27న రాహుల్‌ రాక?

Rahul Gandhi Visit In Khammam - Sakshi

సాక్షిప్రతినిధి, ఖమ్మం: శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్‌ తరఫున ప్రచారం చేసేందుకు ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ ఈనెల 27న ఖమ్మం జిల్లాకు రానున్నారు. జిల్లాలో జరిగే బహిరంగ సభలో పాల్గొని కాంగ్రెస్‌ పార్టీ నాయకులు, కార్యకర్తల్లో ఉత్తేజం నింపే ప్రయత్నం చేస్తారని ఆ పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. అయితే తొలివిడతగా ఈనెల 20వ తేదీన ఆదిలాబాద్‌ జిల్లాలో జరిగే బహిరంగ సభలో పాల్గొనే రాహుల్‌ గాంధీ.. రెండో విడతలో ఖమ్మం జిల్లాకు వచ్చే అవకాశం ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. వరంగల్, కరీంనగర్, ఖమ్మం జిల్లాల్లో రెండుచోట్ల రాహుల్‌ గాంధీ బహిరంగ సభలను నిర్వహించాలని యోచిస్తున్న కాంగ్రెస్‌ అధిష్టానం ఏయే ప్రాంతాలు అనువుగా ఉంటాయనే అంశంపై వివిధ కోణాల్లో పరిశీలన చేస్తున్నట్లు తెలుస్తోంది.

అయితే రాహుల్‌ గాంధీ ఖమ్మం పర్యటన అధికారికంగా దసరా పండగ తర్వాత ఖరారయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఖమ్మం జిల్లా కేంద్రంలో రాహుల్‌ గాంధీ బహిరంగ సభ నిర్వహిస్తే ఇటు భద్రాద్రి  కొత్తగూడెం, మహబూబాబాద్, సూర్యాపేట జిల్లాల ప్రజలకు, కాంగ్రెస్‌ కార్యకర్తలకు సౌలభ్యంగా ఉంటుందని భావిస్తున్న కాంగ్రెస్‌ నేతలు.. ఖమ్మంలో పర్యటన ఏర్పాట్ల కోసం కసరత్తు చేస్తున్నారు. ఉదయం ఒక జిల్లాలో బహిరంగ సభ ఉంటే.. మధ్యాహ్నం మరో జిల్లాలో సభ ఉండేలా కాంగ్రెస్‌ నాయకత్వం ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు సమాచారం. అయితే జిల్లాలో కాంగ్రెస్‌ పార్టీ తరఫున ఎన్నికల ప్రచారం నిర్వహించేందుకు రాష్ట్ర ఎన్నికల ప్రచార కమిటీ చైర్మన్‌ మల్లు భట్టి విక్రమార్క నేతృత్వంలో ప్రచార యాత్ర ఈనెల 16వ తేదీన ఖమ్మం జిల్లాకు రావాల్సి ఉంది. 16న పాలేరు నియోజకవర్గంలో.. అదే రోజు సాయంత్రం ఖమ్మం, వైరా నియోజకవర్గాల్లో బహిరంగ సభ, రోడ్‌ షోలు నిర్వహించాలని నిర్ణయించారు.

అయితే ఈనెల 20న రాహుల్‌ గాంధీ ఆదిలాబాద్‌ జిల్లా భైంసాకు వస్తుండడంతో ప్రచార యాత్రను వాయిదా వేశారు. ఈనెల 20న బోనకల్, త ల్లాడ, 21న కొత్తగూడెంలో జరిగే కాంగ్రెస్‌ ప్రచార యాత్ర, సభలు సైతం వాయిదాప డే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. రాహుల్‌ గాంధీ ఏఐసీసీ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఖమ్మం జిల్లాకు రావడం ఇదే మొదటిసారి కావడంతో కాంగ్రెస్‌ శ్రేణులను సభకు భారీగా తరలించి.. కార్యకర్తల్లో ఉత్సాహం నింపాలని పార్టీ నేతలు యోచిస్తున్నారు. కాగా.. రాహుల్‌ గాంధీ ఖమ్మం పర్యటనకు సంబంధించి ఇప్పటికే జిల్లాకు చెందిన సీనియర్‌ నేతలు, మాజీ మంత్రులు, కేంద్ర మాజీ మంత్రి రేణుకా చౌదరి, టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు మల్లు భట్టి విక్రమార్క తదితరులతో పార్టీ అధిష్టానం సమాలోచనలు జరుపుతున్నట్లు ప్రచారం జరుగుతోంది.  

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top