ఘోర రోడ్డు ప్రమాదం.. ఐదుగురు మృతి

road accident in peddapalli

కరీంనగర్‌: పెద్దపల్లి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వేగంగా వెళ్తున్న కారు అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొని ఎదురుగా వస్తున్న మరో కారు పై పడింది. ఈ ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు మృతిచెందగా.. మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ సంఘటన పెద్దపల్లి మండలం అప్పన్నపేట వద్ద సోమవారం ఉదయం చోటుచేసుకుంది. కరీంనగర్‌లోని కార్ఖానగడ్డకు చెందిన అజీమ్‌(35) గోల్డెన్‌ బ్యాట్రీస్‌ పేరుతో ఓ దుకాణం నిర్వహిస్తున్నాడు. ఈ క్రమంలో కుటుంబ సభ్యులతో కలిసి మొహరం పండుగ సందర్భంగా స్వగ్రామమైన కాగజ్‌నగర్‌కు వెళ్లి తిరిగి ఇంటికి వస్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది.

ఈ ప్రమాదంలో అజీమ్‌తో పాటు ఆయన భార్య అర్షియా సుల్తానా(30), వారి మూడేళ్ల కూతురు మేహవిష్‌లతో పాటు మరదలు ఆఫ్రీన్‌(27), ఆమె కూతురు ఆరిఫా(1) మృతిచెందారు. మరో వాహనంలో ఉన్న ముగ్గురికి గాయాలయ్యాయి. ఇది గుర్తించిన స్థానికులు క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించి పోలీసులకు సమాచారం అందించారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని కేసు దర్యాప్తు చేస్తున్నారు. 

Back to Top