కొందరికే రైతుబంధు..

Rythu Bandhu Delays Perturb Farmers In Rajanna Siricilla - Sakshi

సాక్షి, సిరిసిల్ల: జిల్లాలోని చిన్న, సన్నకారు రైతులకు ఎకరానికి రూ.5వేల చొప్పున పెట్టుబడి సాయం అందింది. ఐదెకరాల కన్నా గుంటభూమి ఎక్కువగా ఉన్నా పెట్టుబడిసాయం అందలేదు. తొలిసారిగా 2018 ఖరీఫ్‌ సీజన్‌లో రైతులకు నేరుగా చెక్కులు అందించిన ప్రభుత్వం రబీ సీజన్‌లో రైతుల ఖాతాల్లో పెట్టుబడి సాయాన్ని వేసింది. ఈ సారి ఖరీఫ్‌ సీజన్‌లో రైతుల సమగ్ర సమాచారాన్ని సేకరించిన అధికారులు అన్నదాతల బ్యాంకు ఖాతాల్లో పెట్టుబడి సాయాన్ని జమ చేస్తున్నారు. ఐదెకరాల కన్నా ఎక్కువ ఉన్న పెద్దరైతులు ఖరీఫ్‌ సీజన్‌లో పెట్టుబడుల కోసం అందించే సాయం కోసం నిరీక్షిస్తున్నారు.

జిల్లాకు అందిన పెట్టుబడి సాయం రూ.65.68 కోట్లు
జిల్లావ్యాప్తంగా 64122 మంది రైతులకు రూ.65.68 కోట్ల పెట్టుబడి సాయం ఇప్పటి వరకు అందింది. వాస్తవానికి 95,129 మంది రైతుల బ్యాంకు ఖాతా, ఆధార్‌ నంబరు వివరాలను ట్రెజరీకి వ్యవసాయ అధికారులు అందించారు.ఇంకా 26,669 మంది రైతులకు పెట్టుబడి సాయం రాలేదు. ఆన్‌లైన్‌లో అప్‌లోడ్‌ చేసినా సాయం దక్కలేదు. ప్రభుత్వం ఇచ్చే పెట్టుబడి సాయం కోసం రైతులు బ్యాంకు చుట్టూ తిరుగుతున్నారు.ఆన్‌లైన్‌లో పహాణీల వివరాలను చెక్‌ చేసుకుంటూ.. బ్యాంకుకు వెళ్లి డబ్బులు జమ అయ్యాయా అంటూ ఆరా తీస్తున్నారు. ఖరీఫ్‌ సీజన్‌ పెట్టుబడుల కాలం కావడంతో సర్కారు డబ్బుల కోసం ఆశగా చూస్తున్నారు. కొందరి ఖాతాల్లో డబ్బులు జమ కాగా.. మరి కొందరి ఖాతాల్లో జమ కాకపోవడంతో అయోమయానికి గురవుతున్నారు. ఇప్పటికీ కొందరు ఎన్‌ఆర్‌ఐలు తమ ఆధార్, బ్యాంకు ఖాతాల వివరాలు ఇవ్వకపోవడంతో 12,349 మంది రైతుల వివరాలు తెలియక వ్యవసాయ అధికారులు ఆన్‌లైన్‌లో నమోదు చేయలేదు.

మా ఊరిలో చాలా మందికి రాలేదు..
మాది కోనరావుపేట మండలం మర్తనపేట. కొలనూర్‌ గ్రామ శివారుల్లో నాకు భూమి ఉంది. నాకు నిరుడు పెట్టుబడి సాయం వచ్చింది. ఒక్కసారి చెక్కు ఇచ్చిండ్రు.. ఇంకోసారి బ్యాంకులో వేసిండ్రు. ఈ సారి మాత్రం ఇంకా రాలేదు. నేను బ్యాంకు వెళ్లి చూసినా.. రాలేదని చెప్పిండ్రు. మా ఊరిలో చాలా మంది రైతులకు ఇంకా డబ్బులు పడలేదు. ఇప్పు డు వస్తే.. పెట్టుబడికి అక్కర కొస్తాయి.
– బురవేణి కొండయ్య, రైతు, మర్తనపేట

అందరి ఖాతాలు అప్‌లోడ్‌ చేశాం..
జిల్లాలోని రైతుల అందరి బ్యాంకు ఖాతా నంబర్లు, ఆధార్‌ నంబరు, ఆన్‌లైన్‌ పహాణీ ఆధారంగా అప్‌లోడ్‌ చేశాం. రైతుబంధు సాయం జిల్లాలోని రైతులందరికీ అందుతుంది. ఇప్పటికే 64వేల మంది రైతుల ఖాతాల్లో జమ అయింది. మిగితా వారికి పేమెంట్‌ ట్రెజరీల్లో పెండింగ్‌లో ఉంది. జిల్లాలో రైతుల డేటాను పూర్తి స్థాయిలో అన్‌లైన్‌లో నమోదు చేశాం.
– కె.రణధీర్‌కుమార్, జిల్లా వ్యవసాయాధికారి, సిరిసిల్ల

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top