3 దశల్లో పరిషత్‌ పోరు

SEC letter to Govt for elections ready  - Sakshi

బ్యాలెట్‌ బాక్సులతోనే నిర్వహణ 

ఎన్నికలకు సిద్ధమంటూ సర్కార్‌కు ఎస్‌ఈసీ లేఖ 

ఈ నెల 20–25 మధ్య తొలి దశ నోటిఫికేషన్‌ 

మే 15లోగా ఎన్నికలు పూర్తయ్యే అవకాశం 

కొత్త జిల్లాలతో కలిపి 32 జిల్లా పరిషత్‌లు.. 

535 జడ్పీటీసీ, 5,857 ఎంపీటీసీ స్థానాలు 

పరిషత్, మున్సిపల్‌ ఎన్నికలకు ఈసీ గ్రీన్‌ సిగ్నల్‌ 

సాక్షి, హైదరాబాద్‌: జిల్లా పరిషత్, మండల పరిషత్‌ ఎన్నికలను మూడు దశల్లో నిర్వహించేందుకు రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ (ఎస్‌ఈసీ) ఏర్పాట్లు చేస్తోంది. బ్యాలెట్‌ బాక్సులతోనే ఈ ఎన్నికలు నిర్వహించేలా ఏర్పాట్లు పూర్తవుతున్నాయి. ఈ నెల 11న రాష్ట్రంలో లోక్‌సభ ఎన్నికల పోలింగ్‌ ముగియగానే స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ ప్రక్రియ వేగం పుంజుకోనుంది. ఏప్రిల్‌ 20 నుంచి మే 23లోపు (లోక్‌సభ ఫలితాలు వెలువడే తేదీలోపు) పరిషత్‌ ఎన్నికల ప్రక్రియ పూర్తి చేసేందుకు సిద్ధంగా ఉన్నట్టు రాష్ట్ర ప్రభుత్వానికి ఎస్‌ఈసీ లేఖ రాసింది. దీనికి ప్రభుత్వ ఆమోదం లభించగానే నోటిఫికేషన్‌ జారీ కానుంది. ప్రస్తుత అంచనాల ప్రకారం ఈ నెల 20–25 మధ్య తొలి దశ ఎన్నికల నోటిఫికేషన్‌ విడుదలకు ఎస్‌ఈసీ సన్నాహాలు చేస్తోంది. జనాభా, విస్తీర్ణం ఆధారంగా... ఒకటి, రెండు, మూడు దశల్లో ఎన్నికలు నిర్వహించేలా చర్యలు తీసుకుంటోంది.  పరిషత్‌ ఎన్నికలు ముగియగానే వారం, పది రోజుల వ్యవధిలోనే మున్సిపల్‌ ఎన్నికల నిర్వహణకు ఎస్‌ఈసీ ఏర్పాట్లు చేస్తోంది.  

10న ఉన్నత స్థాయి భేటీ... 
పరిషత్‌ ఎన్నికలపై బుధవారం సీఎస్, డీజీపీ, ఇతర శాఖల అధికారులతో ఎస్‌ఈసీ ఉన్నతస్థాయి సమావేశాన్ని నిర్వహిస్తోంది. పరిషత్‌ ఎన్నికలకు చేయాల్సిన ఏర్పాట్లను ఈ భేటీలో సమీక్షిస్తారు. 15న జిల్లా కలెక్టర్లు, ఎస్సీలు, సీఈవోలు, డీపీవోలతో ఎస్‌ఈసీ మరో సమావేశాన్ని నిర్వహించి, ఎన్నికల నిర్వహణకు సంబంధించిన ఆదేశాలివ్వనున్నట్లు తెలుస్తోంది. ఈ నెల 9వ తేదీ పాఠశాలలకు చివరి పని దినం కావడంతో ఆలోగా ఎన్నికల విధుల ఉత్తర్వులు అందేలా చర్యలు తీసుకున్నారు. ఈ నెల 15కల్లా అన్ని జిల్లాల్లో రిటర్నింట్, అసిస్టెంట్‌ రిటర్నింగ్‌ అధికారులకు శిక్షణా కార్యక్రమం పూర్తి చేసేలా కలెక్టర్లు ఏర్పాట్లు చేశారు.  ఈ నెల 20 కల్లా పోలింగ్‌ స్టేషన్ల తుది జాబితాను ప్రకటించాక, వెంటనే ఎస్‌ఈసీ తొలిదశ నోటిఫికేషన్‌ విడుదలకు ఏర్పాట్లు చేయనుంది. 

