‘ఇరిగేషన్‌’లో పదోన్నతుల లిటిగేషన్‌!

Promotion Litigation in Irrigation department - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: నీటి పారుదల శాఖలో ఇంజనీర్ల పదోన్నతుల అంశం వివాదాన్ని రాజేస్తోంది. సుప్రీంకోర్టు ఆదేశాల నేపథ్యంలో పదోన్నతుల అంశాన్ని అక్టోబర్‌ నెలాఖరులోగా పరిష్కరించే దిశగా నీటి పారుదల శాఖ చేస్తున్న కసరత్తుపై జోన్‌–6 ఉద్యోగులు అభ్యంతరం వ్యక్తం చేస్తుండటంతో వివాదం పెద్దదయ్యేలా కనిపిస్తోంది. నీటి పారుదల శాఖలో పదోన్నతుల అంశం ఎప్పటినుంచో ఉంది. ఒకే బ్యాచ్‌కు చెందిన ఇంజనీర్లు కొందరు ఐదో జోన్‌లో చీఫ్‌ ఇంజనీర్‌ స్థాయిలో వుంటే, అదే బ్యాచ్‌కు చెందిన ఇంజనీర్లు జోన్‌–6లో ఎగ్జిక్యూటివ్‌ ఇంజనీర్లు, డిప్యూటీ ఇంజనీర్ల స్థాయిలోనే పనిచేస్తున్నారని, ఈ దృష్ట్యా దీనిపై పునఃపరిశీలన చేయాలని కోరుతూ వచ్చారు. దీనిపై ఉమ్మడి రాష్ట్రంలో ప్రభుత్వం పలు కమిటీలు వేసినా ఫలితం లేకపోయింది. ఉమ్మడి ఏపీలో జరిగిన అన్యాయాన్ని తెలంగాణలో అయినా సవరించాలని ఆందోళనలు చేపట్టడంతో, ప్రభుత్వం ఆరు నెలల కిందట ఓ సర్క్యులర్‌ జారీ చేసింది. 

ప్రభుత్వ ఉత్తర్వులకు భిన్నంగా..: ప్రభుత్వం జారీ చేసిన సర్క్యులర్‌ ప్రకారం ఉమ్మడి ఏపీలోని మొత్తం పోస్టుల్లో 42 శాతాన్ని పరిగణనలోకి తీసుకొని ఇంజనీర్ల క్రమబద్ధీకరణ, పదోన్నతులు కల్పిస్తారు. 2014 జూన్‌ 2 నాటికి తెలంగాణలోని ఐదు, ఆరు జోన్లలో పని చేస్తున్న ఇంజనీర్ల సర్వీసులను క్రమబద్ధీకరించి పదోన్నతులు ఖరారు చేస్తారు. తొమ్మిది బ్యాచ్‌ల్లో ఏఈఈలుగా జరిగిన నియామకాలన్నింటినీ పరిగణనలోకి తీసుకొని సీనియారిటీ నిర్ణయిస్తారు. బ్యాచ్‌ల వారీగా డీఈఈలుగా పదోన్నతులు ఇస్తారు. డీఈఈల కేడర్‌లో పదోన్నతులకు రెండు జోన్లను కలిపి పరిగణనలోకి తీసుకొంటారు.

అయితే గతంలో ఇచ్చిన సర్క్యులర్‌కు భిన్నంగా 2014 అనంతరం ఉన్న జాబితాను పరిగణనలోకి తీసుకుంటూ సీనియారిటీ జాబితా తయారైందని జోన్‌–6 ఉద్యోగులు ఆరోపిస్తున్నారు. ఆ జాబితాతో తమకు అన్యాయం జరుగుతుందని ఇప్పటికే ఆ శాఖ స్పెషల్‌ సీఎస్‌ ఎస్‌కే జోషీ దృష్టికి తీసుకెళ్లారు. పరిపాలనా విభాగపు ఈఎన్‌సీ నాగేంద్రరావును కలసిన హైదరాబాద్‌ ఇంజనీర్స్‌ అసోసియేషన్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ మహేందర్, వైస్‌ ప్రెసిడెంట్‌ కె.చక్రధర్‌ల నేతృత్వంలో ఇంజనీర్ల బృందం.. నియామక సంవత్సరం వారీగా పదోన్నతులు ఇవ్వడానికి ఒప్పుకుంటూ, గతంలో సుప్రీంకోర్టుకి నీటిపారుదల శాఖ అఫిడవిట్‌ సమర్పించిన విషయాన్ని ఆయన దృష్టికి తీసుకెళ్లింది. ఇప్పటికైనా జోన్‌–6 ఇంజనీర్లకు ఉన్నతస్థాయి పదవుల్లో అవకాశం కల్పించాలని విన్నవించారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top