ర్యాపిడ్‌ టెస్టులు షురూ

Rapid antigen detection tests have started in Telangana - Sakshi

హైదరాబాద్‌లో యాంటిజెన్‌ టెస్టులు మొదలుపెట్టిన వైద్య శాఖ 

15 నుంచి 30 నిమిషాల్లోనే ఫలితం 

తీవ్ర జ్వరం, జలుబు, దగ్గు వంటి లక్షణాలు ఉన్నవారికే రాష్ట్రంలో 50 వేల పరీక్షలు చేయాలని నిర్ణయం 

సాక్షి, హైదరాబాద్‌:  రాష్ట్రంలో ర్యాపిడ్‌ యాంటిజెన్‌ డిటెక్షన్‌ టెస్టులు ప్రారంభమయ్యాయి. కరోనా వైరస్‌ వ్యాప్తి అత్యంత ఎక్కువగా ఉన్న హైదరాబాద్‌లో బుధవారం వీటికి శ్రీకారం చుట్టారు. నగరంలోని అర్బన్‌ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల (యూపీహెచ్‌సీ)లో వీటిని ప్రారంభించినట్లు వైద్య, ఆరోగ్యశాఖ వర్గాలు తెలిపాయి. అత్యధికంగా కేసులు నమోదవుతున్న జిల్లాల్లోని వివిధ ప్రాంతాల్లో కూడా మున్ముందు ఈ పరీక్షలు చేస్తారు. కరోనా కేసులు అధికంగా నమోదవుతుండటంతో సర్కారు యాంటిజెన్‌ టెస్టులు చేయాలని నిర్ణయించిన సంగతి తెలిసిందే. మొదటి దశలో రాష్ట్రంలో 50 వేల వరకు యాంటిజెన్‌ టెస్టులు చేస్తారు. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం నుంచి యాంటిజెన్‌ టెస్ట్‌ కిట్లు రాష్ట్రానికి వచ్చాయి. నమూనా ఇచ్చిన 15 నుంచి 30 నిమిషాల మధ్యే కరోనా నిర్ధారణ ఫలితం రావడం దీని ప్రత్యేకత.  

తీవ్రత ఎక్కువగా ఉన్నవారికే... 
రాష్ట్రంలో కరోనా కేసులు రోజురోజుకూ భారీగా పెరుగుతున్నాయి. ప్రస్తుతం ఆర్‌టీ–పీసీఆర్‌ టెస్టులు చేస్తున్నా, ఫలితాలు రావడానికి ఒక్కోసారి నాలుగైదు రోజుల నుంచి వారం రోజులు పడుతోంది. వివిధ జిల్లాల నుంచి భారీగా స్వాబ్‌ నమూనాలు రావడం, పరీక్షల సామర్థ్యానికి మించి రావడం తదితర కారణాలతో ఆలస్యం జరుగుతోంది. దీనివల్ల పాజిటివ్‌ వచ్చే అవకాశం ఉన్న వ్యక్తులు సరైన సమయంలో వైద్యం చేయించుకోలేని దుస్థితి ఏర్పడింది. పైగా వారం రోజుల వరకు వేచిచూడడం కూడా వారిని మానసికంగా ఆందోళనకు గురిచేస్తుంది. అలాగే వారు సాధారణంగా ఉండటం, బయటకు వెళ్లి రావడం, ఎలాంటి మందులు వాడకపోవడం తదితర కారణాల వల్ల ఇతరులకూ సోకే పరిస్థితి ఏర్పడుతుంది. అందుకే యాంటిజెన్‌ టెస్టులకు ప్రభుత్వం నడుం బిగించింది. వీటి ఫలితాలు తక్షణమే తెలిసే అవకాశం ఉండటంతో పాజిటివ్‌ వచ్చిన వ్యక్తులు అప్రమత్తమై తక్షణ వైద్యం పొందటానికి వీలు కలుగుతుందని వైద్య ఆరోగ్యశాఖ వర్గాలు చెబుతున్నాయి. అయితే ఈ పరీక్షలు కేవలం కరోనా వైరస్‌ లక్షణాలు తీవ్రంగా ఉన్నవారికే చేస్తారు. జ్వరం, జలుబు, దగ్గు, ఇతర లక్షణాలున్న వారికే దీన్ని చేస్తారు.  

