నేడే రాహుల్‌ సభ

Rahul Gandhi Visit in Adilabad - Sakshi

సాక్షి ప్రతినిధి, ఆదిలాబాద్‌: రాష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీ ఎన్నికల ప్రచారానికి తొలి వేదికగా భైంసా సర్వసన్నద్ధమైంది. ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ శనివారం మధ్యాహ్నం నిర్మల్‌ జిల్లా భైంసా నుంచి ఎన్నికల శంఖారావాన్ని పూరించనున్నారు. ఈ మేరకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. రాహుల్‌గాంధీ కటౌట్లు, ఫ్లెక్సీలతో సభా ప్రాంగణాన్ని తీర్చిదిద్దారు. షెడ్యూల్‌ ప్రకారం ఉదయం ఢిల్లీ నుంచి విమానంలో బయలుదేరి, భైంసా సమీపంలోని నాందేడ్‌ చేరుకోనున్నారు. అక్కడి నుంచి హెలికాప్టర్‌ ద్వారా మధ్యాహ్నం 12.30గంటల సమయంలో భైంసా సభకు హాజరు కానున్నారు. భైంసా సభ అనంతరం కామారెడ్డిలో ఏర్పాటు చేసిన సభలో పాల్గొని అక్కడి నుంచి హైదరాబాద్‌కు వెళతారు.
 
భారీగా ఏర్పాట్లు..

ముందస్తు ఎన్నికల ప్రచారంలో భాగంగా తొలిసారి రాష్ట్రానికి వస్తున్న ఏఐసీసీ చీఫ్‌ రాహుల్‌గాంధీకి కాంగ్రెస్‌ నాయకులు ఘనంగా స్వాగతం పలుకబోతున్నారు. భైంసాలోని పార్డి(బి) బైపాస్‌రోడ్డులో నిర్వహించనున్న బహిరంగ సభను విజయవంతం చేసేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. జనసమీకరణ అధికంగా ఉంటుందని భావిస్తున్న నేపథ్యంలో సభా ప్రాంగణాన్ని తదనుగుణంగా నిర్మించారు. సభాప్రాంగణం పనులను ఏఐసీసీ నాయకులు శ్రీనివాసన్‌ కృష్ణన్‌ ప్రత్యక్ష పర్యవేక్షణలో డీసీసీ అధ్యక్షుడు ఏలేటి మహేశ్వర్‌రెడ్డి నిర్వహించారు. ముథోల్‌ నియోజకవర్గ నాయకులు రామారావు పటేల్, నారాయణరావు పటేల్‌ తదితరులు సభా ఏర్పాట్లలో పాలుపంచుకున్నారు.

లక్షన్నర లక్ష్యంగా..
ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాకు రెండోసారి రానున్న తమ పార్టీ అధినేత రాహుల్‌గాంధీ బహిరంగసభను దిగ్విజయం చేసేందుకు పది నియోజకవర్గాల నేతలకు  ఆదేశాలు వెళ్లాయి. దాదాపు లక్షన్నర నుంచి రెండు లక్షల మంది జనం భైంసా సభకు తరలించే లక్ష్యాలను నిర్ధేశించారు. ఏఐసీసీ కార్యదర్శి శ్రీనివాసన్‌ కృష్ణన్‌ స్వయంగా నియోజకవర్గాల నుంచి పోటీ చేయనున్న నాయకులతో స్వయంగా మాట్లాడారు. ఉమ్మడి జిల్లాతోపాటు పక్క జిల్లాలైన నిజామాబాద్, జగిత్యాలలోని కొన్ని మండలాల నుంచి కూడా జనసమీకరణ జరుపుతున్నట్లు పార్టీ వర్గాలు పేర్కొన్నాయి. ప్రధానంగా నిర్మల్‌ జిల్లాలోని ముథోల్, నిర్మల్, ఖానాపూర్‌ నియోజకవర్గాల నుంచే అర లక్షకు పైగా జనాన్ని తరలించే ఏర్పాట్లు చేశారు.

జిల్లాకు రెండోసారి రాక..
కాంగ్రెస్‌ జాతీయ అధ్యక్ష హోదాలో తొలిసారి ఉమ్మడి జిల్లాకు వస్తున్న రాహుల్‌గాంధీ మూడేళ్ల క్రితం ఉపాధ్యక్షుడి హోదాలో నిర్మల్‌కు వచ్చారు. తాను చేపట్టిన కిసాన్‌ సందేశ్‌ యాత్రలో భాగంగా 2015 మే 14న రాత్రి నిర్మల్‌ చేరుకుని ఇక్కడే బసచేశారు. 15న నిర్మల్‌ జిల్లా మామడ మండలం కొరిటికల్‌ నుంచి లక్ష్మణచాంద మండలం వడ్యాల్‌ వరకు పాదయాత్ర చేపట్టారు. ఆత్మహత్యకు పాల్పడిన రైతు కుటుంబాలను రాహుల్‌గాంధీ పరామర్శించారు. రైతులతో మమేకమవుతూ వారి కష్టాలను తెలుసుకుంటూ ముందుకు సాగారు. అప్పుడు కూడా నాందేడ్‌ మీదుగా వాహనాల ద్వారా రోడ్డు మార్గంలో నిర్మల్‌ చేరుకున్నారు. ఇప్పుడు ఎన్నికల ప్రచారంలో భాగంగా రెండోసారి జిల్లాకు రానున్నారు. ముందుగా రాహుల్‌సభను ఆదిలాబాద్‌ జిల్లా నేరడిగొండలో నిర్వహించాలని రాష్ట్ర నాయకత్వం నిర్ణయించింది. అక్కడ భద్రతా పరిస్థితులు, రాజకీయాల నేపథ్యంలో భైంసాకు మార్చారు.

