సర్కారీ నిర్మాణాలకు ఇసుక తంటా!

Sand problem to the govt structures - Sakshi

‘కాళేశ్వరం’నుంచే రాష్ట్రానికి ఇసుక

మేడిగడ్డ, అన్నారం రీచ్‌ల నుంచి రవాణా 

ఏడీలకు టీఎస్‌ఎండీసీ మౌఖిక ఆదేశాలు 

మార్చి నుంచి పట్టా భూముల్లో ఇసుక రవాణా నిలిపివేత 

రాష్ట్రంలో 290 రీచ్‌లు ఉన్నా, 20 యార్డుల నుంచే వెలికితీత 

హైదరాబాద్‌లో నిర్మాణాలకు కాళేశ్వరం నుంచే ఇసుక

సాక్షి ప్రతినిధి, మంచిర్యాల: రాష్ట్రంలో జరుగుతున్న సర్కారీ పనులకు ఇసుక సరఫరా ఇబ్బందిగా మారింది. గోదావరి నదిపై చేపడుతున్న కాళేశ్వరం ప్రాజెక్టుకు ఇసుక రవాణాకు ప్రభుత్వం ముడిపెట్టింది. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా చేపడుతున్న మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల్లో నిర్ధేశించిన నీటి సామర్థ్యానికి అనుగుణంగా ఇక్కడున్న ఇసుకను వెలికితీసే ప్రక్రియను టీఎస్‌ఎండీసీకి ప్రభుత్వం అప్పగించింది. ఈ డీసిల్టింగ్‌ (పూడికతీత) ఆపరేషన్‌లో భాగంగా వెలికితీసిన ఇసుకనే రాష్ట్రంలో చేపడుతున్న ప్రభుత్వ ప్రాజెక్టులన్నింటికి వినియోగిస్తోంది.

అలాగే, హైదరాబాద్‌తో పాటు ఇతర జిల్లాల్లో జరిగే భారీ ప్రైవేటు నిర్మాణ ప్రాజెక్టులకు సైతం గోదావరి పరిధిలోని ఆరు జిల్లాలు, కృష్ణా పరిధిలోని వనపర్తి నుంచి మాత్రమే ఇసుక రవాణాకు టీఎస్‌ఎండీసీ అనుమతులు ఇస్తోంది. దీంతో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 290 టీఎస్‌ఎండీసీ ఇసుక రీచ్‌ల్లో కేవలం ఏడు జిల్లాల్లో ఉన్న సుమారు 20 రీచ్‌ల నుంచే ప్రస్తుతం ఇసుక రవాణా జరుగుతుండగా, సర్కారీ పనులకు మాత్రం పూర్తిగా జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా పరిధిలోని మేడిపల్లి, అన్నారం బ్యారేజీల నుంచే రోజుకు 10వేల నుంచి 15వేల క్యూబిక్‌ మీటర్ల ఇసుక రవాణా జరుగుతోంది. ఈనెల ఒకటో తేదీ నుంచి మంగళవారం వరకు 24 రోజుల్లో భూపాలపల్లి జిల్లాలోని 13 ఇసుక రీచ్‌ల నుంచి 18,068 ఆర్డర్ల ద్వారా 2.46 లక్షల క్యూబిక్‌ మీటర్ల ఇసుకను తరలించారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ఇసుక రీచ్‌లలో కలిపి 2 లక్షల క్యూబిక్‌ మీటర్ల ఇసుక రవాణా జరిగింది. ప్రభుత్వం నిర్మిస్తున్న డబుల్‌ బెడ్రూం ఇళ్లతో పాటు నీటిపారుదల శాఖ మినహా ఇతర అన్ని శాఖలు జరిపే నిర్మాణాలకు ఇక్కడి నుంచే ఇసుక వెళ్తుండటం గమనార్హం.  

టీఎస్‌ఎండీసీ ఆధ్వర్యంలోనే...  
ఇసుక మాఫియా ఆగడాలను అరికట్టే ఉద్దేశంతో ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా ఇసుక రీచ్‌(స్టాక్‌ యార్డ్‌)ల నిర్వహణను టీఎస్‌ఎండీసీకి అప్పగించింది. ఈ మేరకు రాష్ట్రంలో 290 ఇసుక రీచ్‌లను గుర్తించిన టీఎస్‌ఎండీసీ అక్కడి నుంచే క్యూబిక్‌ మీటర్‌కు రూ. 550 చెల్లించి ఎవరైనా తీసుకెళ్లేలా ఏర్పాట్లు చేసింది. సాండ్‌ సేల్‌ మేనేజ్‌మెంట్‌ అండ్‌ మానిటరింగ్‌ సిస్టం (ఎస్‌ఎస్‌ఎంఎంఎస్‌) విధానం ద్వారా ఆన్‌లైన్‌లోనే ఇసుకను క్యూబిక్‌ మీటర్ల చొప్పున బుక్‌ చేసుకొని పొందే ఏర్పాట్లు చేసింది. అయితే, గత మార్చి నెల నుంచి ప్రభుత్వరంగంలో ఎలాంటి అవసరాలకైనా నేరుగా భూపాలపల్లి జిల్లాలో గోదావరి నదిపై మేడిపల్లి, అన్నారం వద్ద నిర్మిస్తున్న బ్యారేజీల డీసిల్టింగ్‌ ఇసుకనే తీసుకెళ్లే ఏర్పాట్లు చేసింది. మంచిర్యాల జిల్లాలో జరిగే నిర్మాణాలకు సైతం పక్కనున్న చెన్నూరు నుంచి కాకుండా కాళేశ్వరం వెళ్లి ఇసుకను తెచ్చుకొనే పరిస్థితి. తద్వారా ప్రభుత్వపరమైన నిర్మాణాలకు సంబంధించి ఇబ్బందులు ఎదురవుతున్నట్లు ఆయా జిల్లాలకు సంబంధించిన ప్రభుత్వ కాంట్రాక్టర్లు వాపోతున్నారు. 

