గజం జాగా రూ.లక్షా 20 వేలు!

Real estate business is gradually rebounding  - Sakshi

పెద్దపల్లి జెండా చౌరస్తాలో అత్యధికంగా ధర  

బెంబేలెత్తిపోతున్న జనం  

హైదరాబాద్‌కు మించిన ధరలు 

పెద్దపల్లి: పెద్దపల్లి జిల్లా కేంద్రంలో కొంతకాలంగా సద్దుమణిగిన రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం క్రమంగా పుంజుకుంటోంది. ఈసారి పట్టణ శివార్లలో కంటే జెండా చౌరస్తా నుంచి రాజీవ్‌ రహదారి, మెయిన్‌ రోడ్‌ భూములపైనే వ్యాపారులు దృష్టి పెట్టారు. తమ వ్యాపారాన్ని విస్తరించుకునేందుకు ప్రధాన రహదారులను ఎంచుకున్నారు. రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌కు మించిన ధరలు పెద్దపల్లిలోని భూములకు పలుకుతున్నాయి. హైదరాబాద్‌లో అప్పుడెప్పుడో గజానికి రూ.50 వేలు, లక్షా అంటే విన్నవారంతా ఆశ్చర్యపోయారు.

ప్రస్తుతం పెద్దపల్లిలోనూ అంతకుమించి ధర పలుకుతోంది. జెండా చౌరస్తాలోని ఓ చిన్నసైజు 80 గజాల రేకుల షెడ్డును రూ.కోటి 20 లక్షలకు విక్రయించారు. కమాన్‌రోడ్‌ నుంచి జెండా చౌరస్తాకు వెళ్లే మెయిన్‌ రోడ్డులో వారం రోజుల క్రితం ఓ వ్యాపారి రూ.45 వేలకు గజం కొనుగోలు చేశారు. ఆ పక్కనే మరో వ్యాపారి రూ. 60 వేలకు గజం తన స్థలం విక్రయిస్తానంటూ మార్కెట్‌లో పెట్టారు. ఇక ఆ పక్కనే ఉన్న మరో ఇంటి యజమాని తాను మాత్రం గజం రూ.75 వేలకు అమ్మేస్తానని చెబుతున్నారు. నిరుటితో పోలిస్తే ఈ ధరలు వందశాతం పెరిగాయి.

గతంలో మెయిన్‌రోడ్‌లో రూ. 30 వేలకు గజం పలికితే ప్రస్తుతం అది రూ. 60 వేలకు చేరుకుంది. జెండా చౌరస్తాలో రూ.40 వేలకు గజం కలిగిన స్థలం మూడింతలకు చేరి, రూ.లక్షా 20 వేలకు గజం చొప్పున అమ్ముడవుతుంది. ఇక్కడ ధరలు హైదరాబాద్‌తో పోలిస్తే ఏ కూకట్‌పల్లి, దిల్‌సుఖ్‌నగర్‌లాంటి భారీ మార్కెట్‌లు కలిగిన ప్రాంతాల్లో కూడా లక్షకుపైగా గజం ధర లేదని అంటున్నారు. అలాంటి రాజధానిని తలపించే రీతిలో పెద్దపల్లిలో మెయిన్‌రోడ్డు భూముల ధరలు ఆకాశాన్నంటాయి. అయితే భారీ మొత్తంలో నగదు చెల్లిస్తూ భూములు కొనుగోలు చేస్తున్న వారి ధైర్యానికి అందరూ ఆశ్చర్య పోతున్నారు.

 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Tags: 



 

Read also in:
Back to Top