‘మిడ్‌మానేర్‌’ నిర్వాసితులకు ప్యాకేజీ!

‘మిడ్‌మానేర్‌’ నిర్వాసితులకు ప్యాకేజీ! - Sakshi


- కుటుంబానికి రూ. 8 లక్షల పరిహారం!

- పదేళ్ల పోరాటానికి తెరదించిన మంత్రి హరీశ్‌రావు

- గ్రామం యథాతథం..  ప్యాకేజీ అదనం

- మాన్వాడ గ్రామస్తుల్లో ఆనందం




బోయినపల్లి (వేములవాడ): మధ్యమానేర్‌ ప్రాజెక్టు నిర్వాసిత రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం మాన్వాడ గ్రామస్తులకు మంచిరోజులు వస్తున్నాయి. ఒక్కో కుటుంబానికి రూ.8 లక్షల ప్రత్యేక ప్యాకేజీ వర్తింపజేసేందుకు ప్రభుత్వం నుంచి గ్రీన్‌ సిగ్నల్‌ వచ్చింది. వచ్చేనెలలో ప్రాజెక్టులో 10 టీఎంసీల నీరు నిల్వ చేయాలనే లక్ష్యంతో పనులు వేగవంతం చేసిన సర్కారు.. అదే స్థాయిలో నిర్వాసితులకు పరిహారం అందించడంపై దృష్టి సారించింది. మాన్వాడ గ్రామాన్ని యథాతథంగా ఉంచుతూనే కుటుంబాలకు పరిహారం చెల్లించడానికి సిద్ధమవుతోంది.



2006లో మిడ్‌మానేర్‌కు శ్రీకారం..

2006లో మాన్వాడలో 25.873 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యంతో రిజర్వాయర్‌ నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. అప్పటి నుంచి మాన్వాడవాసులకు ఎలాంటి పరిహారం అందలేదు. గతేడాది సెప్టెంబర్‌ 25న ప్రాజెక్టు కట్ట తెగినపుడు మంత్రి హరీశ్‌రావు సందర్శించారు. పరిహారం అందించకుండానే గ్రామం నుంచి ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించడంపై గ్రామస్తులతోపాటు, ప్రధాన ప్రతిపక్షాలు తీవ్రనిరసన వ్యక్తం చేశాయి. ముంపుగ్రామంగా ప్రకటించి తక్షణపరిహారం అందించాలని మహిళలు ధర్నా చేశారు. ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న సమయంలో మంత్రి హరీశ్‌రావు మాన్వాడను సందర్శించి ఆందోళనకారులను సముదాయించారు. ‘నన్ను నమ్మండి.. నేను మీకు న్యాయం చేస్తా’అని మాట ఇచ్చారు. అటు ప్రజలకు ఇచ్చిన మాట తప్పకుండా, ఇటు గ్రామాన్ని ఖాళీ చేయించకుండా.. పరిహారం ఎలా ఇవ్వాలనే విషయంలో తర్జనభర్జన పడ్డారు. చివరకు సీఎం కేసీఆర్‌ను ఒప్పించి మాన్వాడ వాసులకు ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వడానికి నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది.



పదేళ్ల పోరాటానికి తెరదించిన హరీశ్‌

మాన్వాడ గ్రామస్తులు తమకు న్యాయం చేయాలని పదేళ్లుగా పోరాటం చేస్తున్నారు. ఇదే క్రమంలో మంత్రి హరీశ్‌ హామీ ఇవ్వడంతో తరచూ ఆయనను కలుస్తూ తమ గోడు వెళ్లబుచ్చుకున్నారు. ఇదే క్రమంలో స్పష్టమైన హామీ రావడం లేదని ప్రాజెక్టు పనులు అడ్డుకున్నారు. ఒక్క రోజు పనులు అడ్డుకుంటేనే రూ. లక్షల నష్టం వాటిల్లింది. పనుల వేగం తగ్గి కాంట్రాక్టర్‌కు పెద్దమొత్తంలో నష్టం వాటిల్లింది. దీంతో మంత్రి హరీశ్‌రావు గ్రామస్తులను పిలిపించుకుని పనులు అడ్డుకోవద్దని, ప్రాజెక్టు నిర్మాణానికి సహకరించాలని కోరారు. నాలుగు రోజుల క్రితం సర్పంచ్‌ శ్రీనివాస్‌తోనూ మంత్రి మాట్లాడారు.



