భవితకు భరోసా

భవితకు భరోసా - Sakshi


 ‘సాక్షి భవిత ఎడ్యుకేషన్ ఫెయిర్’ కు విశేష స్పందన

 

ఎంసెట్ ఫలితాలు వచ్చి వారం రోజులైంది. ఇప్పడే స్టూడెంట్స్‌కు, వారి తల్లిదండ్రులకు అసలైన పరీక్ష మొదలైంది. ఏ కళాశాల్లో చేరాలి, ఏ కోర్సును ఎంచుకోవాలి, ఎంచుకున్న  కోర్సులు తమ పిల్లలకు ఉజ్వల భవిష్యత్తును అందించగలుగుతాయా.. లేదా? ఇలాంటి ఎన్నో సందేహాలతో ఉన్న విద్యార్థులకు, తల్లిదండ్రులకు ‘సాక్షి భవిత ఎడ్యుకేషన్ ఫెయిర్-2014’ చక్కని వేదికగా నిలిచింది. ఖైరతాబాద్‌లోని ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇంజినీర్స్‌లో ‘సాక్షి ’ ఏర్పాటుచేసిన ఎడ్యుకేషన్ ఫెయిర్‌ను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ ఎల్.వేణుగోపాలరెడ్డి శనివారం ప్రారంభించారు.



నగరం నలుమూలల నుంచి వచ్చిన విద్యార్థులు, వారి తల్లిదండ్రులతో ఫెయిర్ తొలిరోజు కిటకిటలాడింది.  సాక్షి టీవీ మేనేజింగ్ డెరైక్టర్ రాణిరెడ్డి, సాక్షి ఫైనాన్స్ డెరైక్టర్ వైఈపీరెడ్డి, మార్కెటింగ్ డెరైక్టర్ కేఆర్‌పీ రెడ్డి, సీజీఎం శ్రీధర్, డీజీఎం సంతోష్, ఏజీఎం వినోద్, సాక్షి భవిత ఇంచార్జి ధనుంజయరెడ్డి, వివిధ సంస్థల తరపున నిపుణులు పాల్గొన్నారు.ఈ ఎడ్యుకేషన్ ఫెయిర్ ఆదివారం కూడా కొనసాగుతుంది.    

 

ఏఏ సంస్థలు పాల్గొన్నాయంటే..




సాక్షి భవిత ఎడ్యుకేషన్ ఫెయిర్ కు వెల్లూరు ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఈవెంట్ స్పాన్సర్‌గా, భారత్ ఇనిస్టిట్యూట్స్ అసోసియేట్ స్పాన్సర్‌గా, ఐసీబీఎం-ఎస్‌బీఈ కో-స్పాన్సర్‌గా, వైఈఎస్(యూత్ ఎంప్లాయిబిలిటీ సర్వీసెస్) నాలెడ్జి పార్టనర్‌గా, 92.7బిగ్ ఎఫ్‌ఎం రేడియో పార్టనర్‌గా వ్యవహరించాయి.

 

