రోడ్‌ ‘టెర్రర్‌’

road accidents in hyderabad - Sakshi

వేర్వేరు చోట్ల రోడ్డు ప్రమాదాలు

ముగ్గురు విద్యార్థులు సహా ఏడుగురు మృతి

డివైడర్లను ఢీకొట్టి రెండుచోట్ల దుర్ఘటనలు

హైదరాబాద్‌: రాజధాని రహదారులు శుక్రవారం రక్తమోడాయి. నాలుగుచోట్ల రోడ్డు ప్రమాదాల్లో ఆరుగురు మృతిచెందారు. వీరిలో ముగ్గురు విద్యార్థులున్నారు. ఇందులో మూడు ఉదంతాలకూ అతివేగమే కారణమని ప్రాథమికంగా గుర్తించినట్లు పోలీసులు చెప్తున్నారు. నిజామాబాద్‌ జిల్లా ఆర్మూర్‌కు చెందిన హోటల్‌ మేనేజ్‌మెంట్‌ విద్యార్థి అనిల్‌కుమార్‌ గౌడ్‌ (22), ఇదే జిల్లాకు చెందిన బీటెక్‌ విద్యార్థులు సాయిరతన్‌ అంగి (22), అమన్‌రాజ్‌ (22) స్నేహితులు. అమన్‌రాజ్, సాయిరతన్‌ మల్లారెడ్డి కళాశాలలో బీటెక్‌ ఫైనలియర్‌ చదువుతున్నారు. అనిల్‌ గౌడ్‌ ఇటీవలే హోటల్‌ మేనేజ్‌మెంట్‌ కోర్సు పూర్తి చేశాడు. వీరు బొల్లారంలో గదిని అద్దెకు తీసుకుని ఉంటున్నారు. శనివారం అనిల్‌గౌడ్‌ పుట్టిన రోజు ఉంది. దీంతో అక్కడ ఉన్న కొందరు మిత్రులకు గురువారం పుట్టిన రోజు విందును ముందుగానే ఏర్పాటు చేసి రాత్రికి తాను ఆర్మూర్‌ వెళ్లాలనుకున్నాడు. రాత్రి ఆలస్యం కావడంతో సుచిత్రలో ఉన్న హోటల్‌లో భోజనం చేసి ఆర్మూర్‌ వెళ్లాలనుకున్నాడు.

ఈ క్రమంలో గురువారం అర్ధరాత్రి ఒంటి గంట ప్రాంతంలో ముగ్గురూ పల్సర్‌ బైక్‌పై సుచిత్ర చౌరస్తాకు వచ్చారు. కొద్దిసేపటి తరువాత తిరిగి ఇంటికి బయలు దేరారు. బైక్‌ను వేగంగా నడపడంతో అల్వాల్‌ రోడ్‌ టర్నింగ్‌ వద్ద అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టింది. దీంతో ముగ్గురు ఎగిరిపడ్డారు. తీవ్రగాయాలైన ఇద్దరు అక్కడికక్కడే చనిపోగా, మరొకరిని స్థానికులు సమీపంలోని ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతిచెందాడు. ఘటనాస్థలిలో ఉన్న సీసీ కెమెరాల్లో నమోదైన ఫీడ్‌ను పరిశీలించిన పేట్‌ బషీరాబాద్‌ పోలీసులు ప్రమాద సమయంలో వాహనాన్ని అతి వేగంగా నడుపుతున్నట్లు గుర్తించారు. అనిల్‌ జన్మదినం శనివారం కావడంతో దీన్ని ఘనంగా నిర్వహించేందుకు స్నేహితులంతా వాట్సాప్‌ గ్రూపుల్లో సందేశాలు మార్చుకున్నారు. ఇంతలోనే రోడ్డు ప్రమాదంలో కన్నుమూయడంతో స్నేహితులంతా దిగ్భ్రాంతికి లోనయ్యారు. మృతుల కళ్లను వారి బంధువులు ఎల్‌వీ ప్రసాద్‌ కంటి ఆస్పత్రికి దానం చేశారు. కాగా ఇంజనీరింగ్‌ పూర్తయ్యాక అమెరికాలో ఉన్నత చదువులు చదవాలని ఎప్పుడూ కలలుకంటుండేవాడని సాయిరతన్‌ తల్లిదండ్రులు అరుణ, రమేశ్‌ కన్నీరుమున్నీరయ్యారు. ఉన్న ఒక్క కుమారుడు అనిల్‌ మృతి చెందడంతో ఆర్మూర్‌ మండలం మామిడిపల్లికి చెందిన సాగర్‌ గౌడ్‌ విషాదంలో మునిగిపోయారు. 