కుటుంబానికి రూ.8 లక్షల ప్యాకేజీ..

2014లో చేసిన గెజిట్‌ ప్రకారం గ్రామంలోని 610 కుటుంబాలకు రూ.50 కోట్లకు పైగా ప్రత్యేక ప్యాకేజీ అందించేందుకు మార్గం సుగమమైంది. మొట్ట మొదటిసారి జిల్లా కలెక్టర్‌ కృష్ణభాస్కర్‌ ఈనెల 17న నిర్వహించిన ఆర్‌ అండ్‌ ఆర్‌ సమావేశంలో సర్పంచ్‌ను ఆహ్వానించారు. ప్రభుత్వం ప్యాకేజీ ఇచ్చేందుకు సుముఖంగా ఉన్న విషయం తెలిపారు.



ఆనందంలో గ్రామస్తులు..

పదేళ్ల పోరాటానికి తెరదించుతూ ప్రభుత్వం ప్రత్యేక ప్యాకేజీ గ్రామస్తులకు ఇవ్వాలనే నిర్ణయానికి రావడంపై ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇన్నేళ్ల పోరాటం ఫలించబోతోందని సంతోష పడుతున్నారు.



కట్ట తెగడంతో మాన్వాడపై దృష్టి..

గతేడాది ఖరీఫ్‌లో ప్రాజెక్టులో 4 టీఎంసీలకు పైగా నీరు చేరింది. ప్రాజెక్టు కట్ట నాణ్యత లోపంతో తెగింది. ఇది ఒక రకంగా మాన్వాడవాసులకు కలిసొచ్చినట్లయ్యింది. కేవలం భూములు ముంపునకు గురై, ఇళ్లకు ముప్పులేదని అధికారులు మాన్వాడ గ్రామస్తులకు పరిహారం అందించే విషయంలో తాత్సారం చేశారు. కట్ట తెగడంతో రాష్ట్రం దృష్టి మాన్వాడపై పడింది. కట్ట తెగిన ప్రాంతంలో సీఎం కేసీఆర్‌ ఏరియల్‌ సర్వే చేశారు. కాంగ్రెస్, బీజేపీ, టీడీపీ, సీపీఐ, వైఎస్సార్‌ సీపీ తదితర పార్టీలు మిడ్‌మానేర్‌ బాటపట్టాయి. మాన్వాడవాసులకు పరిహారం అందించాలని పట్టుబట్టాయి. దీంతో పరిహారంపై నిర్ణయం తీసుకోవాల్సిన పరిస్థితి ప్రభుత్వానికి ఏర్పడింది.



మంత్రి హరీశ్‌ కృషితోనే ప్యాకేజీ

మాన్వాడకు ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వాలని పదేళ్లనుంచి పోరాటం చేస్తున్నం. కట్ట తెగినపుడు మంత్రి హరీశ్‌ పరిహారం అందిస్తామని హామీ ఇచ్చారు. ఈ మేరకు ఆయన కృషితో ఈ రోజు మాన్వాడ ప్రజల పోరాటం ఫలించింది.

–రామిడి శ్రీనివాస్, సర్పంచ్, మాన్వాడ



ప్రత్యేక ప్యాకేజీకి సుముఖం

మాన్వాడ ప్రజలకు ప్రత్యేక ప్యాకేజీ అందించేందుకు ప్రభుత్వం సుముఖంగా ఉంది. ప్యాకేజీ అందించే విషయంలో ఉన్నతస్థాయిలో చర్చలు జరుగుతున్నాయి. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం మేరకు నిర్వాసితులకు ప్యాకేజీ వర్తింజేస్తాం.

    – ఎన్‌.పాండురంగ, సిరిసిల్ల ఆర్డీవో

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top