‘కృష్ణా’లో తగ్గిన వరద

Reduced flood to Krishna River  - Sakshi

తుంగభద్రలో నిలకడగా వరద ప్రవాహం

శ్రీశైలంలోకి 1,68,716 క్యూసెక్కుల ప్రవాహం

జూరాల గేట్లు మూసివేత.. పవర్‌హౌస్‌ ద్వారా విడుదల

సాక్షి, హైదరాబాద్‌: పశ్చిమ కనుమల్లో వర్షాలు ఆగిపోవడంతో కృష్ణా నదిలో వరద ప్రవాహం తగ్గుముఖం పట్టింది. ఎగువన ఆల్మట్టి, నారాయణపూర్‌ జలాశయాల్లోకి వరద ప్రవాహం తగ్గడంతో గేట్లను ఒకదాని వెనుక ఒకటి మూస్తూ దిగువకు విడుదల చేసే వరదను తగ్గిస్తూ వస్తున్నారు. శనివారం మధ్యా హ్నం జూరాల జలాశయం గేట్లను మూసేశారు. జలవిద్యుదుత్పత్తి కేంద్రాల (పవర్‌ హౌస్‌) ద్వారా విద్యుత్‌ను ఉత్పత్తి చేస్తూ జూరాల నుంచి దిగువకు నీటిని వదులుతున్నారు.

కృష్ణా నది ప్రధాన ఉప నది తుంగభద్రలో మాత్రం వరద ప్రవాహం నిలకడగా కొనసాగుతోంది. శనివారం తుంగభద్ర జలాశయంలోకి 62,415 క్యూసెక్కులు వస్తోంటే 60,278 క్యూసెక్కులను దిగువకు విడుదల చేస్తున్నారు. ఇందులో సుంకేశుల బ్యారేజీలోకి చేరుతున్న 56 వేల క్యూసెక్కులను దిగువకు వదులుతున్నారు. దాంతో శనివారం సాయంత్రం ఆరు గంటలకు శ్రీశైలం జలాశయంలోకి 1,68,716 క్యూసెక్కులు చేరుతున్నాయి.  

శ్రీశైలం నిండాలంటే 62 టీఎంసీలు అవసరం
ప్రస్తుతం జలాశయంలో 872.7 అడుగుల్లో 153.17 టీఎంసీలు నిల్వ ఉన్నాయి. జలాశయం పూర్తి స్థాయి నీటి మట్టం 885 అడుగులు. పూర్తి స్థాయి నీటి నిల్వ 215.807 టీఎంసీలు. జలాశయం నిండాలంటే 62 టీఎంసీలు ఇంకా అవసరం. కృష్ణా నదిలో వరద ప్రవాహం తగ్గిన నేపథ్యంలో ఆదివారం నుంచి ఎగువ నుంచి శ్రీశైలంలోకి వచ్చే వరద ప్రవాహం తగ్గిపోనుంది.

శ్రీశైలం జలాశయం ఎడమ, కుడి గట్టు పవర్‌ హౌస్‌ల ద్వారా 22 వేల క్యూసెక్కులను వినియోగించి విద్యుదుత్పత్తి చేస్తూ నాగార్జునసాగర్‌కు విడుదల చేస్తున్నారు. మరో 15 వేల క్యూసెక్కులను పోతిరెడ్డిపాడు, హంద్రీ–నీవా, కల్వకుర్తి ఎత్తిపోతల ద్వారా రెండు రాష్ట్రాలు వినియోగించుకుంటున్నాయి. నదీ పరీవాహక ప్రాంతంలో మళ్లీ వర్షాలు కురిస్తేనే కృష్ణా నది నుంచి తెలుగు రాష్ట్రాలకు వరద ప్రవాహం వచ్చే అవకాశం ఉంటుంది.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top