కాంగ్రెస్‌లోకి మున్సిపల్‌ చైర్మన్‌
నిర్మల్‌ మున్సిపల్‌ చైర్మన్‌ అప్పాల గణేశ్‌చక్రవర్తితోపాటు 21మంది కౌన్సిలర్లు, కో–ఆప్షన్‌ సభ్యులు, పలువురు టీఆర్‌ఎస్‌ నాయకులు రాహుల్‌గాంధీ సమక్షంలో కాంగ్రెస్‌లో చేరనున్నారు. నిర్మల్‌ జిల్లా కేంద్రంలో గత ఆదివారమే మున్సిపల్‌ చైర్మన్‌తో పాటు కౌన్సిలర్లు టీఆర్‌ఎస్, ఎంఐఎంలకు రాజీనామా చేశారు. అప్పటికప్పుడు డీసీసీ ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు మహేశ్వర్‌రెడ్డి సమక్షంలో కౌన్సిలర్లు కాంగ్రెస్‌లో చేరారు. గణేశ్‌చక్రవర్తి మాత్రం రాహుల్‌ సభకోసం వేచి ఉన్నారు.

భైంసా బహిరంగసభలో తన వర్గం కౌన్సిలర్లు, నాయకులతో కలిసి రాహుల్‌గాంధీ సమక్షంలో కాంగ్రెస్‌ కండువా వేసుకోనున్నట్లు గణేశ్‌చక్రవర్తి పేర్కొన్నారు. వీరితోపాటు ఉమ్మడి జిల్లా నుంచి మరికొందరు నాయకులు కాంగ్రెస్‌లో చేరనున్నట్లు ఆ పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. ఆయా నాయకుల పేర్లను మాత్రం వెల్లడించడం లేదు. తమ పార్టీ అధినేత సభను విజయవంతం చేస్తామని, కాంగ్రెస్‌ నాయకులు, కార్యకర్తలతో పాటు ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లా ప్రజలు భారీగా తరలిరావాలని డీసీసీ ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు ఏలేటి మహేశ్వర్‌రెడ్డి కోరారు.
 
గడ్డం వినోద్‌  చేరికపై సస్పెన్స్‌
మాజీ మంత్రి గడ్డం వినోద్‌కుమార్‌ టీఆర్‌ఎస్‌ నుంచి కాంగ్రెస్‌లో చేరే విషయంలో సస్పెన్స్‌ కొనసాగుతోంది. చెన్నూరులో టికెట్టు ఇవ్వకుండా టీఆర్‌ఎస్‌ తనను అవమానించిందని భావిస్తున్న వినోద్‌ మాతృసంస్థ కాంగ్రెస్‌లోకి చేరేందుకు ఢిల్లీ స్థాయిలో ప్రయత్నాలు చేశారు. రాష్ట్రానికి చెందిన కొందరు కాంగ్రెస్‌ నాయకులు వినోద్‌ చేరికకు అడ్డుపుల్ల వేసినట్లు తెలిసింది. గత ఎన్నికల నుంచి రెండుసార్లు టీఆర్‌ఎస్, కాంగ్రెస్‌లోకి తిరిగిన వినోద్‌ను మరోసారి కాంగ్రెస్‌లో చేర్చుకుంటే తప్పుడు సంకేతాలు పోతాయని అధి నాయకత్వానికి సూచించినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో రాహుల్‌గాంధీ సభలో వినోద్‌ చేరికపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. 

భారీగా బందోబస్తు
స్పెషల్‌ ప్రొటెక్షన్‌ గ్రూపు(ఎస్‌పీజీ) రక్షణ వలయంలో ఉండే రాహుల్‌గాంధీ సభకు నిర్మల్‌ జిల్లా ఎస్పీ భారీగా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎస్పీ శశిధర్‌రాజు ఆధ్వర్యంలో దాదాపు 500మంది పోలీసులు భద్రతలో పాల్గొంటున్నారు. ఏఎస్పీ, డీఎస్పీలు, సీఐలు, ఎస్సైలతోపాటు బాంబ్, డాగ్‌ స్క్వాడ్‌ బృందాలు, వివిధ విభాగాలకు చెందిన స్పెషల్‌ పోలీసులు భద్రతలో పాల్గొంటున్నట్లు ఎస్పీ తెలిపారు. పార్కింగ్‌ ఇబ్బందులు తలెత్తకుండా ట్రాఫిక్‌ డైవర్షన్‌ చర్యలు చేపట్టామన్నారు. బైపాస్‌ రోడ్డుకు సమీపంలోని జిన్నింగ్‌ మిల్‌ వద్ద పార్కింగ్‌ ఏర్పాట్లు చేశామని చెప్పారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top