ఆదిలాబాద్‌ @ 6 డిగ్రీలు 

Significantly fallen night temperatures in the state - Sakshi

రాష్ట్రంలో గణనీయంగా పడిపోయిన రాత్రి ఉష్ణోగ్రతలు  

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో రాత్రి ఉష్ణోగ్రతలు గణనీయంగా పడిపోయాయి. గత 24 గంటల్లో ఆదిలాబాద్‌లోనైతే ఏకంగా 6 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. ఈ సీజన్‌లో రాష్ట్రంలో అత్యంత తక్కువ ఉష్ణోగ్రత నమోదు కావడం ఇదే మొదటిసారి. మెదక్‌లో సాధారణం కంటే 4 డిగ్రీలు తక్కువగా రాత్రి ఉష్ణోగ్రత 9 డిగ్రీలకు పడిపోయింది. సాధారణం కంటే 6 డిగ్రీలు తక్కువగా మెదక్‌లో 10 డిగ్రీలు, ఖమ్మంలో 11 డిగ్రీల రాత్రి ఉష్ణోగ్రత నమోదైంది. హన్మకొండ, నిజామాబాద్, రామగుండంలలో సాధారణం కంటే మూడు డిగ్రీల వరకు తక్కువగా 13 డిగ్రీల చొప్పున రాత్రి ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

ఇక పగటి ఉష్ణోగ్రతలు మాత్రం కాస్తంత ఎక్కువగానే ఉండటం గమనార్హం. ఆదిలాబాద్‌లో రాత్రి ఉష్ణోగ్రతకు దాదాపు ఐదింతలు ఎక్కువగా 29 డిగ్రీల పగటి ఉష్ణోగ్రత నమోదైంది. ఖమ్మంలో రాత్రి ఉష్ణోగ్రత సాధారణం కంటే 6 డిగ్రీలు తక్కువగా నమోదైతే, పగటి ఉష్ణోగ్రత మాత్రం 4 డిగ్రీలు అధికంగా 33 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. సాధారణం కంటే 3 డిగ్రీలు ఎక్కువగా మహబూబ్‌నగర్‌లో 33, మెదక్‌లో 32 డిగ్రీల చొప్పున గరిష్ట ఉష్ణోగ్రతలు రికార్డు అయ్యాయి. కాగా సోమవారం హైదరాబాద్‌ నగరంలో 13.0 కనిష్ట, 31.0 గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. వచ్చే రెండు రోజుల్లో సాధారణం కన్నా మరో రెండు మూడు డిగ్రీలు తగ్గే అవకాశం ఉందని బేగంపేట వాతావరణశాఖ విభాగం నిపుణులు ప్రకటించారు.  

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top