నేడు ప్రజాగర్జ

Rahul Gandhi Visit To Nizamabad - Sakshi

కామారెడ్డిలో నేడు నిర్వహించే కాంగ్రెస్‌ ప్రజాగర్జన సభకు ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ ముఖ్య అథితిగా హాజరుకానున్నారు. భద్రతా ఏర్పాట్లలో భాగంగా సభా ప్రాంగణాన్ని ఎస్‌పీజీ బలగాలు తమ ఆధీనంలోకి తీసుకోగా, ఎస్పీ శ్వేత ఆధ్వర్యంలో పోలీసు బలగాలతో గట్టి బందోబస్తు నిర్వహిస్తున్నారు. కామారెడ్డి, నిజామాబాద్‌ జిల్లాలతో పాటు మెదక్, సిద్దిపేట, సిరిసిల్ల, కరీంనగర్‌ జిల్లాల నుంచి బహిరంగ సభకు రెండు లక్షల మంది వస్తారని కాంగ్రెస్‌ నేతలు అంచనా వేస్తున్నారు.

సాక్షి, కామారెడ్డి : ఎన్నికల ప్రచారానికి శంఖారా వం పూరిస్తూ ఈ నెల 20న కాంగ్రెస్‌ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో పలు సభలకు సన్నాహాలు చేసింది. అందులో భాగంగా జిల్లా కేంద్రమైన కామారెడ్డి పట్టణంలో ప్రజాగర్జన పేరుతో భారీ బహిరంగ సభ నిర్వహిస్తోంది. సభకు ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ ముఖ్య అథితిగా హాజరుకానున్నారు. ఆయనతో పాటు పీసీసీ అధ్యక్షులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, రాష్రానికి చెందిన ముఖ్య నేతలంతా సభలో పాల్గొంటారు.కాగా  తెలంగాణ రాష్ట్రంలో ముందస్తు ఎన్నికల ప్రచారానికి రాహుల్‌గాంధీ ఢిల్లీ నుంచి విమానంలో మహారాష్ట్రలోని నాందేడ్‌కు చేరుకుంటారు. అక్కడి నుంచి ప్రత్యేక హెలికాప్టర్‌లో వచ్చి నిర్మల్‌ జిల్లా భైంసలో జరిగే బహిరంగ సభలో పాల్గొంటారు.

మధ్యాహ్నం అక్కడి నుంచి బయలుదేరి కామారెడ్డికి చేరుకుంటారు. మధ్యాహ్నం 3 గంటల నుంచి 4.30 గంటల వరకు కామారెడ్డి సభలో ఆయన పాల్గొని మాట్లాడుతారు. సభ ముగియగానే హెలికాప్టర్‌లో హైదరాబాద్‌కు బయలుదేరి వెళతారు. సభకు ప్రజాగర్జన సభగా నామకరణం చేసిన కాంగ్రెస్‌ పార్టీ నాయకత్వం భారీ ఏర్పాట్లు చేసింది. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో బహిరంగ సభకు ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. ఢిల్లీ నుంచి వచ్చిన ఎస్‌పీజీ బలగాలు సభా ప్రాంగణాన్ని తమ ఆధీనంలోకి తీసుకున్నాయి. జిల్లా ఎస్పీ శ్వేత ఆధ్వర్యంలో జిల్లా పోలీసులతో పాటు వివిధ జిల్లాల నుంచి తరలివచ్చిన పోలీసు బలగాలతో గట్టి భద్రతా చర్యలు చేపట్టారు. జిల్లా కేంద్రంలో ఎక్కడ చూసినా పోలీసులే కనిపిస్తున్నారు.

