పంటలపై వరుణుడి ఆగ్రహం

నిజామాబాద్‌ జిల్లాలో వడగండ్ల వాన

6,600 హెక్టార్లలో పంటలకు నష్టం

సాక్షి ప్రతినిధి, నిజామాబాద్‌: సోమవారం రాత్రి 11 గంటల ప్రాంతంలో అకస్మాత్తుగా వచ్చిన వడగండ్ల వానకు నిజామాబాద్‌ జిల్లా అతలాకుతలం అయింది. వేలాది ఎకరాల్లో పంట నేలకొరిగింది. వందల సంఖ్యలో గొర్రెలు మృత్యువాత పడ్డాయి. బలమైన ఈదురు గాలు లతో ప్రారంభమైన వర్షం.. క్రమంగా పెరిగింది. భారీ సైజులతో కూడిన రాళ్లు పడ్డాయి. దీంతో పంట నేలకొరిగింది. ఎర్రజొన్న, మొక్కజొన్న, వరి, నువ్వు వంటి పంటలతో పాటు, ఉద్యానవన పంటలకు నష్టం వాటిల్లింది. కోతదశలో ఉన్న ఎర్రజొన్న పంట పూర్తిగా నేలకొరిగింది.

4,010 హెక్టార్లలో పంటనష్టం..
జిల్లాలో పంట నష్టం వివరాలను వ్యవసాయ, రెవెన్యూ అధికారులు ప్రాథమికంగా అంచనా వేశారు. మొత్తం 6,600 మంది రైతులకు సంబంధించిన 4,010 హెక్టార్లలో పంట నష్టం వాటిల్లినట్లు ప్రాథమికంగా తేలింది. జిల్లా లోని ఏడు మండలాల పరిధిలో 69 గ్రామాల్లో ఈ అకాల వర్షం ప్రభావం పడింది. అత్యధికంగా 2,742 హెక్టార్లలో ఎర్రజొన్న పంట దెబ్బతిన్నట్లు తేలింది. 899 హెక్టార్లలో మొక్కజొన్నకు నష్టం జరిగింది. అలాగే వరి 299 హెక్టా ర్లు, నువ్వు పంట 69 హెక్టార్లలో దెబ్బతింది. అకాల వర్షం పసుపు రైతులకు కన్నీటిని మిగిల్చింది. విక్రయించేందుకు కల్లాల్లో ఉంచిన పసుపు తడిసి ముద్దయింది.  

మృత్యువాత పడిన గొర్రెలు.. వడగండ్ల వాన తాకిడికి పశు సంపదకు కూడా నష్టం వాటిల్లింది. జిల్లా వ్యాప్తంగా 182 గొర్రెలు మృత్యువాత పడ్డాయి. ఇందులో 72 గొర్రెలు ప్రభుత్వం పంపిణీ చేసిన సబ్సిడీ గొర్రెలున్నట్లు అధికారులు గుర్తించారు.  

నిర్మల్‌ జిల్లాలో 10,770 ఎకరాలు..
భైంసా(ముథోల్‌): అకాల వర్షం నిర్మల్‌ జిల్లా రైతులను కోలుకోలేని విధంగా దెబ్బతీసింది. జిల్లావ్యాప్తంగా 10,770 ఎకరాల్లో పంట నష్టపోయినట్లు అధికారులు ప్రాథమిక అంచనా వేశారు. క్షేత్రస్థాయిలో పంటనష్టం మరింత పెరిగే అవకాశం ఉంది. సోమవారం రాత్రి 7గంటల ప్రాంతంలో వడగళ్లతో కురిసిన వర్షంతో మొక్కజొన్న, జొన్న, శనగ, మినుము పంటలు చాలా వరకు దెబ్బతిన్నాయి.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Tags: 



 

Read also in:
Back to Top