ఐదు కోట్ల క్యూబిక్‌ మీటర్ల ఇసుక 
భూపాలపల్లి జిల్లాలో 45 ఇసుక రీచ్‌లను టీఎస్‌ఎండీసీ గుర్తించగా, అందులో 34 రీచ్‌లు మేడిగడ్డ, అన్నారం బ్యారేజీల డీసిల్టింగ్‌ ఆపరేషన్‌లో భాగ మే. మేడిగడ్డ బ్యారేజీలో 16.17 టీఎంసీల నీటి నిల్వకు అనుగుణంగా 3.25 కోట్ల క్యూబిక్‌ మీటర్ల ఇసుకను తరలించాలనేది ప్రణాళిక. ఇందుకోసం 23 రీచ్‌లను టెండర్ల ద్వారా కాంట్రాక్టర్లకు అప్పగించారు. 11.9 టీఎంసీల నీటి సామర్థ్యం గల అన్నారం బ్యారేజీ కోసం 1.75 కోట్ల క్యూబిక్‌ మీ టర్ల ఇసుకను తరలించేందుకు 11 టెండర్లు పిలిచారు. 9 టీఎంసీల నీటి సామర్థ్యం గల సుందిళ్ల బ్యారేజీకి సంబంధించి ఇసుక రీచ్‌ల వేలం జరగలేదు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని ఖమ్మం, మ హబూబ్‌నగర్, నల్లగొండ, హైదరాబాద్‌ వంటి దూరప్రాంతాల్లో జరిగే ప్రభుత్వ నిర్మాణ కార్యక్రమాలకు సైతం ఇసుకను ఇక్కడి నుంచే తరలిస్తున్నారు. 

మూతపడ్డ పట్టా భూముల ఇసుక రీచ్‌లు 
ఈ ప్రాజెక్టు మొదలు కాకముందు వరకు రాష్ట్రంలో సుమారు 60 నుంచి 70 వరకు ప్రైవేటు ఇసుక రీచ్‌లు ఉండేవి. గోదావరి, కృష్ణా నదులకు ఆనుకొని ఉన్న పట్టా భూముల్లోని ఇసుకను ప్రభుత్వమే తీసుకొని ఒక్కో క్యూబిక్‌ మీటర్‌కు రూ. 250 వరకు చెల్లించేది. అయితే, కాళేశ్వరం ప్రాజెక్టు కారణంగా కోట్ల క్యూబిక్‌ మీటర్ల ఇసుక సర్కారుకు అందుబాటులోకి రావటంతో పట్టా భూముల నుంచి ఇసుకను తీసుకోవడం ఆపేసింది. గతంలో ఎక్కువ శాతం పట్టా భూముల్లోని ఇసుకనే ప్రభుత్వ నిర్మాణ అవసరాలకు వినియోగించుకొనే వారు. ఇప్పుడు అది కూడా మూతపడడంతో మేడిపల్లి, అన్నారం నుంచే ఇసుకను తీసుకెళ్లక తప్పని పరిస్థితి ఏర్పడింది.

‘మహారాష్ట్ర’కు అనుమతి ఎందుకు?
కాళేశ్వరం ప్రాజెక్టు కింద ఇసుక పుష్కలంగా లభిస్తుండగా, మహారాష్ట్ర నుంచి రాష్ట్రానికి ఇసుక రవాణాకు ప్రభుత్వం అనుమతిచ్చింది. కొత్తగూడెం జిల్లా భద్రాచలం, నిజామాబాద్‌ జిల్లా సాలూరా, భూపాలపల్లి జిల్లా కాళేశ్వరం వద్ద చెక్‌పోస్టులను ఏర్పాటు చేసిన ప్రభుత్వం మహారాష్ట్ర నుంచి ఎన్ని లారీలైనా ఈ మూడు ప్రాంతాల గుండా రాష్ట్రానికి వచ్చేందుకు అనుమతిచ్చింది. తద్వారా ఈ ఏడాది ఏప్రిల్‌ నుంచి మంగళవారం వరకు 35,555 ఆర్డర్ల ద్వారా 6.45 లక్షల టన్నుల ఇసుక రవాణా అయింది. టన్ను ఇసుకకు కేవలం రూ. 200 రాయల్టీగా తీసుకొని ప్రభుత్వం ఈ ఇసుక లారీలను రాష్ట్రంలోకి అనుమతిస్తోంది. ఈ లెక్క ప్రకారం అంతర్రాష్ట్ర ఇసుక అనుమతుల ద్వారా ప్రభుత్వానికి రూ. 12.90 కోట్ల ఆదాయం సమకూరింది. కానీ, రాష్ట్రంలోని ఇసుక రీచ్‌ల ద్వారా ఒక క్యూబిక్‌ మీటర్‌కు రూ. 550 టీఎస్‌ఎండీసీకి జమవుతోంది. అంటే దాదాపు రెండింతల ఆదాయాన్ని పోగొట్టుకున్నట్టే.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top