రెండు లక్షల మంది వస్తారని అంచనా.... 
బహిరంగ సభకు రెండు లక్షల మంది వస్తారని కాంగ్రెస్‌ పార్టీ నేతలు అంచనా వేస్తున్నారు. కామారెడ్డి, నిజామాబాద్‌ జిల్లాల నుంచే కాక పొరుగున ఉన్న మెదక్, సిద్దిపేట, సిరిసిల్లా, కరీంనగర్‌ జిల్లాల నుంచి కూడా పార్టీ శ్రేణులు తరలివస్తారని చెబుతున్నారు. ఆయా ప్రాంతాల నుంచి కాంగ్రెస్‌ పార్టీ కార్యకర్తలు తరలిరావడానికి ఏర్పాట్లు చేశారు. వాహనాల పార్కింగ్‌ కోసం పట్టణంలోని సీఎస్‌ఐ గ్రౌండ్‌తో పాటు డెయిరీ కాలేజీ ప్రాంతాన్ని, డిగ్రీ కళాశాల వెనుకభాగంలోని పీహెచ్‌సీ ప్రాంతాన్ని ఎంపిక చేశారు. ఆయా రూట్ల నుంచి వచ్చిన వాహనాలను నిర్దేశిత పార్కింగు స్థలంలోనే వాహనాలను నిలిపివేయాల్సి ఉంటుంది.
 
ఏర్పాట్లను పర్యవేక్షించిన ఆర్‌సీ కుంతియా.... 

కాంగ్రెస్‌ పార్టీ తెలంగాణ రాష్ట్ర ఇన్‌చార్జి, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ఆర్‌సీ కుంతియా గురువారం సభ ఏర్పాట్లను పర్యవేక్షించారు. ఆయన వెంట ఏఐసీసీ కార్యదర్శులు మధుయాష్కీ, సలీం హైమద్, శాసన మండలి విపక్ష నేత షబ్బీర్‌అలీ తదితరులున్నారు. సభకు వచ్చే కార్యకర్తలకు ఏ ఇబ్బందులు తలెత్తకుండా చూసుకోవాలని నేతలను కుంతియా ఆదేశించారు. సభా ప్రాంగణంలో మహిళలకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. వాలంటీర్లు ఆయా చోట్ల ఏర్పాట్లను చూసుకోవలసి ఉంటుందని నేతలు తెలిపారు. 

భారీ భద్రతా ఏర్పాట్లు.... 
ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ పాల్గొనే బహిరంగ సభ కావడంతో జిల్లా పోలీసు యంత్రాంగం భారీ భద్రతా ఏర్పాట్లు చేసింది. సభా ప్రాంగణం ముఖ్యంగా వేదికను ఎస్‌పీజీ అధికారులు తమ ఆధీనంలోకి తీసుకున్నారు. వారి అనుమతి లేకుండా లోనికి ఎవ్వరినీ అనుమతించే పరిస్థితి లేదని తెలుస్తోంది. జిల్లా ఎస్పీ శ్వేత ఆధ్వర్యంలో వివిధ జిల్లాల నుంచి వచ్చిన పోలీసు అధికారులు, సిబ్బందిని సభా ప్రాంగణంతో పాటు ఆయా కూడళ్లు, రోడ్ల వెంట భారీ ఎత్తున మోహరించారు. సభకు వచ్చే వాహనాల పార్కింగు నుంచి సభకు ప్రజలు వెళ్లే అన్ని దారుల వెంట పోలీసులు భద్రతా చర్యలను పర్యవేక్షిస్తారు.
 
రోడ్లవెంట కాంగ్రెస్‌ జెండాలు, ఫ్లెక్సీలు, బెలూన్లు.... 
జిల్లా కేంద్రంలోని ప్రధాన రూట్లలో రోడ్ల వెంట కాంగ్రెస్‌ పార్టీ జెండాలు, ఫ్లెక్సీలు, బెలూన్లు ఏర్పాటు చేశారు. రాహుల్‌ సభను ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న కాంగ్రెస్‌ పార్టీ నేతలు భారీ ఏర్పాట్లు చేశారు. నిజాంసాగర్‌ చౌరస్తా నుంచి డిగ్రీ కాలేజీ గ్రౌండ్‌ వరకు పెద్ద ఎత్తున కాంగ్రెస్‌ జెండాలతో పాటు ఫ్లెక్సీలను కట్టారు. ఎన్నికల సమయం కావడంతో పార్టీ శ్రేణులకు ఊపు తీసుకురావడానికి  ఆ పార్టీ నేతలు ప్రయత్నిస్తున్నారు.  

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top