మూడో విడత కౌన్సెలింగ్‌కు సై 

Ready to third phase Medical education admissions Counseling - Sakshi

నోటిఫికేషన్‌ విడుదల చేసిన ఆరోగ్య వర్సిటీ.. 

నేటినుంచి వెబ్‌ ఆప్షన్లు 

ఇంతవరకూ కాలేజీల్లో చేరని విద్యార్థులకు కౌన్సెలింగ్‌కు అనర్హత 

మొదటిసారిగా అగ్రవర్ణ పేదల 190 సీట్లకు కౌన్సెలింగ్‌ 

సాక్షి, హైదరాబాద్‌: వైద్య విద్య ప్రవేశాలపై నెలకొన్న సందిగ్ధత తొలగిపోయింది. మూడో విడత కన్వీనర్‌ కోటా సీట్ల భర్తీకి కాళోజీ నారాయణరావు హెల్త్‌ వర్సిటీ సోమవారం నోటిఫికేషన్‌ విడుదల చేసింది. రెండో విడత కన్వీనర్‌ కోటా కౌన్సెలింగ్‌పై ఇచ్చిన స్టేను, సోమవారం హైకోర్టు ఎత్తివేసిన వెంటనే వర్సిటీ అధికారులు షెడ్యూల్‌ విడుదల చేశారు. రెండోవిడత కౌన్సెలింగ్‌ తర్వాత విద్యార్థులు చేరకుండా మిగిలిపోయిన సీట్లు, స్పెషల్‌ కేటగిరీ (ఎన్‌సీసీ, సీఏపీ) సీట్లు, నేషనల్‌ పూల్‌లో మిగిలిపోయి రాష్ట్ర కోటాలోకి వచ్చిన సీట్లతో కలిపి సుమారు 500 సీట్లకుపైగా ఈ కౌన్సెలింగ్‌లో భర్తీ చేయనున్నారు. కొత్తగా దరఖాస్తు ప్రక్రియను పెట్టకుండా, జూలై 16న ప్రకటించిన మెరిట్‌ జాబితా ప్రకారం నేరుగా వెబ్‌ఆప్షన్లు ఇచ్చుకోవాలని విద్యార్థులకు సూచించారు. మంగళవారం (ఆగస్టు 20) ఉదయం 10 గంటల నుంచి 22న ఉదయం 11 గంటల వరకూ వెబ్‌ఆప్షన్ల నమోదుకు గడువిచ్చారు.

ఇది వరకే సీటు పొంది కాలేజీల్లో చేరిన విద్యార్థులు, కోర్సు మార్చుకోవాలనుకునే విద్యార్థులు సైతం వెబ్‌ఆప్షన్లు ఇవ్వాలని వర్సిటీ సూచించింది. అయితే, రెండోవిడత కన్వీనర్‌ కోటా కౌన్సెలింగ్‌లో సీట్లు పొందినప్పటికీ, కాలేజీల్లో చేరని విద్యార్థులు, చేరిన తర్వాత డిస్కంటి న్యూ చేసిన విద్యార్థులు ఈ కౌన్సెలింగ్‌లో పాల్గొనేందుకు అనర్హులని నోటిఫికేషన్‌లో పేర్కొన్నారు. ఆలిండియా కోటా కౌన్సెలింగ్‌లో సీట్లు పొందిన విద్యార్థులకు సైతం ఈ కౌన్సెలింగ్‌లో పాల్గొనడానికి అనర్హులని స్పష్టం చేశారు. ప్రభుత్వ కాలేజీలకు కేటాయించిన 190 అగ్రవర్ణ పేదల (ఈడబ్ల్యూఎస్‌) సీట్లను ఈ కౌన్సెలింగ్‌తోనే భర్తీ చేయనున్నారు. జూలై 16న ప్రకటించిన మెరిట్‌ జాబితాలో ఈడబ్ల్యూఎస్‌ సీట్లకు అర్హులుగా పేర్కొన్నవారంతా వెబ్‌ఆప్షన్లు ఇచ్చుకోవాలని వర్సిటీ వీసీ కరుణాకర్‌రెడ్డి సూచించారు. మొదటిసారిగా ఈడబ్ల్యూఎస్‌ సీట్లకు కౌన్సెలింగ్‌ జరుగుతుండటం విశేషం.

ఆగస్టు 31 నాటికి ప్రవేశాలు పూర్తి 
సుప్రీంకోర్టు గైడ్‌లైన్స్‌ ప్రకారం ఆగస్టు 31 నాటికి వైద్య విద్య ప్రవేశాలు ముగించాలి. ఆ రోజు తర్వాత కౌన్సెలింగ్‌ నిర్వహించడానికిగానీ, కాలేజీల్లో చేరడానికి అవకాశముండదు. ఒకవేళ సీట్లు మిగిలిపోయినా, ఆ సంవత్సరానికి అవి వృ«థా కావాల్సిందే. ఈ నేపథ్యంలో మొత్తం ప్రవేశాల ప్రక్రియ పూర్తి చేయడానికి కాళోజీ వర్సిటీకి మిగిలింది ఇంకా పదకొండు రోజులే. ఇప్పటివరకూ కన్వీనర్‌ కోటా రెండు విడతలు, మేనేజ్‌మెంట్‌ కోటా మొదటి విడత కౌన్సెలింగ్‌ మాత్రమే పూర్తయ్యాయి. ప్రస్తుతం మూడోవిడత కన్వీనర్‌ కోటా షెడ్యూల్‌ విడుదలైంది. అయితే, ఆగస్టు 22 వరకూ వెబ్‌ఆప్షన్లకు గడువు ఉండగా, ఆ తర్వాత ఒకట్రెండు రోజుల్లోనే సీట్లు కేటాయించే అవకాశముంది. సీట్లు పొందిన విద్యార్థులకు కాలేజీల్లో చేరేందుకు 2, 3 రోజుల సమయం ఇవ్వనున్నారు. ఈ లోగానే మేనేజ్‌మెంట్‌ కోటా రెండో విడత కౌన్సెలింగ్‌ షెడ్యూల్‌ విడుదల చేసి, దరఖాస్తులు ఆహ్వానించనున్నారు. ఇంతకుముందులా ఒక రౌండ్‌ తర్వాత మరో రౌండ్‌గాకుండా, ఓ రౌండ్‌ చివర్లోనే మరో రౌండ్‌కు నోటిఫికేషన్‌ ఇవ్వనున్నారు.  

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top