ చేశారు. కేవలం 24 గంటల్లో యూట్యూబ్‌లో 50 వేల మందికి పైగా వీక్షించారు. ఈ పదిహేను రోజుల్లో మరో లక్షన్నర మందికి చేరువైంది. ఫేస్‌బుక్‌లో మరో పదివేల మంది వీక్షించారు. ఇక ఉత్తరాదికి చెందిన ఎందరో క్రికెట్‌ అభిమానులు సూపర్‌ సాంగ్‌ చేశారంటూ పొగడ్తలతో ముంచెత్తుతున్నారు.  

గతంలో సైనికుల కోసం..
మన దేశ సైనికుల త్యాగాలను స్మరిస్తూ గతేడాది జనవరి 26న అనిల్, సాయినరేంద్రబోస్‌ ఓ పాటను రిలీజ్‌ చేశారు. అప్పట్లో ఈ పాటకు దేశవ్యాప్తంగా మంచి ప్రశంసలు వచ్చాయి. ‘సెల్యూట్‌ టు సోల్జర్స్‌’ అంటూ సాగే ఈ పాటకు పోలీసులు, సామాన్య ప్రజానికం సైతం ఆదరించారు. 

అభిమానంతో చేశాం
దేశానికి ప్రపంచకప్‌ రావాలి. ఇందుకోసం మనమంతా ఒకేతాటిపై నిలబడి మన ఆటగాళ్లను ప్రోత్సహించాలి. అందుకోసమే మేం ఈ సాంగ్‌ను చేశాం. ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా ఈ పాటకు మంచి ఆదరణ రావడం చాలా ఆనందంగా ఉంది. భవిష్యత్‌లో ఈ తరహా పాటలు చేసేందుకు మరింత ప్రోత్సాహం వచ్చినట్టు అనిపిస్తోంది.  – మిర్యాల అనిల్, సాయినరేంద్రబోస్‌ 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top