మాదిగలను అన్ని విధాలా ఆదుకోవాలి

మాదిగలను అన్ని విధాలా ఆదుకోవాలి - Sakshi


ఆర్మూర్ టౌన్ : సమాజంలో అన్ని విధాలుగా వెనుకబడి ఉన్న మాదిగలు, మాదిగ ఉపకులాల వారిని అన్ని విధాలుగా ఆదుకోవాలని తెలంగాణ ఎమ్మార్పీఎస్ నాయకులు సీఎం కేసీఆర్‌ను కోరారు. తెలంగాణ ఎమ్మార్పీఎస్ రాష్ట్ర నాయకుడు నాంపల్లి, జిల్లా ఇన్‌చార్జి కొక్కెర భూమన్న మాదిగ, తదితరులు సోమవారం సీఎం కేసీఆర్‌ను హైదరాబాద్‌లో కలిసి పలు సమస్యలపై వినతిపత్రం అందజేశారు. సీఎంతో భేటీ వివరాలను కొక్కెర భూమన్న మాదిగ మంగళవారం వెల్లడించారు.



తెలంగాణ రాష్ట్రంలో 80 లక్షల మందికిపైగా ఉన్న మాదిగలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు సీఎం దృష్టికి తీసుకువచ్చినట్లు ఆయన చెప్పా రు. తెలంగాణ ఉద్యమం ద్వారా ఈ ప్రాంత ప్రజలకు విముక్తి కల్పించిన విధంగానే, సమాజంలో వెనుకబడి ఉన్న మాదిగ, మాదిగ ఉప కులాలకు విముక్తి కల్పించాలని కేసీఆర్‌ను కోరినట్లు తెలిపారు. ఎస్సీ వర్గీకరణ బిల్లును అసెంబ్లీలో ఆమోదించాలని, సీఎం నేతృత్వంలో అఖిలపక్ష బృందాన్ని ఢిల్లీ తీసుకువెళ్లి కేంద్ర ప్రభుత్వంతో చర్చించి వర్గీకరణ బిల్లుకు చట్టబద్ధత కల్పించాలని విజ్ఞప్తి చేసినట్లు చెప్పారు.



ఎస్సీల అభ్యున్నతికి వెచ్చిస్తామని చెప్పిన *50 వేల కోట్ల నుంచి మాదిగలకు 80 శాతం నిధులు కేటాయించాలని కోరడం జరిగిందన్నారు. ఎస్సీ సబ్ ప్లాన్‌లో మాదిగ, ఉపకులాలకు ప్రత్యేక కోటా కేటాయించాలని, గ్రూప్-1, గ్రూప్-2, సివిల్స్ పరీక్షల కోసం హైదరాబాద్‌లో ప్రత్యేక శిక్షణ కేంద్రం ఏర్పాటు చేయాలని కోరినట్లు తెలిపారు. ఒక్కో కుటుంబానికి మూడు ఎకరాల భూమి, లిడ్ క్యాప్ ద్వారా మాదిగ యువకులకు ఉపాధి కల్పించాలని కోరినట్లు వివరించారు.



ఇల్లు లేని వారికి ప్రభుత్వమే గృహ నిర్మాణం చేపట్టాలని, కార్పొరేట్ పాఠశాలలు, కళాశాలల్లో జీవో అనుసరించి 25 శాతం సీట్లు కేటాయించాలని విజ్ఞప్తి చేశారు. బ్యాంకుల ద్వారా బేషరతుగా రుణాలు ఇప్పించాలని కేసీఆర్‌ను కోరినట్లు భూమన్న తెలిపారు. సీఎంను కలిసిన వారిలో టీఎమ్మార్పీఎస్ జిల్లా కన్వీనర్ డప్పు చంద్రయ్య, నాయకులు మిట్టపల్లి విజయ, ఎర్ర రాంచందర్, సరికెల పోశెట్టి, సురేష్, రవి తదితరులు ఉన్నారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top