ఇన్‌చార్జ్‌లతో ఆర్టీసీ అస్తవ్యస్తం 

RTC is in disarray with incharges - Sakshi

పదోన్నతులు, బదిలీలు లేక అంతా గందరగోళం

ఇరవై కీలక పోస్టులు ఖాళీ

అసలే గాడితప్పిన ప్రగతి రథం... ఇప్పుడు మరింత అయోమయం  

సాక్షి, హైదరాబాద్‌: ఆర్టీసీలో ఆయన ఓ ఉన్నతాధికారి. ప్రస్తుతం హైదరాబాద్‌లో ఉన్న బస్‌భవన్‌లో ఇన్‌చార్జి ఈడీగా ఉన్నారు. ఆయన అసలు పోస్టు ఆదిలాబాద్‌ రీజినల్‌ మేనేజర్‌. హైదరాబాద్‌–ఆదిలాబాద్‌ మధ్య 300 కి.మీ. దూరం ఉంటుంది. ఇంతదూరంలో ఉన్న రెండు ప్రాంతాల్లో ఒకే వ్యక్తి ఎలా పనిచేయగలరు. ఇది ఆర్టీసీలో ఉన్న గందరగోళానికి ఓ నిదర్శనం.  

ఇదే అధికారి ఈనెలాఖరున పదవీ విరమణ పొందనున్నారు. సీనియారిటీ క్రమంలో ఆయనకు ఈడీ పదోన్నతి రావాలి. కానీ, ఎన్నికల కోడ్‌ పేరుతో ఇంతకాలం కాలయాపన జరిగింది. కోడ్‌ ముగిసినా ఇప్పటివరకు పదోన్నతుల ఊసు లేదు. ఇలాగే ఉంటే ఆయన ఈడీగా కాకుండా అంతకంటే ఓ మెట్టు దిగువన ఉండే రీజినల్‌ మేనేజర్‌గానే పదవీ విరమణ పొందాల్సి ఉంటుంది. 

ప్రస్తుతం దాదాపు పది ప్రాంతాల్లో పూర్తిస్థాయి ఆర్‌ఎంలు, డీవీఎంలు లేరు. ఎక్కడెక్కడో ఉన్న వారితో ఇన్‌చార్జులుగా నెట్టుకొస్తున్నారు. ఇంత గందరగోళంగా ఉన్న ఆర్టీసీకి అసలు పూర్తిస్థాయి ఎండీనే లేకపోవటంతో ఈ పదోన్నతులు, బదిలీల గందరగోళం తీవ్రమైంది. మూడు పోస్టులతో సతమతమవుతున్న ఇన్‌చార్జి ఎండీకి ఎప్పటికప్పుడు సూచనలు చేస్తూ, కీలక అంశాలకు సంబంధించిన ఫైళ్లను సిద్ధం చేసేవారు కూడా లేకపోవటంతో అంతా అస్తవ్యస్తంగా తయారైంది. అసలే తీవ్ర నష్టాలతో దివాలా దిశలో సాగుతున్న ఆర్టీసీ... గాడిలో పడాల్సింది పోయి ఇలా గందరగోళంతో కుస్తీపడుతోంది.  

ఆ కమిటీ ఎక్కడుంది? 
రాష్ట్ర విభజన జరిగినా ఇప్పటికీ ఆర్టీసీ సాంకేతికంగా రెండు రాష్ట్రాల మధ్య విడిపోలేదు. దీంతో తెలంగాణ ఆర్టీసీకి పాలకమండలి లేదు. కీలక నిర్ణయాలు తీసుకోవాల్సింది పాలకమండలి కావటంతో చాలా పనులు తాత్కాలిక పద్ధతిలో జరుగుతున్నాయి. పదోన్నతుల విషయంలోనూ అదే జరుగుతోంది. దీంతో గత సంవత్సరం సెప్టెంబర్‌లో ప్రభుత్వం సెలక్షన్, డిసిప్లినరీ కమిటీని నియమించింది. ఆర్టీసీ చైర్మన్, ఆర్టీసీ ఎండీ, జీహెచ్‌ఎంసీ కమిషనర్, రవాణా శాఖ, ఫైనాన్స్‌ (ట్రాన్స్‌పోర్టు), కార్మిక శాఖల కార్యదర్శులు ఇందులో సభ్యులుగా ఉంటారు. ఈ కమిటీ సమావేశమై కీలక నిర్ణయాలకు ఆమోదం తెలపాల్సి ఉంటుంది. తెలంగాణ ఏర్పడ్డప్పటి నుంచి ఇది అమలులో ఉంటుంది. అంటే గతేడాది సెప్టెంబర్‌లో ఈ కమిటీ ఏర్పడినందున అంతకుముందు జరిగిన వాటిని రెగ్యులరైజ్‌ చేయాల్సి ఉంటుంది. ప్రస్తుతం బస్‌భవన్‌లో పురుషోత్తమనాయక్, వినోద్‌కుమార్‌లు ఈడీలుగా పదోన్నతి పొంది పనిచేస్తున్నారు.

