జిల్లాకో ఇన్వెస్టిగేషన్‌ సెంటర్‌

Solution to Solve Cases Investigation Centre for Each District - Sakshi

ఏర్పాటుకు పోలీస్‌ శాఖ నిర్ణయం

పెండింగ్‌ కేసులు పేరుకుపోకుండా చర్యలు

రీజినల్‌ ఎఫ్‌ఎస్‌ఎల్, సైబర్‌ క్రైమ్, సోషల్‌ మీడియా ల్యాబ్‌లు

సాక్షి, హైదరాబాద్‌ : కేసుల దర్యాప్తు, విచారణలో ఎదురయ్యే సమస్యలు, ఇతరత్రా ఇబ్బందులను చాకచక్యంగా పరిష్కరించేందుకు రాష్ట్ర పోలీస్‌ శాఖ వినూత్న చర్యలు చేపట్టబోతోంది. సంచలనాత్మక కేసుల విచారణలో దర్యాప్తు అధికారులకు సూచనలు, సలహాలు, సందేహాల నివృత్తికి ప్రత్యేకంగా సెల్‌ ఏర్పాటు చేసేందుకు డీజీపీ మహేందర్‌రెడ్డి కార్యాచరణ రూపొందించారు.

రాష్ట్ర పోలీస్‌ ముఖ్య కార్యాలయంలో ఇన్వెస్టిగేషన్‌ సపోర్ట్‌ సెంటర్‌ సెల్‌ను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఈ సెల్‌లో అనుభవమున్న పోలీస్‌ అధికారి, న్యాయ నిపుణులు, ఫోరెన్సిక్‌ నిపుణులు, ఫింగర్‌ ప్రింట్స్, టెక్నాలజీ అనుభవమున్న వ్యక్తులు ఉంటారు. కేసు విచారణ సమయంలో ఏ సమస్యతో దర్యాప్తుకు అడ్డంకులు ఏర్పడుతున్నాయి? వాటిని ఎలా అధిగమించాలి?

ఆధారాల సేకరణలో ఎదురయ్యే సమస్యలు, వాటి పరిష్కారానికి చేపట్టాల్సిన సూచనలు, సలహాలు ఈ సెల్‌ నుంచి ఇచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. దీంతో కేసుల పెండింగ్‌ తగ్గడంతో పాటు దర్యాప్తు అధికారికి కూడా అనుభవం వస్తుందన్న నేపథ్యంలో ఇన్వెస్టిగేషన్‌ సపోర్ట్‌ సెంటర్‌ను తీర్చిదిద్దబోతున్నారు.
 
సైబర్‌ ల్యాబ్‌లు...
ఏదైనా కేసులో సాంకేతిక ఆధారాలైన సెల్‌ఫోన్, ల్యాప్‌టాప్, సీడీలు, పెన్‌డ్రైవ్‌లు, తదితరాల విశ్లేషణకు సైబర్‌ ల్యాబ్‌లే కీలకం. విదేశాల నుంచి భారీ ఖర్చుతో కొన్ని ముఖ్యమైన టూల్స్‌ కొనుగోలు చేస్తున్న పోలీస్‌ శాఖ వీటి ద్వారా విరిగిపోయిన సీడీల్లోని డేటాను కూడా బయటపెట్టగలదు. అలాగే లాక్‌ అయిన ఫోన్లలోని డేటాను తిరిగి తీయవచ్చు.

మెయిల్స్‌ ట్రాకింగ్, నకిలీ వెబ్‌సైట్లు, ఇంటర్‌ నెట్‌ సంబంధిత కేసులను సైతం పరిష్కరించేందుకు ఈ ల్యాబ్‌లు అత్యంత కీలకపాత్ర పోషించనున్నాయి. రాష్ట్రంలో జిల్లాకో సైబర్‌ క్రైమ్‌ ల్యాబ్‌ ఏర్పాటు చేసేందుకు ఇప్పటికే పోలీస్‌ శాఖ చర్యలు ప్రారంభించింది.  

సోషల్‌ మీడియా ల్యాబ్‌లు..
ప్రజల నుంచి నేరుగా సోషల్‌ మీడియా ద్వారా ఫిర్యాదులు, సూచనలు, సలహాలు స్వీకరించేందుకు ప్రతీ జిల్లా పోలీస్‌ ఆధ్వర్యంలో సోషల్‌ మీడియా ల్యాబ్‌ ఏర్పాటుచేయనున్నారు. పెరిగిపోతున్న టెక్నాలజీకి తగ్గట్లుగా ప్రతీ జిల్లా పోలీస్‌ యూనిట్‌గా ఫేస్‌బుక్, ట్విట్టర్, వాట్సాప్‌ అకౌంట్లను ప్రారంభించనున్నారు.

అలాగే వదంతులు వ్యాపించిన నేపథ్యంలో వాటిని నియంత్రించేందుకు సోషల్‌ మీడియా ల్యాబ్‌ను వినియోగించుకోవాలని భావిస్తున్నారు. సైబరాబాద్‌లోని సోషల్‌ మీడియా ల్యాబ్‌ లాంటి ప్రత్యేక ఫీచర్లను అందుబాటులోకి తెచ్చేందుకు కృషి చేస్తున్నారు. సున్నితమైన అంశాలపై సోషల్‌ మీడియాలో పోస్టులు పెట్టిన వారి వివరాలు గుర్తించడం ఈ ఫీచర్‌ ప్రత్యేకత.  

ఆ కేసుల కోసం ఫోరెన్సిక్‌...
అత్యాచారాలు, హత్యలు, తదితర కేసుల్లో ఫోరెన్సిక్‌ సైన్స్‌ ల్యాబ్‌(ఎఫ్‌ఎస్‌ఎల్‌) నివేదికలే ఆధారం. అయితే ఎక్కడో ఆదిలాబాద్‌లో కేసు జరిగితే.. ఆ కేసు సంబంధిత శాంపిల్స్‌ హైదరాబాద్‌ లోని ఎఫ్‌ఎస్‌ఎల్‌కు రావడానికి చాలా సమ యం తీసుకుంటోంది. దర్యాప్తు అధికారులు కూడా అలసత్వం వహిస్తున్నారు. దీంతో కేసు లు పెండింగ్‌లో ఉండిపోతున్నాయి. ఇలాంటి వాటికి చెక్‌ పెట్టేందుకు ప్రతీ జిల్లాలో ఫోరెన్సిక్‌ ల్యాబ్, ఫింగర్‌ ప్రింట్‌ బ్యూరో సెంటర్లు ఏర్పా టు చేయాలని పోలీస్‌ శాఖ నిర్ణయించింది.  

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top