నీడ కోసం వచ్చి కుప్పకూలిన మహిళ 

A sad story of women - Sakshi

ఆస్పత్రికి వెళుతూ అనంతలోకాలకు.. 

శంషాబాద్‌: రెండు రోజులుగా ఒంట్లో సుస్తీ చేయడంతో ఓ తల్లి తన ఇద్దరు కుమార్తెలను తీసుకుని ఆస్పత్రికి బయలుదేరింది. ఎండవేడిమికి తాళలేక కాసేపు బస్టాండ్‌ సమీపంలో మూసి ఉన్న దుకాణ సముదాయం ముందు కూర్చొని.. అక్కడే కుప్ప కూలి మృతి చెందింది. చెంతనే ఉన్న చిన్నారులకు తల్లి మృతి చెందిన విషయం తెలియక అమాయకంగా చూస్తూ కూర్చుండి పోయారు. ఈ విషాదకర సంఘటన మంగళవారం శంషాబాద్‌ బస్టాండ్‌ సమీపంలో చోటు చేసుకుంది.

ఒడిశా రాష్ట్రానికి చెందిన వలస కూలీ రేఖ(30) తన భర్త, పిల్లలతో కలసి బతుకుదెరువు కోసం శంషాబాద్‌కు వచ్చి.. స్థానిక ఎయిర్‌పోర్టు కాలనీలో నివాసముంటుంది. రెండ్రోజులుగా ఆమెకు ఆరోగ్యం బాగాలేకపోవడంతో మంగళవారం సాయంత్రం ఆస్పత్రికి బయలుదేరింది. ఎండవేడిమితోపాటు ఒంట్లో నీరసంగా ఉండటంతో బస్టాండ్‌ సమీపంలో నీడగా ఉన్న ప్రాంతంలో కూర్చుంది. ఉన్నట్టుండి ఒక్కసారిగా కుప్పకూలి మృతి చెందింది.

విషయం తెలియని చిన్నారులు తల్లి పక్కనే కూర్చుని దిక్కులు చూస్తుండటంతో స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు ఆమె భర్తకు సమాచారం అందించారు. అనారోగ్యంతోపాటు వడదెబ్బ కూడా ఆమె మృతికి కారణమై  ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top