కొందరికే రైతుబంధు

Rythu Bandhu Amount Not Released In Nizamabad - Sakshi

40 శాతం మందికి మాత్రమే పెట్టుబడి సాయం

రూ.252.63 కోట్లకు గాను ఇచ్చింది రూ.119 కోట్లే

ఎదురు చూస్తున్న వేలాది మంది రైతులు

సాక్షి, మోర్తాడ్‌ (నిజామాబాద్): జిల్లాలో రైతుబంధు కొందరికే అందింది. ప్రభుత్వం విడతల వారీగా నిధులను మంజూరు చేస్తుండటంతో ఈ పరిస్థితి తలెత్తింది. ఖరీఫ్‌ సీజన్‌ పనులు ప్రారంభమై రోజులు గడుస్తున్నా రైతులకు పూర్తి స్థాయిలో పెట్టుబడి సహాయం అందలేదు. జిల్లాలోని 40 శాతం రైతాంగానికి మాత్రమే పెట్టుబడి సాయం అందగా, మరో 60 శాతం మంది రైతులకు అందాల్సి ఉంది. ఆయా రైతులకు సాయం అందాలంటే మరింత సమయం పట్టే అవకాశం ఉంది. జిల్లాలోని 2,29,566 మంది రైతులకు పెట్టుబడి సహాయం అందించాలని వ్యవసాయ శాఖ అధికారులు ప్రభుత్వానికి నివేదించారు. ఇందుకోసం రూ.252.63 కోట్ల నిధులు అవసరమని తేల్చారు. మే చివరి వారం లో రైతుబంధు పథకం కింద పెట్టుబడి స హాయంను అందించేందుకు ప్రభుత్వం ని ధులు విడుదల చేయడం ప్రారంభించింది.

ఇప్పటి వరకు 20 విడతల్లో రైతులకు పెట్టుబడి సహాయం అందింది. ఇప్పటి వ రకు రూ.119 కోట్ల మేర రైతుల ఖాతాల్లో జమ అయ్యాయి. మరో రూ.133.63 కోట్ల నిధులు మంజూరు కావాల్సి ఉంది. ఖరీఫ్‌ సీజను పనులు రెండు వారాల క్రితమే ప్రారంభమయ్యాయి. జిల్లాలోని రైతులు పసుపు, మొక్కజొన్న, సొయా విత్తనాలు విత్తే పనిలో పడ్డారు. వరి పంటను సాగు చేయడానికి నారు సిద్ధం చేసుకుంటున్నారు. విత్తనాలు, ఎరువులను ఇప్పటికే కొందరు రైతులు కొనుగోలు చేయగా, మరి కొందరు రైతులు కొనుగోలు చేయడానికి ఏర్పా ట్లు చేసుకుంటున్నారు. అయితే, రైతులకు గడచిన మే నెలలోనే పెట్టుబడి సహాయం అందించి ఉంటే ఇప్పటికే రైతులు పంటల సాగు కోసం అన్ని ఏర్పాట్లు చేసుకునే వారు. అయితే, రైతుబంధు అందించడానికి ప్రభుత్వం సకాలంలో నిధులు విడుదల చేయకపోవడంతో రైతులకు ఎదురు చూపులు తప్పడం లేదు. ఇప్పటికైనా సర్కారు స్పందించి త్వరగా ఆర్థిక సాయం అందించాలని అన్నదాతులు కోరుతున్నారు.

తొందరలోనే నిధులు.. 
తొందరలోనే రైతులందరికీ రైతుబంధు నిధులు ఖాతాల్లోకి చేరుతాయి. ప్రభుత్వం దశల వారీగా నిధులు మంజూరు చేస్తోంది. త్వరలోనే నిధులు పూర్తి స్థాయిలో విడుదల అయి రైతులకు పెట్టుబడి సహాయం అందుతుంది.
– మేకల గోవింద్, జిల్లా వ్యవసాయాధికారి

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top