'దేశంలోని ఆలయాలన్నీ తిరిగా'

Sakshi Personal Interview With Adilabad ZP Chairperson Rathod Janardhan

ఆదిలాబాద్‌ జిల్లా పరిషత్‌ చైర్మన్‌ రాథోడ్‌ జనార్దన్‌

సాక్షి, నార్నూర్‌(ఆసిఫాబాద్‌) : ‘పేద కుటుంబంలో పుట్టి..ఎన్నో కష్టాలు పడ్డా. కాలినడకన వెళ్లి చదువుకున్న. రెవెన్యూ శాఖలో డిప్యూటీ సర్వేయర్‌గా ఉద్యోగం వచ్చింది. ఇందులోనూ పదోన్నతులు పొంది అనుకోకుండా రాజకీయాల్లోకి వచ్చిన. అప్పుడప్పుడు కుటుంబ సభ్యులతో కలిసి దేవస్థానాలకు వెళ్తుంటా. దాదాపు దేశంలోని అన్ని దేవాలయాలు తిరిగా. జీవితంలో కుటుంబంతో కలిసి తిరగని స్థలం అంటూ ఏది లేదు’ అంటున్నారు ఆదిలాబాద్‌ జిల్లా పరిషత్‌ చైర్మన్‌ రాథోడ్‌ జనార్దన్‌.

‘సాక్షి పర్సనల్‌ టైం’లో ఆయన మరెన్నో విషయాలు వెల్లడించారు.  మా సొంతూరు నార్నూర్‌ మండలంలోని భీంపూర్‌ గ్రామం. మా నాన్న చిన్యా, అమ్మ హీరాబాయి. మొత్తం ఎనిమిది మంది సంతానం. అందులో ఐదుగురు అన్నదమ్ములు, ముగ్గురు అక్కాచెల్లెలు. మాది వ్యవసాయ కుటుంబం. నాన్న కష్టపడి చదివించారు. నేను ఒకటో తరగతి నుంచి ఐదో తరగతి వరకు భీంపూర్‌లో చదువుకున్నా. తర్వాత ఇంటర్‌ వరకు ఉట్నూర్‌లో చదివిన. అప్పుడు మా గ్రామానికి రోడ్డు సరిగా లేదు. కాలినడకన వెళ్లే వాళ్లం. చాలా కష్టపడి చదువుకున్నా.

ఒకానొక సందర్భంలో మా సొంతూరి నుంచి ఉట్నూర్‌ దాదాపు 20 కి.మీ. కాలినడకన వెళ్లిన సందర్భాలు ఉన్నాయి. బీఏ పూర్తి చేశాను. 1990 నవంబర్‌ 1వ తేదీన నాకు డిప్యూటీ సర్వేయర్‌గా (టీజీఎంఎస్‌) ఉద్యోగం వచ్చింది. 1991లో భీంపూర్‌ గ్రామానికి చెందిన కవితతో వివాహామైంది. ఆమెకు కూడా 1998లో రెవెన్యూశాఖలో వీఆర్వో ఉద్యోగం వచ్చింది. అప్పటి నుంచి ఇద్దరం ఉద్యోగ రిత్యా చాలా బిజీ అయ్యాం. సర్వేయర్‌గా సొంత మండలంలో విధులు నిర్వహించడం సంతృప్తినిచ్చింది. డిప్యూటీ ఇన్‌స్పెక్టర్, అసిస్టెంట్‌ డైరెక్టర్‌ (ఏడీ)గా కుమురంభీం జిల్లాలో విధులు నిర్వహించాను. 

ఎక్కువ సమయం కుటుంబ సభ్యులతో గడుపుతా..
నేను నా భార్య కవిత ఇద్దరం ప్రభుత్వ ఉద్యోగులమే. కుమారులు సరేందర్, నరేందర్‌. విధి నిర్వహణలో భాగంగా పిల్లలకు చాలా దూరం అయ్యే వాళ్లం. అప్పుడు చాలా బాధనిపించేది. అయినా వారి భవిష్యత్‌ దృష్ట్యా కొన్ని సందర్భాల్లో కఠిన నిర్ణయాలు తీసుకునే వాళ్లం. సెలవు రోజు సమయం దొరికితే పిల్లలతో ఎక్కువగా గడిపే వాళ్లం. వారిని పార్కు, షాపింగ్‌కు తీసుకెళ్లే వాళ్లం. నాకు ఐదెకరాల వ్యవసాయం ఉంది. ఉద్యోగ సమయం అయిపోగానే వ్యవసాయ పనులు చూసుకొని ఇంటికి వెళ్లేవాన్ని.

మిగతా సమయంలో ఇంట్లోనే ఉంటా. అప్పుడప్పుడు కుటుంబ çసభ్యులతో కలిసి దేవస్థానాలకు వెళ్తుంటా. దాదాపు దేశంలోని అన్ని దేవాలయాలు తిరిగాను. మహారాష్ట్రలోని పండరిపూర్, మహోర్, పౌరదేవి, గురుద్వార్, షిర్డీ, తిరుపతి, విజయవాడ దుర్గామాత దేవాలయాలతోపాటు బాసరను కుటుంబ సభ్యులతో కలిసి దర్శించుకున్నాను. మూడు నెలల క్రితం పశ్చిమబెంగాల్‌లోని నికోబార్‌ దీవులను సందర్శించి బోటింగ్‌ చేసి కుటుంబ సభ్యులతో సరదగా గడిపాం. దాదాపు నెల రోజులు కన్యాకుమారి నుంచి కాశీ వరకు తిరిగాం. జీవితంలో కుటుంబంతో కలిసి తిరగని స్థలం లేదు. ఇక ఇంట్లో ముగ్గురం మాత్రమే ఉంటాం. చిన్న కొడుకు మాతోనే ఉంటాడు. పెద్దోడు అపోలో హైదరాబాద్‌లో ఉద్యోగం చేస్తాడు. 

సామాజిక సేవలు

  • జనంతో మనం స్వచ్ఛంద సంస్థ ఏర్పాటు చేసి ఉట్నూర్‌ ప్రాంతంలో ఉచితంగా అంబలి పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టాం. వ్యవస్థాపక అధ్యక్షుడిగా ఉండి గిరిజన గ్రామాలకు ట్యాంకర్ల ద్వారా తాగునీటిని పంపిణీ చేసిన. 
  • చైతన్య సంప్రదాయ దార్మిక సంస్థ ఆధ్వర్యంలో 2000 సంవత్సరం నుంచి ఈరోజు వరకు ఏటా 2 వేల నుంచి 3 వేల మందికి ప్రత్యేక రైలు ఏర్పాటు చేసి పండరిపూరి యాత్రకు తీసుకెళ్తాం. గిరిజన ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడిగా, లంబాడీ హక్కుల పోరాట సమితి జిల్లా అధ్యక్షుడిగా, ఆధ్యాత్మిక గురువు సేవాలాల్‌ మహారాజ్‌ జయంతి కమిటీ అధ్యక్షుడిగా ఉంటూ సేవా కార్యక్రమాలు నిర్వహించాను. తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించినందుకు ప్రభుత్వం అవార్డుతో సత్కరించింది.   
Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top