23న తొలి నోటిఫికేషన్‌... 
ఈ నెల 23న తొలి విడత ఎన్నికల నోటిఫికేషన్‌ విడుదల చేస్తే వచ్చే నెల 7న పోలింగ్‌... 27న రెండో విడతకు నోటిఫికేషనిస్తే మే 11న ఎన్నికలు... మే 1న మూడో దఫా నోటిఫికేషన్‌ జారీ చేస్తే మే 15న మూడో విడత పోలింగ్‌ నిర్వహిస్తారు. ఎన్నికలు పూర్తయినా మే 23న లోక్‌సభ ఎన్నికల ఫలితాలు వెలువడనున్న నేపథ్యంలో ఆ తర్వాతే జడ్పీటీసీ, ఎంపీటీసీ ఫలితాలు ప్రకటిస్తారు. ఈ మేరకు ఎన్నికల సంఘం కూడా ఎస్‌ఈసీకి సూచనలు చేసినట్లు సమాచారం.
 
535 జడ్పీటీసీలు, 5,857 ఎంపీటీసీలకు ఎన్నికలు... 
జిల్లాల పునర్విభజనలో భాగంగా 32 జిల్లాలు (హైదరాబాద్‌ మినహాయించి) ఏర్పడ్డాయి. ఈ మేరకు 32 జిల్లా ప్రజా పరిషత్‌లకు పరోక్ష పద్ధతిలో జడ్పీ చైర్మన్లను ఎన్నుకుంటారు. వీటి పరిధిలోని 535 గ్రామీణ మండలాలు (50 పట్టణ ప్రాంత రెవెన్యూ మండలాలు కాకుండా) మండల ప్రజా పరిషత్‌(ఎంపీపీ)లుగా కొలువుతీరనున్నాయి. వీటినే జిల్లా ప్రాదేశిక నియోజకవర్గాలు (జడ్పీటీసీ)గా పరిగణిస్తున్నందున 535 జడ్పీటీసీ స్థానాలకు, ఈ మండలాల్లోని 5,857 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా 32 జిల్లాల పరిధిలోని 5,857 ఎంపీటీసీ స్థానాల్లో 1.56 కోట్ల మంది ఓటర్లున్నట్లుగా ఎస్‌ఈసీ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. వీరిలో 78.76 లక్షల మంది మహిళలు, 77.34 లక్షల మంది పురుషులు, 313 మంది ఇతర ఓటర్లున్నారు. నల్లగొండ జిల్లాలో అత్యధికంగా 9.68 లక్షల ఓటర్లున్నారు.

ఈసీ గ్రీన్‌ సిగ్నల్‌... 
రాష్ట్రంలో జిల్లా, మండల పరిషత్, మున్సిపల్‌ ఎన్నికల నిర్వహణకు అనుమతినిస్తూ కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలిచ్చింది. ఈ ఎన్నికల కోసం రాష్ట్ర ప్రభుత్వం చేసిన అభ్యర్థనపై ఈసీ సానుకూలంగా స్పందించింది. ఈ నెల 11న రాష్ట్రంలో లోక్‌సభ ఎన్నికలు ముగిసిన తర్వాత ఎస్‌ఈసీ ఆధ్వర్యంలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు అభ్యంత రం లేదంటూ రాష్ట్ర ఎన్నికల అధికారి(సీఈవో)కు ఈసీ లేఖ రాసింది. స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో లోక్‌సభ ఎన్నికలకు సిబ్బంది కొరత లేకుండా జాగ్రత్తలు తీసు కోవాలని ఆదేశించింది.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top