పెంపుడు కుక్క కోసం...

searching for a missed dog - Sakshi

రోదిస్తున్న ఓ కుటుంబం

జూబ్లీహిల్స్‌ పరిసరాల్లో వెదుకులాట  

పేగు తెంచుకుని పుట్టిన బిడ్డలను సైతం దూరం చేసుకుంటున్న తల్లిదండ్రులు ఒకవైపు.. వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రులను రోడ్డున పడేస్తున్న కన్నబిడ్డలు మరోవైపు.. ఉన్న ఈ సమాజంలో తప్పిపోయిన మూగజీవి కోసం ఓ కుటుంబం నగరంలో వీధివీధినా గాలిస్తోంది.

హైదరాబాద్‌: వైఎస్సార్‌ జిల్లా రాజంపేట రైల్వేస్టేషన్‌ సమీపంలో నివసించే టి రంగేశ్వరరావు ఆర్టీసీ కండక్టర్‌. భార్య శాంతకుమారి, కూతుళ్లు భార్గవి సుజిత, రామ తేజస్విని. వీరు తొమ్మిదేళ్ల క్రితం దారిన పోయే ఊరకుక్కను తెచ్చుకుని అల్లారుముద్దుగా పెంచుకుంటున్నారు. ఈ దంపతులు తమకు కొడుకు లేకపోవడంతో ఆ కుక్కనే తమ కొడుకుగా భావించి సాయి అని పేరుపెట్టుకున్నారు. అప్పటి నుంచి ఇంట్లో ఒక సభ్యుడిగా ఆ కుక్క గారాబంగా పెరుగుతూ వచ్చింది. అయితే ఈ కుక్క అరుపులు భరించలేమని, అవసరమైతే చంపేస్తామని చుట్టుపక్కల వారు బెదిరించారు.

బ్లూ క్రాస్‌ నిరాకరించడంతో...
ఇరుగు పొరుగు హెచ్చరికల నేపథ్యంలో రంగేశ్వరరావు కుక్కను జూబ్లీహిల్స్‌లోని బ్లూ క్రాస్‌లో అప్పగించేందుకు బుధవారం ఉదయం తీసుకువచ్చారు. వారు ఇలాంటి కుక్కలను తీసుకోమని చెప్పడంతో మళ్లీ కడపకు తీసుకువెళ్తే కొట్టి చంపుతారేమోనని కొద్ది దూరంలో వదిలేసి తిరుగుముఖం పట్టాడు. ఇంటికి వెళ్లాక భార్యాపిల్లలకు విషయం చెప్పాడు. వారికి నచ్చలేదు.

ఎలాగైనా మళ్లీ కుక్కను తెచ్చుకుందామంటూ రాత్రికి రాత్రే కడప నుంచి బయలుదేరి గురువారం ఉదయానికి జూబ్లీహిల్స్‌కు చేరుకుని ఉదయం 6 నుంచి 10 గంటల వరకు ఆ ప్రాంతం అంతా గాలించారు. ఆచూకీ దొరకక పోవడంతో కనీసం సీసీ ఫుటేజీలో చుద్దామని జూబ్లీహిల్స్‌ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఎలాంటి ఆచూకీ దొరకక పోవడంతో ఏడుస్తూ మళ్లీ ఆ ప్రాంతంలో గాలింపు చేపట్టారు. తిండి తిప్పలు లేకుండా కుక్క కోసం వీధివీధినా నలుగురు కలసి గాలిస్తూనే ఉన్నారు.

Tags: 
Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top