ప్రైవేటు లేబొరేటరీల్లోనూ అనుమతించే అవకాశం... 
యాంటిజెన్‌ పరీక్షకు నమూనాలను సేకరించిన తర్వాత తప్పనిసరిగా గంటలోనే పరీక్ష చేయాలి. లేకుంటే నమూనా వృథా అయిపోతుంది. లేబొరేటరీలకు నమూనాలను రవాణా చేసే పరిస్థితి ఉండదు. అందువల్ల శాంపిళ్లు సేకరించిన ఆరోగ్య కేంద్రంలోనే అప్పటికçప్పుడు పరీక్ష చేయాలి. దీనికోసం ప్రత్యేకమైన పరికరాలు అవసరం లేదు. సాధారణ లేబొరేటరీ సౌకర్యం ఉంటే చాలు. ప్రస్తుతం ప్రభుత్వ ఆధ్వర్యంలోనే పరీక్షలు చేపట్టారు. కేసుల సంఖ్య పెరుగుతుండటంతో ప్రస్తుతం అనుమతి ఉన్న ప్రైవేటు లేబొరేటరీల్లోనూ యాంటిజెన్‌ పరీక్షలు చేసే అవకాశం ఉందని వైద్య, ఆరోగ్యశాఖ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. పైగా ఈ పరీక్ష చేయడానికి రూ. 500 మాత్రమే ఖర్చు కానుంది. ప్రస్తుతం ఆర్‌టీ–పీసీఆర్‌ పరీక్షకు ప్రైవేటు లేబొరేటరీల్లో రూ. 2,200 వసూలు చేస్తున్నారు.  

నెగెటివ్‌లో కచ్చితత్వం 50–70 శాతమే 
యాంటిజెన్‌ టెస్టు మూలంగా వేగంగా పరీక్షించడానికి, ట్రాక్‌ చేయడానికి, చికిత్స చేయడానికి వీలు కలుగుతుంది. అయితే ఈ పరీక్షకున్న ప్రధాన లోపం ఏంటంటే... వ్యక్తి నమూనాలను పరీక్షించాక ఫలితం పాజిటివ్‌ వస్తే పాజిటివ్‌గానే పరిగణిస్తారు. నెగెటివ్‌ వస్తే మాత్రం ఆర్‌టీ–పీసీఆర్‌ పద్దతిలో మరోసారి పరీక్ష చేసి నిర్ధారించుకోవాల్సి ఉంటుంది.  పాజిటివ్‌ వస్తే దాని కచ్చితత్వం 99.3 నుండి 100 శాతం ఉంటుందని అధికారులు చెబుతున్నారు. అయితే నెగెటివ్‌ వస్తే దాని కచ్చితత్వం 50 నుంచి 70 శాతం వరకు మాత్రమే ఉంటుందని చెబుతున్నారు. అందువల్ల నెగెటివ్‌ వచ్చిన వారికి మరోసారి ఆర్‌టీ–పీసీఆర్‌ పద్ధతిలో పరీక్ష చేయాల్సి ఉంటుంది. ఇదే దీని లోపమని, అయితే తీవ్రమైన లక్షణాలున్న వారికి మాత్రమే యాంటిజెన్‌ పద్దతిలో కరోనా నిర్ధారణ పరీక్ష చేయాలని అధికారులు నిర్ణయించారు. అందువల్ల కంటైన్మెంట్‌ జోన్లు, తీవ్రమైన వైరస్‌ లక్షణాలున్నవారు, 65 ఏళ్లకు పైబడినవారు, తీవ్రమైన శ్వాసకోశ సంబంధిత వ్యాధి ఉన్నవారు, 100.4 డిగ్రీలకు పైబడి జ్వరం ఉన్న వారే ఈ పరీక్షల కోసం రావాలని సూచిస్తున్నారు.

50 వేల కిట్లు సరిపోతాయా? 
రాష్ట్రానికి కేటాయించిన 50 వేల యాంటిజెన్‌ కిట్లు సరిపోతాయా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఒక్క గ్రేటర్‌ హైదరాబాద్‌ మహానగరంలోనే దాదాపు కోటి మంది జనాభా ఉన్నారు. ఇక్కడ కేసుల సంఖ్య అధికంగా ఉంది. ఈ 50 వేల కిట్లు ఏ మూలకూ సరిపోవని ఒక వైద్యాధికారి వ్యాఖ్యానించారు. నాలుగైదు రోజుల్లోనే ఇవి అయిపోయే అవకాశముందని అంటున్నారు. ఇక తర్వాత ఏంటనే ప్రశ్న ఉత్పన్నమవుతుంది.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top