నిజామాబాద్‌లో.. పసుపు బోర్డు ఏర్పాటు..

Rajnath Singh Meeting In Nizamabad - Sakshi

ఎర్రజొన్న రైతులనూ  ఆదుకుంటాం.. 

నిజాం షుగర్‌ ఫ్యాక్టరీని టేకోవర్‌ చేయిస్తాం 

కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ 

సాక్షి, నిజామాబాద్‌ : పసుపుబోర్డును ఏర్పాటు చేసి, పసుపునకు మంచి ధర లభించేలా చర్యలు చేపడతామని కేంద్ర హోంశాఖ మంత్రి, బీజేపీ ఎన్నికల మేనిఫెస్టో కమిటీ చైర్మన్‌ రాజ్‌నాథ్‌సింగ్‌ ప్రకటించారు. ఎర్రజొన్న రైతులనూ ఆదుకుంటామని హామీ ఇచ్చారు. నిజామాబాద్‌లోని పాలిటెక్నిక్‌ కళాశాల మైదానంలో మంగళవారం జరిగిన బహిరంగసభలో ఆయన ప్రసంగించారు. వంద రోజుల్లో నిజాం షుగర్స్‌ ఫ్యాక్టరీని తెరిపిస్తామని హామీ ఇచ్చిన టీఆర్‌ఎస్‌ పార్టీ ఐదేళ్లుగా హామీని విస్మరించిందని, తమ అభ్యర్థిని గెలిపిస్తే పారిశ్రామిక వేత్తలతో టేకోవర్‌ చేయించి ఫ్యాక్టరీని పునఃప్రారంభిస్తామని హామీ ఇచ్చారు.

 టీఆర్‌ఎస్, కాంగ్రెస్‌లపై విమర్శలు.. 
టీఆర్‌ఎస్‌తో పాటు, కాంగ్రెస్‌పైనా రాజ్‌నాథ్‌సింగ్‌ విమర్శలు చేశారు. నిజాంషుగర్స్‌ ఫ్యాక్టరీ నడవకపోయినప్పటికీ.. అవినీతి మాత్రం నడుస్తోందన్నారు. నిరుపేదల అభ్యున్నతి కోసం, దేశ అభివృద్ధి కోసం మోదీ ప్రభుత్వం అనేక పథకాలను అమలు చేస్తుంటే.. కొన్నింటికి టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అడ్డుపడుతోందని ఆరోపించారు. యూపీఏ హయాంలో దేశంలో 25 లక్షల గృహాలు నిర్మిస్తే., మోదీ ఐదేళ్ల పాలనలో 1.30 కోట్ల గృహాలను నిర్మించి ఇచ్చామన్నారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను వివరించిన రాజ్‌నాథ్‌.. కిసాన్‌ సమ్మాన్‌ యోజన కింద రైతులకు రూ.6 వేల ఆర్థిక సహాయం, సబ్సిడీ గ్యాస్‌ కనెక్షన్లు వంటి పథకాలను ప్రత్యేకంగా ప్రస్తావించారు. ఐదేళ్ల మోదీ పాలనలో దేశ ప్రతిష్ట ఎలా పెరిగిందో జిల్లా నుంచి ఇతర దేశాలకు వెళ్లిన వారిని అడగాలని సూచించారు. అసెంబ్లీ ఎన్నికల్లో సీఎం కోసం కేసీఆర్‌ కు ఓటేసిన ప్రజలు.. పార్లమెంట్‌ ఎన్నికల్లో మోదీ కోసం బీజేపీ అభ్యర్థులకు ఓటేయాలని విజ్ఞప్తి చేశారు.

రైతాంగం తిరగబడింది : డాక్టర్‌ లక్ష్మణ్‌ 
నిజామాబాద్‌లో ఎర్రజొన్న, పసుపు రైతులు టీఆర్‌ఎస్‌ ప్రభుత్వంపై తిరగబడుతున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్‌ లక్ష్మణ్‌ విమర్శించారు. టీఆర్‌ఎస్‌ సర్కారు ఇన్నాళ్లూ రైతులను మభ్యపెట్టిందని, వీధుల్లోకి వచ్చి ఉద్యమిస్తుంటే కనీసం పట్టించుకోలేదన్నారు. రైతులు 185 మంది నామినేషన్లు వేశారంటే వారి కడుపు ఎంత మండిందో అర్థం చేసుకోవచ్చన్నారు. టీఆర్‌ఎస్‌ పార్టీ మొదటి ఓటమి నిజామాబాద్‌లోనే చూడబోతోందని వ్యాఖ్యానించారు. సభలో నిజామాబాద్‌ పార్లమెంట్‌ పార్టీ ఇన్‌చార్జి వెంకటరమణి, జిల్లా అధ్యక్షులు పల్లెగంగారెడ్డి, పార్టీ జహీరాబాద్‌ అభ్యర్థి బానాల లక్ష్మారెడ్డి, నాయకులు యెండల లక్ష్మీనారాయణ, లోకభూపతిరెడ్డి, శ్రీనివాస్, లక్ష్మీనర్సయ్య తదితరులు పాల్గొన్నారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top