వీరిద్దరిని కూడా ఈ కమిటీ రెగ్యులరైజ్‌ చేయాల్సి ఉంటుంది. వీటితోపాటు కొత్త పదోన్నతులు కల్పించాల్సి ఉంటుంది. ఎన్నికల కోడ్‌ రావటంతో గతేడాది చివరి నుంచి పదోన్నతులు ఆగిపోయాయి. పదోన్నతులు లేనందున కొత్త ఖాళీలు ఏర్పడక బదిలీలు కూడా నిలిచిపోయాయి. వాస్తవానికి ప్రత్యేకంగా కమిటీ ఏర్పాటై ఉన్నందున, ఆ కమిటీ సమావేశమై బదిలీలు, పదోన్నతులపై నిర్ణయం తీసుకుని అత్యవసర పనిగా ఎన్నికల కమిషన్‌ ముందు ప్రతిపాదిస్తే ఆమోదం లభించే అవకాశం కూడా ఉండేదన్న అభిప్రాయం ఉంది. కానీ, ఏర్పాటైనప్పటి నుంచి ఇప్పటివరకు కమిటీ సమావేశమే కాలేదు. ఇప్పుడు ఎన్నికల కోడ్‌ ముగిసినా ఆ ఊసే లేక పాలన అంతా అస్తవ్యస్తంగా మారింది.  

రాష్ట్రవ్యాప్తంగా ప్రస్తుతం దాదాపు 20 కీలక పోస్టులు ఖాళీగా ఉన్నాయి. సాక్షాత్తూ బస్‌భవన్‌లోనే ముగ్గురు ఈడీలు ఇన్‌చార్జులుగా ఉన్నారు. ఇటీవల ఆర్‌ఎం స్థాయిలో ఉన్న అధికారులను తాత్కాలిక పద్ధతిలో ఈడీలుగా కూర్చోబెట్టారు. పదోన్నతులు లేనందున వీరు పర్యవేక్షించే రెగ్యులర్‌ పోస్టుల్లో ఎవరినీ నియమించలేదు. ఈ ముగ్గురు అధికారులకు ఈడీ పదోన్నతి ఇస్తే వారు చూసే రెగ్యులర్‌ ఆర్‌ఎం కేడర్‌ పోస్టులు ఖాళీ అవుతాయి. వాటిని డీవీఎంలతో భర్తీ చేస్తారు. అలా ఖాళీ అయ్యే డీవీఎం పోస్టులను సీనియర్‌ డీఎంలతో భర్తీ చేస్తారు. వాటిని అసిస్టెంట్‌ డీఎం పోస్టులతో.. ఇలా కిందిస్థాయి వరకు పోస్టులు భర్తీ అవుతాయి. కానీ ఈ ప్రక్రియ జరగక అధికారుల్లో అయోమయం నెలకొంది. ఇక దాదాపు పది డిపోలకు పూర్తిస్థాయి డిపో మేనేజర్లు లేరు. వాటిని తాత్కాలిక పద్ధతిలో ఇతరులు పర్యవేక్షిస్తున్నారు. ఈ వ్యవహారం ఆర్టీసీ బస్సుల నిర్వహణపై పడుతోంది. 

సాధారణంగా రెండుమూడేళ్లు జిల్లాల్లో పనిచేసే పెద్ద అధికారులను ఆ తర్వాత నగరానికి బదిలీ చేస్తారు. కానీ ప్రస్తుతం నాలుగేళ్లు దాటినా తమకు హైదరాబాద్‌ భాగ్యం దక్కటం లేదని కొందరు అధికారులు వాపోతున్నారు. ఇక పాఠశాలలు తెరిచేలోపే బదిలీలు జరిగితే బాగుండేదని, ఇప్పుడు బడులు తెరిచినందున మధ్యలో ట్రాన్స్‌ఫర్స్‌ జరిగితే పిల్లల చదువులకూ ఇబ్బందులు ఏర్పడతాయని అధికారులు వాపోతున్నారు. ఈ వ్యవహారం మరోవైపు ఆర్టీసీ అధికారుల సంఘంలోనూ లుకలుకలకు కారణమైంది. బదిలీలు, పదోన్నతుల విషయంలో ఎండీపై ఒత్తిడి చేయటం లేదంటూ బాధ్యులపై అధికారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే సంఘానికి ఎన్నికలు నిర్వహించాలంటూ కొందరు డిమాండ్‌ ప్రారంభించారు. ఇక సందట్లో సడేమియాగా జూనియర్‌ అధికారులు కొందరు పైరవీలతో పెద్ద పోస్టుల్లో తాత్కాలిక పద్ధతిలో నియామకమయ్యేలా చక్రం తిప్పుతున్నారు.  

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top