నేటి నుంచి రైతు బీమా సర్వే! 

Rythu Bheema survey from today - Sakshi

ఇంటింటికీ వెళ్లనున్న వ్యవసాయ విస్తరణాధికారులు 

18 నుంచి 60 ఏళ్ల వయస్సున్న లబ్ధిదారుల గుర్తింపు 

42.94 లక్షల మంది రైతుల నుంచి నామినీ పత్రాల సేకరణ

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రవ్యాప్తంగా రైతు బీమా సర్వే బుధవారం నుంచి ప్రారంభం కానుంది. దాదాపు నెల రోజులపాటు ఈ ప్రక్రియ కొనసాగనుంది. పట్టాదారు పాసు పుస్తకం పొందిన, పెట్టుబడి చెక్కులు తీసుకున్న ప్రతి రైతు ఇంటికెళ్లి 18 నుంచి 60 ఏళ్ల వయసున్న వారిని గుర్తిస్తారు. అనంతరం ఆ రైతులకు నామినీ పత్రాలు అందజేస్తారు. నామినీ పత్రాలను నింపి రైతు సంతకం చేసిన అనంతరం వాటిని తిరిగి తీసుకుంటారు. నామినీ పత్రాలను అన్నింటినీ సేకరించాక ఎల్‌ఐసీకి అప్పగిస్తామని ‘సాక్షి’కి వ్యవసాయ శాఖ కమిషనర్‌ డాక్టర్‌ జగన్‌మోహన్‌ తెలిపారు. అనంతరం ఆగస్టు 15వ తేదీ నుంచి రైతులకు ఎల్‌ఐసీ కింద బీమా వర్తింపజేయనున్నారు. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం రైతు బంధు పథకం కింద 42.94 లక్షల మందికి పట్టాదారు పాసు పుస్తకాలు, చెక్కులను పంపిణీ చేసింది. కొందరు రైతులు ఇంకా తీసుకోలేదు. మరికొందరికి ఇంకా పట్టాదారు పాసు పుస్తకాల ముద్రణ జరగలేదు. ఈ నేపథ్యంలో ప్రస్తుత లెక్కల ప్రకారం వ్యవసాయ శాఖ వర్గాలు 42.94 లక్షల మంది రైతుల వద్దకే వెళ్లి బీమా కోసం నామినీ పత్రాలు తీసుకుంటారు. 

బీమాకు సీఎం అనర్హులు! 
‘రైతు బంధు కింద పెట్టుబడి చెక్కును తీసుకోలేదు. కానీ రైతు బీమాను తప్పక తీసుకుంటా’అని సోమ వారం వ్యవసాయాధికారుల సభలో సీఎం కేసీఆర్‌ చెప్పిన విషయం తెలిసిందే. అయితే ఆయన వయసు 64 ఏళ్లు కాబట్టి ఆయన రైతు బీమాకు అనర్హులవుతారని వ్యవసాయ శాఖ కమిషనర్‌ జగన్‌ మోహన్‌ వ్యాఖ్యానించారు.  

వారు కూడా బీమా పరిధిలోకి.. 
పట్టాదారు పాసు పుస్తకం తీసుకోని వారు, ఇప్పటికీ అందని వారు ఎవరైనా ఉంటే.. వారిని బీమా పరిధిలోకి తీసుకొస్తామని అధికారులు చెబుతున్నారు. అదనంగా వచ్చే రైతుల కోసం మూడు నెలలకోసారి ప్రీమియాన్ని ప్రభుత్వం ఎల్‌ఐసీకి చెల్లిస్తుంది. ప్రీమి యం సొమ్మును వ్యవసాయ శాఖ కమిషనర్‌ పేరుతో ఆగస్టు ఒకటో తేదీలోపు ఎల్‌ఐసీకి చెల్లించాలి. రాష్ట్ర ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి ఎస్పీ సింగ్‌.. తనకు వచ్చిన రూ.49,900, రూ.14,610 విలువైన రెండు  రైతుబంధు చెక్కులను మంగళవారం వెనక్కి ఇచ్చేశారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top