శంఖారావానికి సిద్ధం

Smriti Irani Meet Huge Turnout In Medak - Sakshi

సాక్షి, మెదక్‌: ముందస్తు ఎన్నికల ప్రచారానికి బీజేపీ తెరతీసింది. జిల్లా పరిధిలోని చేగుంటలో గురువారం ‘మహిళా శంఖారావం’ సభను నిర్వహిస్తుంది. ఈ సభకు ముఖ్య అతిథిగా కేంద్ర జౌళీశాఖ మంత్రి స్మృతిఇరానీ హాజరుకానున్నారు. 25 వేల మంది మహిళలతో భారీఎత్తున ఈ శంఖారావ సభను నిర్వహిస్తున్నారు. మహిళా మోర్చా ఆధ్వర్యంలో జరిగే ఈ కార్యక్రమంలో స్మృతి ఇరానీతోపాటు, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్‌రావు, రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్, కేంద్ర మాజీ మంత్రి బండారు దత్తాత్రేయ తదితరులు హాజరుకానున్నారు. సభ విజయవంతం కోసం బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు ఆకుల విజయ, బీజేపీ రాష్ట్ర నాయకులు రఘునందన్‌రావు కృషి చేస్తున్నారు.  జిల్లాలోని అన్ని ప్రాంతాలతోపాటు దుబ్బాక నియోజకవర్గం నుంచి పెద్ద సంఖ్యలో మహిళలను సమీకరిస్తున్నారు.

వారం రోజులుగా 100 మందితో ఏర్పడిన మహిళా బృందాలు జిల్లాలో ఇంటింటికీ తిరుగుతూ మహిళా శంఖారావసభను విజయవంతం చేయాలని ప్రచారం చేస్తున్నారు. మహిళా మోర్చా రాష్ట్ర అధ్యక్షురాలు ఆకుల విజయ, జిల్లా అధ్యక్షురాలు శైలజ సభకు హాజరు కావాలని బొట్టుపెట్టి  మరీ ఆహ్వానిస్తున్నారు. 25వేల మందికంటే ఎక్కువ మంది మహిళలు సభకు హాజరవుతారని ఆకుల విజయ ధీమా వ్యక్తం చేశారు. జిల్లాతోపాటు సంగారెడ్డి, సిద్దిపేట జిల్లాల నుంచి కూడా మహిళలను, బీజేపీ శ్రేణులను తరలిస్తున్నారు. గురువారం మధ్యాహ్నం 2 గంటలకు కేంద్ర మంత్రి స్మృతీఇరానీ హైదరాబాద్‌ నుంచి చేగుంట చేరుకుంటారు. 2.30 గంటలకు సభలో ప్రసంగిస్తారు. సభ ముగిసిన అనంతరం సాయంత్రం 4 గంటలకు తిరిగి హైదరాబాద్‌కు పయణమవుతారు.

స్మృతిఇరానీ పర్యటనపై భారీ ఆశలు
స్మృతి ఇరానీ పర్యటన జిల్లాలో పార్టీకి లాభిస్తుందని బీజేపీ నాయకత్వం ఆశిస్తోంది.  ఇటీవల మహబూబ్‌నగర్‌ జిల్లాలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా ఎన్నికల శంఖారావం పూరించిన విషయం తెలిసిందె.  ఆ తర్వాత  చేగుంట నుంచి స్మృతి ఇరానీ ఎన్నికల ప్రచారం కొనసాగించనున్నారు. సీఎం కేసీఆర్‌ సొంత జిల్లా కావడంతో బీజేపీ నాయకత్వం స్మృతి పర్యటనను విజయవంతం చేయాలని పట్టుదలగా ఉన్నారు. సభలో టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం వైఫల్యాలను ఎండగట్టడంతోపాటు కేంద్రంలోని మోదీ ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల గురించి  ప్రసంగించే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా మహిళల సమస్యలపై ఎక్కువగా తన ప్రసంగంలో ప్రాధాన్యత ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. స్మృతి ఇరానీ పర్యనటతో పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నిండటంతోపాటు ఓటర్లు బీజేపీ పట్ల ఆకర్షితులు అవుతారని బీజేపీ నేతల అంచనా. ఈ పర్యటనతో మెదక్, నర్సాపూర్, దుబ్బాక నియోజవర్గాల్లో పార్టీ విజయావకాశాలు పెరుగుతాయని బీజేపీ నాయకులు భావిస్తున్నారు.

వైఫల్యాలను ఎండగడతాం
ఈ సభ ద్వారా కేసీఆర్‌ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడతామని మహిళా మోర్చా అధ్యక్షురాలు ఆకుల విజయ తెలిపారు. మహిళా శంఖారావసభ ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్న ఆమె మాట్లాడుతూ కేంద్ర మంత్రి  పర్యటన ఉమ్మడి మెదక్‌ జిల్లా బీజేపీకి బలం చేకూరుస్తుందన్నారు. రాబోయే ఎన్నికల్లో బీజేపీకి ప్రజలు పట్టం కట్టడం ఖాయమన్నారు.  సీఎం కేసీఆర్‌ ప్రభుత్వం మహిళల సంక్షేమాన్ని పూర్తిగా విస్మరించారని ఆరోపించారు. కేసీఆర్‌ తన కేబినెట్‌లో మహిళకు స్థానం కల్పించకుండా  మహిళల పట్ల తనకున్న చిన్నచూపును చాటిచెప్పారని విమర్శించారు. ప్రధాన మంత్రి మోదీ ప్రభుత్వం మహిళా శిశు సంక్షేమానికి అంత్యంత ప్రాధాన్యత ఇస్తున్నట్లు వివరించారు. చేగుంటతోపాటు త్వరలో ఐదు పార్లమెంట్‌ నియోజకవర్గాల పరిధిలో మహిళా మోర్చా ఎన్నికల ప్రచార సభలను నిర్వహించనున్నట్లు తెలిపారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top