రూ.1,156 కోట్లతో ప్రణాళిక

రూ.1,156  కోట్లతో  ప్రణాళిక


సాక్షి సంగారెడ్డి:  రాబోయే ఏడాది కాలంలో  జిల్లాలో చేపట్టబోయే అభివృద్ధి పనుల కోసం రూ.1,156 కోట్లతో రూపొం దించిన ప్రణాళికకు జిల్లా పరిషత్ ప్రత్యేక సర్వసభ్య సమావేశం ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది. తొలి ప్రణాళికలో పల్లెలకు ప్రాధ్యానత ఇచ్చారు. గ్రామీణ నీటిసరఫరా, సాగునీరు, విద్యుత్, పంచాయతీరాజ్‌లకు ప్రాధాన్యత ఇచ్చారు.

 

 ‘మనజిల్లా-మన ప్రణాళిక’లో భాగంగా రూ.1,156 కోట్లతో రూపొందించిన ప్రణాళికకు స్వల్పమార్పుల జరిగే అవకాశం ఉంది. శనివారం జెడ్పీ చైర్‌పర్సన్ రాజమణి అధ్యక్షతన ‘మనజిల్లా-మన ప్రణాళిక’పై ప్రత్యేక సమావేశం జరిగింది. సమావేశానికి శాసనమండలి చైర్మన్ స్వామిగౌడ్, మంత్రి హరీష్‌రావు, డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్‌రెడ్డి, ఎమ్మెల్యేలు హాజరయ్యారు.

 

 జెడ్పీ సీఈఓపై హరీష్ ఆగ్రహం

 జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశానికి వచ్చిన జెడ్పీటీసీ, ఎంపీపీలకు జిల్లా ప్రణాళికకు సంబంధించిన ఎజెండా కాపీలను అందజేయలేదు. దీంతో సభ్యులు మంత్రి ఎదుట నిరసన వ్యక్తం చేశారు. దీంతో మంత్రి హరీష్‌రావు జెడ్పీ సీఈఓ ఆశీర్వాదంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రణాళిక ఎజెండాను సభ్యులకు ఇవ్వకపోతే వారు చర్చలో ఎలా పాల్గొంటారని మండిపడ్డారు. ఎజెండా అంశాలను పరిశీలించి జెడ్పీటీసీ, ఎంపీపీ సభ్యులు అవసరమైన మార్పులు చేర్పులు లిఖిత పూర్వకంగా అందజేయాలని, అంతవరకు రూ.1,156 కోట్లతో రూపొందించిన ప్రణాళికకు ఆమోదం తెలపాలని మంత్రి కోరారు. దీంతో సమావేశంలో పాల్గొన్న ఎమ్మెల్యేలు, సభ్యులు ఆమోదం తెలిపారు.  

 

 దీర్ఘకాలిక ప్రయోజనాలకు పెద్దపీట: మంత్రి హరీష్‌రావు

 జిల్లా ప్రణాళికలో దీర్ఘకాలిక ప్రయోజనాలకు పెద్దపీట వేస్తామని మంత్రి హరీష్‌రావు అన్నారు. సమావేశంలో ఆయన మాట్లాడుతూ, జిల్లాలోని 156 ఐకేపీ కొనుగోలు కేంద్రాల్లో మినీగోడౌన్‌లు నిర్మించి అక్కడ  అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పిస్తామన్నారు. అలాగే గొలుసుకట్టు చెరువుల పునరుద్ధరణ, మైనర్ ఇరిగేషన్ పనులు పెద్ద ఎత్తున చేపడతామని వివరించారు. ఎరువుల సమస్య పరిష్కారం కోసం అక్కన్నపేట రేక్ పాయింట్ ఏర్పాటు చేస్తామన్నారు. ఆయా అంశాలను జిల్లా ప్రణాళికలో పొందుపరుస్తామని వివరించారు.

 

 గ్రామీణ నీటి సరఫరాకు రూ.347 కోట్లు

 జిల్లాలో రూ.1,156 కోట్లతో 374 పనులను అధికారులు ప్రతిపాదించారు. జిల్లా ప్రణాళికలో గ్రామీణ నీటిసరఫరా, విద్యుత్, ఇరిగేషన్‌లకు పెద్దపీట వేశారు. వ్యవసాయ రంగానికి  తక్కువ నిధులతో పనులు ప్రతిపాదించగా బీసీ, ఎస్సీ కార్పొరేషన్, పౌరసరఫరాల శాఖ, హౌసింగ్, డీఆర్‌డీఏ, జిల్లా సహకార సంస్థలకు సంబంధించి జిల్లా ప్రణాళికలో నిధులు కేటాయింపు ప్రతిపాదించ లేదు. జిల్లా ప్రణాళికలో గ్రామీణ నీటి సరఫరాకు రూ.347 కోట్లు,  విద్యుత్‌కు రూ.310 కోట్లు, పంచాయతీరాజ్‌కు రూ.238 కోట్లు, ఇరిగేషన్‌కు రూ.109 కోట్లు కేటాయించారు.

 

 నీటియాజమాన్య సంస్థకు రూ.63 కోట్లు, మెదక్ ట్రైనింగ్ అండ్ ఎంప్లాయిమెంట్ ఆర్గనైజేషన్ (మెటియార్)కు రూ.17.90 కోట్లు, పశుసంవర్థక శాఖకు రూ.13.76 కోట్లు, వ్యవసాయశాఖకు రూ.8.45 కోట్లు, వైద్య ఆరోగ్యశాఖకు రూ.6.65 కోట్లు, వయోజన విద్యకు రూ.5.60 కోట్లు, మార్కెటింగ్‌శాఖకు రూ.5 కోట్లు, మత్స్యశాఖకు రూ.3 కోట్లు,  ఖాదీ గ్రామీణ పరిశ్రమల మండలికి రూ.82.01 లక్షలు, జిల్లా పంచాయతీశాఖకు రూ.40 లక్షలు కేటాయించారు. ఉద్యానవనశాఖకు రూ.26 లక్షలు, పట్టు పరిశ్రమకు రూ.23 లక్షలు, నెడ్‌క్యాప్‌కు రూ.18.11 లక్షలు జిల్లా ప్రణాళికలో కేటాయించారు.

 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top