ఫెయిర్‌లో.. జేబీ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇంజినీరింగ్  అండ్ టెక్నాలజీ, హోలీమేరీ గ్రూప్ ఆఫ్ ఇనిస్టిట్యూషన్స్, వీపీఆర్ గ్రూప్, సెయింట్ పీటర్స్ ఇంజినీరింగ్ కళాశాల, స్టాన్లీ కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ అంట్ టెక్నాలజీ ఫర్ ఉమెన్, ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఏరోనాటికల్ ఇంజినీరింగ్, బండారి శ్రీనివాస్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, కేజీరెడ్డి కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ, శ్రీదేవి ఎడ్యుకేషనల్ సొసైటీ, గీతం హైదరాబాద్ బిజినెస్ స్కూల్, డాక్టర్ వైఎస్సార్ నిథిమ్, సీఎంఆర్ గ్రూప్ ఆఫ్ ఇనిస్టిట్యూషన్స్, శ్రేయాస్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ, మల్లారెడ్డి గ్రూప్ ఆఫ్ ఇనిస్టిట్యూషన్స్, సెయింట్ మార్టిన్స్ ఇంజినీరింగ్ కళాశాల, బ్రిలియంట్ గ్రూప్ ఆఫ్ ఇనిస్టిట్యూషన్స్, గ్లోబల్ అండ్ వివేకానంద గ్రూప్ ఆఫ్ ఇనిస్టిట్యూషన్స్, సీటీ గ్రూప్ ఆఫ్ ఇనిస్టిట్యూషన్స్, ఎన్‌ఆర్‌ఐ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, ప్రిన్స్‌టన్ అండ్ ఎస్పీఆర్ గ్రూప్ ఆఫ్ ఇనిస్టిట్యూషన్స్, డీవీఆర్ కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ, ఆర్‌ఎఫ్‌ఎస్-ఐఏసీజీ .. తదితర సంస్థలు తమ స్టాల్స్‌ను ఏర్పాటు చేశాయి.

 

‘సివిల్ ఇంజినీరింగ్’ ది బెస్ట్



ఉద్యోగ, ఉపాధి అవకాశాల పరంగా చూస్తే సివిల్ ఇంజినీరింగ్ కోర్సు ఎంపిక అత్యుత్తమం. మెకానికల్, ఈసీఈ కోర్సులది తరువాత స్థానాలే. రహదారులు, రిజర్వాయర్లు, డ్యామ్‌లు, బ్రిడ్జిలు ఇ లా.. ప్రపంచంలో ప్రతి అంశం సివిల్ ఇంజినీరింగ్‌తోనే ముడిపడి ఉంది. దేశవ్యాప్తంగా ప్రస్తుతం 25లక్షలమంది సివిల్ ఇంజినీర్లు కావాల్సి ఉంటే ఏడాదికి 1.2లక్షల మంది వస్తున్నారు.



ఆంధ్రప్రదేశ్‌లోనైతే అన్ని కళాశాలల్లో కలిపి 27500 సీట్లు మాత్రమే ఉన్నాయి. సివిల్ ఇంజినీరింగ్‌లో బీటెక్, ఎంటెక్ పూర్తి చేసిన వారికి మంచి వేతనాలు కూడా లభిస్తున్నాయి. సివిల్ ఇంజినీరింగ్ ద్వారా మంచి కెరీర్ కోసం ఎన్నో మార్గాలున్నాయి. సివిల్ ఇంజినీర్లలో 30-35శాతం మంది అమ్మాయిలకు మంచి అవకాశాలు లభిస్తున్నాయి. భవిష్యత్తులో దేశ్యాప్తంగా స్మార్ట్ సిటీల నిర్మాణంలో సివిల్ ఇంజినీర్లదే కీలక భూమిక కానుంది.     

-ఎం.కిషోర్, ఆర్వీ ఆసోసియేట్స్ డెరైక్టర్

 

లెక్కలొస్తేనే మెకానికల్..



 మ్యాథమేటిక్స్, ఫిజిక్స్ పట్ల ఆసక్తి ఉంటేనే మెకానికల్ ఇంజినీరింగ్‌లో రాణిస్తారు. ఇంటర్ తర్వాత విద్యార్థుల ముందున్న లక్ష్యాలు రెండు. ఒకటి మంచి కోర్సులో డిగ్రీ చదవడం, రెండోది మంచి కెరీర్‌ను అందుకోవడం. నేటి తరం మెకానికల్ విద్యార్థులు అన్ని రంగాల్లోనూ అవకాశాలను అందిపుచ్చుకుంటున్నారు.  క్రియేటివ్ మైండ్ ఉన్నవారికి మెకానికల్ ఇంజినీరింగ్ మంచి అవకాశం.

