ప్రజలు కష్టాల్లో ఉన్నారు.. ఆదుకోండి


  • తెలంగాణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసిన షర్మిల

  •  రైతులు, కూలీల బాధలు వర్ణనాతీతం

  •  ఉపాధి హామీని కుదిస్తారేమోనన్న ఆందోళనలో కూలీలు

  •  వెరిఫికేషన్ పేరుతో పింఛన్లు ఆపడం సరికాదని సూచన

  •  యాత్ర కుటుంబ వ్యవహారమని, ఇందులో రాజకీయ జోక్యం అనవసరమని వ్యాఖ్య

  • పరామర్శ యాత్ర నుంచి ‘సాక్షి’ ప్రత్యేక ప్రతినిధి: తెలంగాణలో ప్రజానీకం చాలా కష్టాల్లో ఉంద ని, వారిని అన్ని విధాలా ఆదుకోవలసిన బాధ్య త ప్రభుత్వంపై ఉందని వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు జగన్‌మోహన్‌రెడ్డి సోదరి షర్మిల పేర్కొన్నారు. రైతులు, కూలీల పరిస్థితి మరీ దయనీయంగా ఉందని ప్రభుత్వం వెంటనే తగిన చర్యలు తీసుకోవాలని ఆమె డిమాండ్ చేశారు.

    మహబూబ్‌నగర్ జిల్లాలో నిర్వహించిన ‘పరామర్శ యాత్ర’ ముగిసిన సందర్భంగా శుక్రవారం షర్మిల మీడియాతో మాట్లాడారు. ‘‘ఐదు రోజుల పాటు మహబూబ్‌నగర్ జిల్లా వాసులతో కలిసి వందల కిలోమీటర్లు తిరిగాను. ఈ సందర్భంగా నా దృష్టికి వచ్చిన అంశాలను ప్రభుత్వానికి నివేదించాల్సిన బాధ్యత నాపై ఉంది. వర్షాలు రాక, కరెంటు లేక, పండిన పంటలకు కూడా మద్దతు ధర లభించక రైతులు అప్పుల పాలై చాలా కష్టాల్లో కూరుకుపోయారు. ఎక్కడికెళ్లినా ‘మా బతుకు ఎలాగమ్మా..’ అంటూ వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.



    ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకుని నష్టపోయిన రైతులకు పరిహారం ఇవ్వాలని వైఎస్సార్ సీపీ తరఫున డిమాండ్ చేస్తున్నాం..’’ అని షర్మిల పేర్కొన్నారు. రైతు కూలీలు సైతం పని దొరకక పస్తులు ఉండాల్సి వస్తోందంటున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఉపాధి హామీ పథకాన్ని కుదిస్తారన్న ఆందోళన కూలీల్లో నెలకొందని.. అదే జరిగితే పాలమూరు వంటి జిల్లాల్లో మళ్లీ కుటుంబాలను వదిలి వలసపోవాల్సి వస్తుందని షర్మిల ఆవేదన వ్యక్తం చేశారు. ఆకలి చావులు లేకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వానిదని, వెంటనే తగిన చర్యలు తీసుకొని ప్రజలకు అండగా నిలవాలని సూచించారు.



    పేదలకు పెన్షన్లు ఇవ్వరా?



    ‘పరామర్శ యాత్ర’లో భాగంగా వెళ్లిన ప్రతిచోటా వృద్ధులు, వికలాంగులు తమ పింఛన్లు ఆగిపోయాయని ఆవేదన వ్యక్తం చేశారని షర్మిల తెలిపారు. వెరిఫికేషన్ పేరుతో పింఛన్లను ఆపేయాల్సిన అవసరం ఏమిటని ప్రభుత్వాన్ని ఆమె ప్రశ్నించారు. వెరిఫికేషన్ చేస్తూనే పింఛన్లు ఇవ్వవచ్చని.. ఈ విషయంలో ప్రభుత్వ తీరు సరికాదని విమర్శించారు. పింఛన్లు ఆపడం చాలా దారుణమని, అన్యాయమని పేర్కొన్నారు. పేదల ఉసురు పోసుకోవడం ప్రభుత్వానికి మంచిది కాదని, అర్హులైన ప్రతి ఒక్కరికి పింఛన్లు ఇవ్వాలని షర్మిల డిమాండ్ చేశారు.

    పరామర్శ యాత్ర సంతృప్తిగా ఉంది



    వైఎస్‌ఆర్ మరణాన్ని తట్టుకోలేక చనిపోయినవారి కుటుంబాలను పరామర్శించడం తనకు సంతృప్తినిచ్చిందని షర్మిల పేర్కొన్నారు. ఐదేళ్ల తరువాత కూడా జగనన్న ఇచ్చిన మాట మేరకు, ఆయన ఆదేశాలతో తాను మహబూబ్‌నగర్ జిల్లాలో 22 కుటుంబాలను పరామర్శించినట్లు ఆమె తెలిపారు.

     

    ‘‘పరామర్శకు వెళ్లినప్పుడు... ‘ఇది మా కుటుంబానికి, మీ కుటుంబానికి సంబంధించిన విషయం. మిగతా వారు ఎందుకు పరామర్శ మీద మాట్లాడుతున్నారు..’ అని ఒక పెద్దాయన అన్నారు. నిజమే కదా! రాజశేఖర్‌రెడ్డి చనిపోయారనే బాధతో ఆయనను అభిమానించే గుండెలు ఆగాయని తెలిసి మేం వెళ్లి ఆ కుటుంబాన్ని ఓదార్చితే... ఇతర పార్టీలకు, నాయకులకు ఏమవసరం. ఇది పూర్తిగా మా వ్యక్తిగత విషయం.



    ఇందులో జోక్యం చేసుకునే అర్హత ఎవరికీ లేదు. మాట మీద నిలబడడం మా కుటుంబానికి తెలిసిన విషయం. అందుకే ఈ యాత్ర. ఖమ్మంలో జగనన్న ఓదార్పు యాత్ర పూర్తి చేశారు. మహబూబ్‌నగర్‌లో కూడా పూర్తయింది. మిగతా 8 జిల్లాల్లో కూడా నేను పరామర్శ యాత్ర చేస్తా..’’ అని షర్మిల స్పష్టం చేశారు. ఈ సమావేశంలో పార్టీ తెలంగాణ వర్కింగ్ ప్రెసిడెంట్ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు, మహబూబ్‌నగర్ జిల్లా కన్వీనర్ ఎడ్మ కిష్టారెడ్డి, శివకుమార్ తదితరులున్నారు.

     

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top