కారు ఢీకొని సెక్యూరిటీ గార్డు..
రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న సెక్యూరిటీ గార్డును వేగంగా వచ్చిన కారు బలిగొంది. ఐడీపీఎల్‌ ఇందిరాగాంధీ నగర్‌కు చెందిన రాజారామ్‌ ‘కొంపల్లి ఫేజ్‌’లో సెక్యూరిటీ గార్డుగా పని చేస్తున్నాడు. గురువారం అర్ధరాత్రి దాటిన తర్వాత రాజారామ్‌ విధులు ముగించుకుని నడుచుకుంటూ బొల్లారం రోడ్డు వైపు వెళ్తున్నాడు. అదే సమయంలో వెనుక నుంచి దూసుకొచ్చిన బొలేరో వాహనం ఢీకొట్టింది. దీంతో అక్కడికక్కడే మృతిచెందాడు. పేట్‌బషీరాబాద్‌ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

గుర్తు తెలియని వాహనం ఢీకొని..
గుర్తు తెలియని వాహనం ఢీకొని సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌ మృతి చెందిన ఘటన హైదరాబాద్‌ మియాపూర్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో శుక్రవారం చోటు చేసుకుంది. గడ్డె ప్రవీణ్‌ (32) మాతృశ్రీనగర్‌లోని సాయి నిలయంలో నివాసముంటూ టెక్‌ మహేంద్రలో సాప్ట్‌వేర్‌ ఇంజనీర్‌గా ఉద్యోగం చేస్తున్నాడు. ఇంటి నుండి విధులకు హోండా యాక్టివా మోటార్‌ సైకిల్‌పై వెళ్తుం డగా అల్విన్‌ ఎక్స్‌ రోడ్డు సమీపంలో గుర్తు తెలియని వాహనం ఢీకొట్టింది. తీవ్రగాయాలు కావడంతో స్థానికులు శ్రీకర హాస్పిటల్‌ తరలించారు. చికిత్స పొందుతూ సాయంత్రం మృతి చెందాడు. మృతుని అన్న గడ్డె ప్రదీప్‌ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
 
బైక్‌ అదుపుతప్పి మారేడ్‌పల్లి వాసులు...
ఓల్డ్‌ మారేడ్‌పల్లికి చెందిన శ్రీకాంత్‌ (35) వృత్తిరీత్యా కారు డ్రైవర్‌. 15 ఏళ్లుగా బెంగళూరులో నివసిస్తున్నాడు. శ్రీకాంత్, వాణిలకు అక్షయ (10), శ్రేయన్‌(7) పిల్లలు. శ్రీ కాంత్‌ తల్లి రంగనాయకి అనారోగ్యానికి గురికావడంతో నగ రానికి వచ్చాడు. మారేడ్‌పల్లికే చెందిన కొండల్‌ (40) ఇతడి స్నేహితుడు. ఇతడు గజ్వేల్‌ ఔటర్‌ రింగ్‌రోడ్డులోని ఓ కంపె నీలో లారీ మెకానిక్‌గా పనిచేస్తున్నాడు. శ్రీకాంత్‌ వచ్చిన విషయం తెలుసుకున్న ఇతడు గురువారం రాత్రి అతడి వద్దకు వచ్చాడు. అర్ధరాత్రి 12 గంటల వరకు ఓల్డ్‌ మారేడ్‌ప ల్లిలోని డబుల్‌ బెడ్‌రూం నిర్మాణం నేపథ్యంలో ఇళ్ల కూల్చివే త వద్ద ఉండిపోయారు. శుక్రవారం తెల్లవారుజామున ఒంటిగంటకు బుల్లెట్‌పై ఇరువురూ గజ్వేల్‌ ఔటర్‌ రింగ్‌రో డ్డుకు బయలుదేరారు. శామీర్‌పేట్‌లో తెలంగాణ స్పోర్ట్స్‌ స్కూల్‌ వద్దకు రాగానే బైక్‌ అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొంది. ఈ ప్రమాదంలో ఇరువురూ అక్కడికక్కడే చనిపోయారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top