జిత్తులమారి చిరుత!

To Save Animals From Leopard Attacks In Yacharam A Cage Set Up To Trap It - Sakshi

రూటు మార్చిన వైనం  

యాచారం, కడ్తాల్‌ అటవీప్రాంతాన్ని వీడిన మృగం

ఆమనగల్లు పరిసరాల్లో సంచారం 

మరోసారి చిరుత పంజా

మంగళపల్లిలో నాలుగు మూగజీవాలపై దాడి

సాక్షి, యాచారం: చిరుత రూటు మార్చింది. యాచారం, కడ్తాల మండలాల పరిధిలోని అటవీప్రాంతంలో తలదాచుకుంటూ సమీప పొలాల్లో కట్టేసిన మూగజీవాలపై ఏడాదిగా దాడులు చేస్తోంది. చిరుత వరుసగా పంజా విసురుతుండడంతో ఎలాగైనా దానిని బంధించాలని అటవీశాఖ అధికారులు బోన్లు ఏర్పాటు చేసినా ఫలితం కనిపించలేదు. ఏకంగా జూపార్కు నుంచి ప్రత్యేక శిక్షణ పొందిన షూటర్స్‌ను రప్పించి మత్తు మందుతో చిరుతపై షూట్‌ చేయించి పట్టుకుందామన్నా ప్రయోజనం దక్కలేదు.

యాచారం, కడ్తాల, మాడ్గుల, ఆమనగల్లు మండలాల సరిహద్దులో దాదాపు 20 వేల ఎకరాల అటవీ ప్రాంతం విస్తరించి ఉండడంతో తప్పించుకోవడం దానికి సులువుగా మారింది. ఆరు నెలలుగా ఫారెస్టు అధికారులు దానిని పట్టుకోవడానికి తీవ్రంగా యత్నిస్తున్న విషయం తెలిసిందే. రెండు మండలాల్లో 25 చోట్ల గొర్రెలు, మేకలు, దూడలపై దాడులు చేసి చంపేసింది. కాగా, సీసీ కెమెరాల్లో దాని కదలికలు నిక్షిప్తమయ్యాయి. బోన్లకు మాత్రం చిక్కలేదు. అటవీప్రాంతంలో ఒకే చిరుత ఉందా... లేదా రెండు, మూడు ఉన్నాయా అనే విషయం తెలుసుకోవడం కోసం అటవీ ప్రాంతంలో పలు చోట్ల సీసీ కెమెరాలు బిగించినట్లు ఫారెస్టు అధికారి సత్యనారాయణ తెలిపారు. వర్షాలు కురుస్తుండడంతో అటవీప్రాంతం పచ్చగా మారిందన్నారు.   

చిరుత కోసం ఏర్పాటు చేసిన బోను

తనిఖీలతోనే రూటు మార్చిందా..?   


పల్లెచెల్క తండాలో రైతులకు అవగాహన కల్పిస్తున్న ఫారెస్టు అధికారులు

ఏడాది కాలంగా యాచారం, కడ్తాల మండలాల పరిధిలోని పలు గ్రామాల్లో దాడులు చేసిన చిరుత రైతులకు, అటవీశాఖ అధికారులకు కంటి మీద కునుకు లేకుండా చేసింది. దీంతో చేసేదేమీ లేక అటవీశాఖ అధికారులు సమీప గ్రామాల్లో రైతులను చైతన్యం చేసి అటవీ ప్రాంతం సమీపంలోని పొలాల్లో గొర్రెలు, మేకలు, పశువులను కట్టేయకుండా అవగాహన కల్పించారు. అడవిలో తిరుగుతున్న చిరుత మూగజీవాలపై దాడులు చేయకుండా అరికట్టేందుకు యాచారం మండల పరిధిలోని తాడిపర్తి, కుర్మిద్ద అట ప్రాంతంతోపాటు కడ్తాల మండల పరిధిలోని చరికొండ, పల్లెచల్కతండా అటవీ ప్రాంతంలో 34 జింకలను ఇటీవల ఫారెస్టు అధికారులు వదిలేశారు.

జింకలను వదిలినప్పటి నుంచి అది యాచారం, కడ్తాల మండలాల్లో దాడులు జరగలేదు. తాజాగా యాచారం, కడ్తాల మండలాల పరిధిలోని అటవీప్రాంతం వదిలేసి 10 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఆమన్‌గల్లు మండల పరిధిలోని మంగల్‌పల్లి, చంద్రయ్యపల్లి తండా సమీపంలోని పొలాల్లో కట్టేసి ఉన్న పశువులపై దాడులు చేయడం ఆరంభించింది. ఆమనగల్లు మండలం మంగళపల్లి సమీపంలో సోమవారం రాత్రి పొలాల వద్ద ఉన్న దూడను చంపి దాదాపు కిలోమీటరు దూరం వరకు చిరుత లాక్కెళ్లింది. మూడు రోజుల క్రితం ఆమనగల్లు మున్సిపాలిటీ పరిధిలోని చంద్రాయణపల్లి తండాలో రైతు బిచ్చానాయక్‌కు చెందిన ఆవుపై దాడి చేసి చంపేసిన విషయం తెలిసిందే. చిరుత అటవీ ప్రాంతంలో వదిలిన జింకలను కనిపెట్దిందా.. లేదా ఆహారం కోసమే ఆమనగల్లు మండల పరిధిలోని పొలాల్లోని పశువులపై దాడి చేస్తోందా..? లేదా వచ్చిన దారిగుండా నల్లమల్ల అటవీ ప్రాంతంలోకి రూటు మార్చిందా అనే విషయం తెలియడం లేదు. వరుస దాడులతో రైతులు భయాందోళనకు గురవుతున్నారు. 