 - సి.వెంకటేశ్, కేఫోర్ మెట్రిక్స్ ప్రిన్సిపల్ పార్టనర్

 

 ఇదో సదావకాశం



 సాక్షి భవిత నిర్వహించిన ఎడ్యుకేషన్ ఫెయిర్లకు గతంలో కూడా నేను వచ్చాను. దాదాపు పాతికకు పైగా విద్యా సంస్థలకు సంబంధించిన సమాచారం విద్యార్థులకు ఒకే వేదికపై లభించడం ఉపకరిస్తుంది. వివిధ ఇంజినీరింగ్ కోర్సులు, కళాశాలల్లో మౌలిక వసతులు.. తదితర అంశాలపై ఇప్పటికే విద్యార్థులు, వారి తల్లిదండ్రులు తాము సేకరించిన సమాచారాన్ని మరోమారు నిర్ధారణ చేసుకునేందుకు కూడా సాక్షి ఎడ్యుకేషన్ ఫెయిర్ చక్కటి అవకాశం. ఇంజినీరింగ్ కోర్సుల్లో చేరే విషయమై తల్లిదండ్రులు విద్యార్థుల ఇష్టాఇష్టాలకు ప్రాధాన్యం ఇవ్వాలి.  మంచి కళాశాలలను ఎంచుకున్న మాత్రాన సరిపోదు. తగినంత హార్డ్‌వర్క్ చేస్తేనే వారి కలలు నెరవేరతాయి.     

- ఎల్.వేణుగోపాలరెడ్డి, ఏపీఎస్‌సీహెచ్‌ఈ చైర్మన్

 

అవకాశాలకు ఆకాశమే హద్దు



ఇంజినీరింగ్‌లో నైపుణ్యం ఉన్నవారికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలకు ఆకాశమే హద్దు. నాలుగేళ్ల ఇంజినీరింగ్ కోర్సుతో పాటు అదనపు కోర్సులు కూడా నేర్చుకుంటే మంచి అవకాశాలు లభిస్తాయి. ఐఐటీ వంటి విద్యాలయంలో చదివిన వారిలో కొందరి వార్షికాదాయం రూ.నాలుగైదు కోట్లు ఉంటుంటే మరికొందరి వేతనాలు ఇరవై నుంచి 30లక్షలు మాత్రమే ఉంటున్నాయి. ఇందుకు కారణం విషయ పరిజ్ఞానంతో పాటు సమర్థత కలిగి ఉండడమే. మంచి ప్రావీణ్యం కలిగిన వారే గొప్ప ఇంజినీర్లు కాగలరు. ఇంజినీరింగ్‌లో ఏ బ్రాంచ్ చదవాలనేది ముఖ్యం కాదు. ఏబ్రాంచ్‌లో చదివినా టాప్ 30శాతం మంది విద్యార్థులకు అవకావాలు ఇట్టే లభిస్తాయి. ఇంజినీరింగ్ పూర్తయ్యేలోగా మంచి కమ్యూనికేషన్ స్కిల్స్, సాఫ్ట్ స్కిల్స్ కలిగి ఉండడం ఎంతో ముఖ్యం.      

-టి.మురళీధరన్, టీఎంఐ గ్రూప్ చైర్మన్

 

 సిబ్బంది విపులంగా వివరించారు

 ఇంటర్ తరువాత ఇంజనీరింగ్, మెడిసన్, ఫార్మసీ కోర్సులున్నాయి. ఆ కోర్సుల్లో ఏ కాలేజీలో చేరితే మంచి భవిష్యత్ ఉంటుందో అర్థమైంది. స్టాల్స్‌లోని సిబ్బంది  విపులంగా వివరించారు.     

 - శరత్‌కుమార్

 

అవగాహన వచ్చింది

ఏ కోర్సుల్లో చేర్పిస్తే బాగుంటుందో తెలియక తికమకపడ్డాం...ఇక్కడికొచ్చాక మా సందేహాలు నివృత్తి అయ్యాయి. నగరంలోని ప్రముఖ కాలేజీలు, వాటి ప్రత్యేకతలు తెలుసుకున్నాం.      

 - జీవనజ్యోతి

 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top