ఘనంగా రంజాన్‌ 

Ramzan Festival Celebrations In Karimnagar - Sakshi

సప్తగిరికాలనీ(కరీంనగర్‌): నెల రోజులుగా ఉపవాస దీక్షలు ఆచరించిన ముస్లింలు సౌభ్రాతృత్వం, ఆనందం వెల్లివిరిసే ఈద్‌ ఉల్‌ ఫీతర్‌(రంజాన్‌) పండుగను భక్తి శ్రద్ధలతో బుధవారం ఘనంగా నిర్వహించారు. కొత్తబట్టలు ధరించి చింతకుంట, సాలేహ్‌నగర్‌ ఈద్గాల వద్దకు వాహనాలు, కాలినడకన పెద్ద సంఖ్యలో చేరుకుని ప్రత్యేక ప్రార్థనలు చేశారు. మత పెద్దలు ఇచ్చిన సందేశాన్ని ఆలకించారు. అల్లాహ్‌ సందేశాన్ని జీవితంలో ఆచరించే స్ఫూర్తిని అందించాలని ప్రార్థించారు. అటవీ కార్యాలయం ఎదురుగా, ఇతర ప్రాంతాల్లో ఉన్న సమాధులపై పూలు చల్లి తమ పూర్వీకులకు నివాళులు అర్పించారు. బంధువులు, స్నేహితులను ఆలింగనాలు చేసుకుని ఒకరికొకరు పండుగ శుభాకాంక్షలు తెలియజేసుకున్నారు. ఇళ్లల్లో బంధుమిత్రులకు  విందులు ఏర్పాటు చేసి మైత్రీ భావాన్ని చాటుకున్నారు. ట్రాఫిక్‌ ఇబ్బందులు తలెత్తకుండా సీవీఆర్‌ఎన్‌ రోడ్డు నుంచి  జగిత్యాల వెళ్లే దారిలో రాకపోకలను మళ్లించి, పోలీస్‌లు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు.

సాలెహ్‌నగర్‌లో ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, మైనార్టీ కార్పొరేషన్‌ చైర్మన్‌..
వివిధ పార్టీల రాజకీయ నాయకులు వివిధ ఈద్గాల వద్ద ముస్లింలకు శుభాకాంక్షలు తెలియజేశారు. సాలెహ్‌నగర్‌లోని ఈద్గా వద్ద కరీంనగర్‌ శాసనసభ్యులు గంగుల కమలాకర్, ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్‌రావు, మైనార్టీ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌ అక్బర్‌ హుస్సేన్, డిప్యూటీ మేయర్‌ గుగ్గిళ్లపు రమేష్‌ పాల్గొని ముస్లింలకు రంజాన్‌ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అని మతాల వారికి సమాన ప్రాతినిధ్యం ఇస్తోందని, హిందుముస్లింలు కలిసి మెలిసి ఉండాలని అన్నారు. ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్‌రావు మాట్లాడుతూ బంగారు తెలంగాణలో అన్ని వర్గాల ప్రజలు భాగస్వాములు కావాలన్నారు. కార్పొరేటర్‌ ఎండీ.ఆరీఫ్, దళిత, ముస్లిం నాయకుడు చంద్రశేఖర్, ముస్లిం మతపెద్దలు పాల్గొన్నారు.

శుభాకాంక్షలు తెలిపిన సీపీ..
సాలెహ్‌ నగర్‌ ఈద్గా వద్ద జిల్లా పోలీస్‌ యంత్రాంగం, పీసీ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పోలీస్‌ కమిషనర్‌ వీబీ.కమలాసన్‌రెడ్డి ముస్లింకు రోజా పూలు, చాక్లెట్‌లు ఇచ్చి శుభాకాంక్షలు తెలిపారు. పలువురు చిన్నారులు, యువకులు సీపీతో సెల్ఫీలు తీసుకొన్నారు. ఏసీపీ ఉషారాణితోపాటు పీసీ కమిటీ బాధ్యులు బుర్ర మధుసూదన్‌రెడ్డి, తుమ్మల రమేశ్‌రెడ్డి, గసిరెడ్డి జనార్దన్‌ రెడ్డి, ఘన్‌శ్యామ్‌ పాల్గొన్నారు.

పటిష్ట బందోబస్తు..
రంజాన్‌ పండుగను పురస్కరించుకొని నగరంలోని పలు ఈద్గాల వద్ద పోలీస్‌ యంత్రాంగం పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. ట్రాఫిక్‌ను నియంత్రించారు. సాలెహ్‌నగర్‌ వద్ద బందోబస్తును సీపీ కమలాసన్‌రెడ్డి, ఏసిపీ ఉషారాణి పర్యవేక్షించారు.

నగరంలోని ఈద్గాల వద్ద 
సాలెహ్‌నగర్‌లో జరిగిన ప్రార్థనలో ముస్లిం మత పెద్ద ముఫ్తీ గయాస్‌ ముషియొద్దీన్‌ ప్రసంగం చేశారు. దానధర్మాల ద్వారానే పుణ్యాన్ని సంపాదించుకోవాలని సూచించారు. పురానీ ఈద్గా, చింతకుంట ఈద్గా వద్ద ముప్తీ ఎత్తె మాదుల్‌ హాక్‌ నమాజ్‌తోపాటు ప్రసంగం చేశారు. బైపాస్‌రోడ్డులోని ఈద్గా అహ్మద్‌ వద్ద మౌలానా మహ్మద్‌ యూనుస్, నమాజ్‌ చేయించారు. అనంతరం ప్రసంగం చేశారు.

వెల్లివిరిసిన మత సామరస్యం...
నమాజ్‌ అనంతరం ముస్లింలు హిందువులను కూడా తమ ఇళ్లకు విందులకు ఆహ్వానించారు. ఒకరినొకరు ఆలింగనం చేసుకుని శుభాకాంక్షలు తెలియజేసి విందు ఆరగించారు. విదేశాలలోని బంధువులు, మిత్రులకు శుభాకాంక్షలు తెలిపారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top