కాంగ్రెస్‌ గూటికి రేవంత్‌?

Revanth reddy likely to join in Congress party - Sakshi

ఢిల్లీలో రాహుల్‌గాంధీతో భేటీ!

సమావేశంలో కుంతియా, ఉత్తమ్, కొప్పుల.. వచ్చే నెలలోనే పార్టీ మార్పునకు అవకాశం

నవంబర్‌ 9 లేదా 12న వరంగల్‌లో రాహుల్‌ సభ 

రేవంత్, మరో ఎమ్మెల్యే, 20 మందికిపైగా ముఖ్య నేతల చేరిక 

పార్టీ మార్పు వార్తలు అవాస్తవం: రేవంత్‌

సాక్షి, న్యూఢిల్లీ: రాష్ట్రంలో టీటీడీపీకి గట్టి ఎదురుదెబ్బ తగలనుంది. ఆ పార్టీ రాష్ట్ర వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ ఎ.రేవంత్‌రెడ్డి కాంగ్రెస్‌ పార్టీ తీర్థం పుచ్చుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ మేరకు ఆయన మంగళవారం ఢిల్లీలో ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్‌ గాంధీతో భేటీ అయినట్లు తెలుస్తోంది. రేవంత్‌తో పాటు మరో ఎమ్మెల్యే, 20 మందికిపైగా నేతలు కూడా కాంగ్రెస్‌లో చేరనున్నట్లు సమాచారం. వచ్చే ఎన్నికల నాటికి టీఆర్‌ఎస్‌తో టీటీడీపీ పొత్తు పెట్టుకునే దిశగా అడుగులు పడుతున్నాయన్న అసంతృప్తి నేపథ్యంలో రేవంత్‌ పార్టీని వీడుతున్నట్లు ఆయన సన్నిహితవర్గాలు చెబుతున్నాయి. అయితే రాహుల్‌తో భేటీ అంశాన్ని, కాంగ్రెస్‌లో చేరిక వార్తలను రేవంత్‌రెడ్డి ఖండించారు.

రహస్యంగా భేటీ: విశ్వసనీయ సమాచారం మేరకు.. మంగళవారం మధ్యాహ్నం మూడున్నర గంటల సమయంలో కాంగ్రెస్‌ పార్టీ తెలంగాణ వ్యవహారాల ఇన్‌చార్జి ఆర్‌.సి.కుంతియా, పార్టీ ఎస్సీ సెల్‌ చైర్మన్‌ కొప్పుల రాజు, పీసీసీ అధ్యక్షుడు ఎన్‌.ఉత్తమ్‌కుమార్‌రెడ్డిలతో కలసి రేవంత్‌రెడ్డి రాహుల్‌ గాంధీ నివాసానికి వెళ్లినట్లు తెలిసింది. అక్కడ దాదాపు 20 నిమిషాల పాటు జరిగిన భేటీలో రేవంత్‌ చేరికపై స్పష్టత వచ్చినట్లు సమాచారం. టీడీపీలోని మరో ఎమ్మెల్యే, పలువురు కీలక నేతలతో సహా కాంగ్రెస్‌లో చేరేందుకు రేవంత్‌ ముహూర్తం ఖరారు చేసుకున్నట్లు తెలిసింది. ఈ సందర్భంగా రేవంత్‌కు తెలంగాణ పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్ష పదవి ఇవ్వడంపైనా చర్చ జరిగినట్లు సమాచారం.

నివురుగప్పిన నిప్పులా అసంతృప్తి
‘ఓటుకు కోట్లు’కేసులో చంద్రబాబును బ్రహ్మదేవుడైనా కాపాడలేడంటూ సీఎం కేసీఆర్‌ వ్యాఖ్యానించడం, ఆ కేసులో రేవంత్‌రెడ్డి కొద్దికాలం అండర్‌ ట్రయల్‌గా జైల్లో ఉండడం తెలిసిందే. అంత విరుద్ధమైన పరిణామాలు జరిగినా.. చివరికి టీడీపీ, టీఆర్‌ఎస్‌ల మధ్య సయోధ్య కుదరడం రేవంత్‌కు మింగుడుపడలేదని ఆయన సన్నిహిత వర్గాలు పేర్కొంటున్నాయి. పైగా తెలంగాణలో పార్టీ అధ్యక్ష బాధ్యతలు స్వీకరించాలన్న తన ఆకాంక్షను చంద్రబాబునాయుడు పట్టించుకోకపోవడం, తెలంగాణలో టీఆర్‌ఎస్‌ను కాంగ్రెస్‌ ఎదుర్కొనగలదన్న నమ్మకంతోనే రేవంత్‌రెడ్డి హస్తం పార్టీ వైపు మొగ్గుచూపారని అంటున్నాయి. పైగా అటు కేసీఆర్, ఇటు చంద్రబాబునాయుడు ఇద్దరూ కూడా తన సామాజిక వర్గాన్ని లక్ష్యంగా చేసుకుని కొత్త సమీకరణాలకు తెరతీస్తున్నారన్న వార్తలు రేవంత్‌ను కలవరపరిచాయని స్పష్టం చేస్తున్నాయి.

ఈ నేపథ్యంలో కాంగ్రెస్‌లో చేరే దిశగా నిర్ణయం తీసుకున్నట్లు ఆ వర్గాలు చెబుతున్నాయి. దీనిపై రేవంత్‌ తొలుత టీపీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌తో ప్రాథమికంగా చర్చలు జరిపారు. తనతో పాటు బలమైన బృందాన్ని కాంగ్రెస్‌లోకి తీసుకెళ్లాలన్న ప్రణాళికతో... టీటీడీపీలో భవిష్యత్తుపై ఆందోళనలో ఉన్న క్రియాశీలక నేతలతో మాట్లాడారు. దాదాపు 20 మంది నేతలతో చర్చించి పార్టీ మార్పు దిశగా ఒప్పించినట్లు కాంగ్రెస్‌ వర్గాల ద్వారా తెలిసింది. ఈ బృందంలో మరో టీడీపీ ఎమ్మెల్యేతోపాటు పలువురు మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, గత ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన నేతలు కూడా ఉన్నట్లు సమాచారం.

పార్టీ మార్పు అవాస్తవం: రేవంత్‌
తాను కాంగ్రెస్‌ పార్టీలో చేరుతున్నానంటూ వస్తున్న వార్తలన్నీ అవాస్తవమని రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. తాను ఓ కేసు విషయమై న్యాయవాదులను కలిసేందుకు ఢిల్లీకి వచ్చానని తెలిపారు. అయితే రేవంత్‌ విదేశీ పర్యటన కోసం ఢిల్లీలో విమానం ఎక్కేందుకు వచ్చిన చంద్రబాబును కలసి పార్టీ మారే అంశాన్ని వివరించనున్నారని రేవంత్‌ సన్నిహితులు పేర్కొంటున్నారు. 

నవంబర్‌ రెండో వారంలో ముహూర్తం
ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్‌ గాంధీ నవంబర్‌ రెండో వారంలో తెలంగాణలో పర్యటించనున్నారు. ఆ నెల 9న గానీ లేదా 12న గానీ వరంగల్‌లో కాంగ్రెస్‌ పార్టీ నిర్వహించే భారీ బహిరంగ సభలో ఆయన పాల్గొంటారు. ఆ సభలోనే రేవంత్‌రెడ్డి, ఇతర టీటీడీపీ నేతలు కాంగ్రెస్‌ తీర్థం పుచ్చుకోనున్నట్టు కాంగ్రెస్‌ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top