సొంతింటికి కన్నం వేస్తున్న ఆర్టీసీ ఉద్యోగులు

RTC Driver Suspended For Cheating Passenger In Warangal - Sakshi

సాక్షి, హన్మకొండ: సొంతింటికి కన్నం వేసిన చందంగా కొందరు ఆర్టీసీ ఉద్యోగులు సంస్థకు చేరాల్సిన సొమ్మును కాజేస్తున్నారు. అసలే నష్టాలతో కుదేలైన ఆర్టీసీకి సంస్థకు సిబ్బంది చేతివాటంతో మరింత నష్టం కలిగే పరిస్థితి నెలకొంది. ప్రధానంగా దూర ప్రాంతాలకు నడిపే బస్సుల్లో విధులు నిర్వర్తిస్తున్న వారు అదును చూసి కొంత నగదు కాజేస్తున్నారు. ఈ విషయమై కొందరు ప్రయాణికులు చూసీచూడనట్లు వ్యవహరిస్తుండడంతో వీరు ఆడిందే ఆట.. పాడిందే పాటగా చెలా‘మణి’ అవుతోంది. అయితే, ఓ ప్రయాణికుడు తిరగబడడంతో పాటు అధికారులకు ఫిర్యాదు చేయడంతో విషయం వెలుగు చూడగా... ఓ డ్రైవర్‌పై సస్పెన్షన్‌ వేటు పడింది.

ఇతర రాష్ట్రాలకు సర్వీసులు
వరంగల్‌ రీజియన్‌ నుంచి ఇతర రాష్ట్రాలకు బస్సులు నడుపుతున్నారు. కర్ణాటక, మహారాష్ట్రతో పాటు ఆంధ్రప్రదేశ్‌కు ఏసీ, సూపర్‌ లగ్జరీ, డీలక్స్‌ బస్సులను ప్రయాణికుల సౌకర్యార్థం నడిపిస్తున్నారు. ఇలా బస్సులు నడపడం ద్వారా ఆర్టీసీకి ఆదాయం ఎక్కువ మొత్తంలో సమకూరుతోంది. తద్వారా దూరప్రాంత బస్సులకు అధికా రులు ప్రాధాన్యం ఇస్తున్నారు. హన్మకొండ జిల్లా బస్‌ స్టేషన్‌ నుంచి బెంగళూరు, తిరుపతి, విజయవాడ, గుంటూరు, విశాఖపట్నం, పిడుగురాళ్ల, రాజ మండ్రి, శ్రీశైలం, కాకినాడ, మచిలీపట్నం, నెల్లూరు, మంత్రాలయం, షిర్డీ, పూణే, రాయచూర్‌కు ప్రస్తుతం బస్సులు నడుస్తున్నాయి. అయితే, రాష్ట్రం దాటిన తర్వాత తనిఖీలు ఉండవనే ధైర్యంతో కొందరు కార్మికులు ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారు. అవకాశమున్న చోట, అందినకాడికి దోచుకుంటూ ఇదేమిటని ప్రశ్నించిన ప్రయాణికులను బెదిరిస్తున్నారు.

తిరుపతి నుంచి వస్తుండగా...
ఇటీవల వరంగల్‌–1 డిపోకు చెందిన బస్సు తిరుపతి నుంచి హైదరాబాద్‌ మీదుగా హన్మకొండకు వచ్చిం ది. ఈ బస్సులో హైదరాబాద్‌కు రావాల్సిన ప్రయాణికులు కొందరు తిరుపతిలో ఎక్కారు. దూరప్రాంత బస్సు కావడంతో ఇద్దరు డ్రైవర్లు విధులు నిర్వహిస్తారు. ఒకరు బస్సు నడిపితే మరొకరు టిమ్స్‌ ద్వారా టికెట్లు ఇస్తారు. తిరుపతిలో ఎక్కిన ప్రయాణికుడు, హైదరాబాద్‌ వాసి జగన్‌ డబ్బు ఇచ్చినా ఆయనకు టికెట్‌ ఇవ్వలేదు. ఈ విషయమై ఎంత ప్రశ్నించినా దాటేస్తూ వచ్చిన డ్రైవర్‌ కడప వరకు నెట్టుకొచ్చాడు. చివరకు ప్రయాణికుడి నుంచి ఒత్తిడి తీవ్రం కావడంతో పాటు బస్సు నడుపుతున్న డ్రైవర్‌కు చెప్పడంతో కడప నుంచి హైదరాబాద్‌ వరకు మాత్రమే టికెట్‌ ఇచ్చాడు. తిరుపతి నుంచి హైదరాబాద్‌కు టికెట్‌ డబ్బులు తీసుకుని టికెట్‌ మాత్రం కడప నుంచి ఇవ్వడం ద్వారా రూ.200 సదరు డ్రైవర్‌ తీసుకున్నాడు. దీంతో చిర్రెత్తుకొచ్చిన సదరు ప్రయాణికుడు జగన్‌ ఆర్టీసీ వరంగల్‌–1 డిపో మేనేజర్‌ గుండా ఫిర్యాదు చేశారు. ఈమేరకు విచారణ చేపట్టిన డిపో మేనేజర్‌ చేతి వాటం ప్రదర్శించిన డ్రైవర్‌ అమరేందర్‌ను సస్పెండ్‌ చేస్తూ ఆదేశాలు జారీ చేశారు.

డ్రైవర్‌ దుర్భాషలాడాడు..
ఆర్టీసీ అధికారులకు ఫిర్యాదు చేసినందుకు డ్రైవర్‌ అమరేందర్‌ నాకు ఫోన్‌ చేస్తూ బెదిరిస్తున్నాడు. ఫోన్‌లో బూతు పురాణం సాగిస్తున్నాడు. అంతేకాకుండా ఆయన స్నేహితులతోనూ ఫోన్‌ చేయించి తిట్టించాడు. సదరు డ్రైవర్‌ నన్ను తిట్టినట్లు నా వద్ద ఆధారాలు ఉన్నాయి. ఈ మేరకు పోలీసులకు కూడా ఫిర్యాదు చేస్తా.
– జగన్, ఫిర్యాదుదారుడు

డ్రైవర్‌పై చర్య తీసుకున్నాం..
తిరుపతి నుంచి హైదరాబాద్‌ వస్తున్న ప్రయాణికుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు విచారించి డ్రైవర్‌ అమరేందర్‌ను సస్పెండ్‌ చేశాం. తిరుపతిలో బస్సు ఎక్కిన ప్రయానికుడి వద్ద మొత్తం డబ్బు తీసుకుని కడప నుంచి హైదరాబాద్‌ వరకు మాత్రమే టికెట్‌ ఇచ్చాడు. మిగతా డబ్బు కాజేశాడు. అలాగే, ఫిర్యాదు చేసిన ప్రయాణికుడినే దుర్భాషలాడుతున్నట్లు మాకు సమాచారం ఉంది. ఫోన్‌ రికార్డు వాయిస్‌ తనకు పంపించాడు. మాటలు వినలేని విధంగా ఉన్నాయి.
– గుండా సురేష్, వరంగల్‌–1 డిపో మేనేజర్‌

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top