ప్రత్యేక టీంలను పంపాం 
ఆమన్‌గల్లు మండలంలోని పలు గ్రామాల సమీపంలో చిరుత సంచరిస్తూ పశువులపై దాడులు చేస్తోంది. దీంతో కందుకూరు డివిజన్‌ నుంచి రెండు ప్రత్యేక టీం బృందాలను ఆమనగల్లుకు పంపాం. దాడులు చేసిన చోటుకు చిరుత మళ్లీ వస్తుందనే ఉద్దేశంతో సీసీ కెమెరాలు, బోన్లు ఏర్పాటు చేశాం. పులి నిత్యం ఆహారం కోసం 25 కిలోమీటర్ల మేర సంచరిస్తోంది. ఈక్రమంలో అది నల్లమల్ల అడవులకు వెళ్లే అవకాశం లేకపోలేదు. రైతులు అప్రమత్తంగా ఉండాలి.         
  – సత్యనారాయణ, అటవీశాఖ రేంజ్‌ అధికారి 

 మరోసారి చిరుత పంజా 


చిరుత దాడిలో మృతిచెందిన దూడను పరిశీలిస్తున్న సర్పంచ్‌ నర్సింహారెడ్డి 

సాక్షి, ఆమనగల్లు: ఆమనగల్లు మండలంలో మరోసారి చిరుత పంజా విసిరింది. మంగళపల్లి గ్రామ సమీపంలో సోమవారం రాత్రి వ్యవసాయ పొలాల వద్ద ఉన్న మూగజీవాలపై చిరుత దాడి చేసింది. ఒక దూడను చంపి దాదాపు కిలోమీటర్‌ దూరం లాక్కెళ్లి వదిలేసింది. వివరాల్లోకి వెళితే.. మండలంలోని మంగళపల్లి గ్రామ సమీపంలో తిప్పిరెడ్డి వెంకట్‌రెడ్డి, శ్రీనివాస్‌రెడ్డి, పర్వతాలు తదితర రైతులు తమ పాడి పశువులను వ్యవసాయ పొలం వద్ద షెడ్డుల్లో కట్టేశారు. సోమవారం రాత్రి శ్రీనివాస్‌రెడ్డి, పర్వతాలుకు చెందిన ఆవులపై చిరుత దాడి చేసి స్వల్పంగా గాయపరిచింది. అనంతరం తిప్పిరెడ్డి వెంకట్‌రెడ్డికి చెందిన రెండు బర్రె దూడలపై దాడిచేసింది. ఇందులో దూడ గొంతును చిరుత తీవ్రంగా గాయపర్చింది. మరో దూడను దాదాపు కిలోమీటరు దూరం లాక్కెళ్లి హతమార్చింది. ఉదయాన్నే పొలాల వద్దకు వెళ్లిన రైతులు పశువులపై చిరుత దాడి చేయడాన్ని గుర్తించారు. వెంటనే సమాచారాన్ని అటవీ శాఖ అధికారులకు అందించారు.  

అధికారుల సందర్శన.. 
మంగళపల్లి గ్రామ సమీపంలో చిరుత మూగజీవాలపై దాడి చేసిన సంఘటనా స్థలాన్ని ఆమనగల్లు ఎఫ్‌ఆర్‌ఓ కమాలుద్దీన్, సర్పంచ్‌ తిప్పిరెడ్డి నర్సింహారెడ్డి, స్థానిక నాయకులు సందర్శించారు. చిరుత దాడిలో మృతిచెందిన దూడ, తీవ్రంగా గాయపడిన బర్రె దూడలను వారు పరిశీలించారు. చిరుతను బంధించడానికి బోను ఏర్పాటు చేస్తామని ఫారెస్ట్‌ రేంజ్‌ అధికారి కమాలుద్దీన్‌ తెలిపారు. మూడు రోజుల క్రితం చంద్రాయణపల్లితండా సమీపంలో బోను, నాలుగు అధునాతన కెమెరాలు ఏర్పాటు చేయడం జరిగిందని ఆయన వివరించారు. మంగళపల్లి గ్రామసమీపంలో మంగళవారం రాత్రికి చిరుతను బంధించడానికి బోను ఏర్పాటు చేస్తామని ఆయన వివరించారు. రైతులు భయాందోళనలు చెందవద్దని చిరుతను బంధించడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నట్లు ఆయన వివరించారు. 

చంద్రాయణపల్లి సమీపంలో చెట్టుకు  ఏర్పాటు చేసిన కెమెరా

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top