పదవి కోసం పూజలు

పదవి కోసం పూజలు - Sakshi

కోయదొరలను ఆశ్రయించిన ఎమ్మెల్యే కూతురు

- ఎనిమిది నెలల పాటు కొనసాగిన పూజలు

మూడు విడతల్లో రూ. 57 లక్షల అప్పగింత

సుబేదారి పోలీస్‌ స్టేషన్‌లో కోయదొరలపై కేసు నమోదు

 

సాక్షి, వరంగల్‌: తండ్రిని ఎలాగైనా మంత్రిగా చూడాలని భావించి కోయదొరలు చెప్పిన పూజలు చేయించింది ఎమ్మెల్యే కూతురు. ఇందుకోసం అక్షరాలా రూ. 57 లక్షలు చెల్లించింది. ఖాతా లెక్కల్లో ఈ తేడాలు రావడంతో విషయం వెలుగు చూడగా.. వివాదం పోలీస్‌ స్టేషన్‌కు చేరింది. పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి 2014 ఎన్నికల్లో టీడీపీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచి, టీఆర్‌ఎస్‌ పార్టీలో చేరారు. ఆయన కూతురు మానసరెడ్డికి హైదరాబాద్‌కు చెందిన రాకేశ్‌రెడ్డితో విహాహమైంది.



ఎమ్మెల్యే హన్మకొండలో ఉంటుండగా.. ఆమె అక్కడ ఉన్న సమయంలో నగరంలోని కరీమాబాద్‌కు చెందిన కోయ పూజారులుగా చెలామణి అవుతున్న పాస్తం నర్సింహరాజు అలియాస్‌ లక్ష్మణ్‌రాజు, పాస్తం రాజు అలియాస్‌ వంశీ కలిశారు.  పూజలతో మీ కోరికలు నెరవేరుతాయనే ఆశలు కల్పించారు. దీంతో పూజలు చేయించేందుకు మానసరెడ్డి అంగీకరించారు. 

 

పరకాల ఎమ్మెల్యే అయిన తండ్రి చల్లా ధర్మారెడ్డికి మంత్రి పదవి రావాలనే లక్ష్యంతో 2016 నవంబర్‌ నుంచి కోయదొరల ఆధ్వర్యంలో పూజలు మొదలయ్యాయి. వరంగల్‌ నగరంలో పలు చోట్ల, వారణాశి వంటి ఇతర ప్రాంతాల్లో పూజలు కొనసాగాయి. ఈ క్రమంలో కోయదొరలుగా చెప్పుకున్న పాస్తం నర్సింహరాజు, పాస్తం రాజుకు మానసరెడ్డి మూడు విడతల్లో రూ. 57 లక్షలు చెల్లించారు. తండ్రికి చెందిన ఓ కన్‌స్ట్రక్షన్‌ కంపెనీకి మానసరెడ్డి మేనేజింగ్‌ డైరెక్టర్‌గా ఉన్నారు. ఆ హోదాలో సెల్ఫ్‌ చెక్కు రాసుకుని, నగదు డ్రా చేసి చెల్లించినట్లు సమాచారం. కోయ దొరలు  పూజలు నిర్వహించినా ఫలితం రాకపోవడం, మరోవైపు కంపెనీ ఖాతాల్లో తేడాలు రావడంతో విషయం బయటపడింది. 

 

సుబేదారి ఠాణాలో కేసు..

కోయదొరల పూజలు, మంత్రి పదవి వంటి అంశాలు ఉండడంతో ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి నేరుగా పోలీసులకు ఫిర్యాదు చేయకుండా వియ్యంకుడి ద్వారా ఫిర్యాదు చేయించారు. దీంతో పాస్తం నర్సింహరాజు, వంశీలపై 420, 406 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.

 

జాతకాలను నమ్మొద్దు : ఎమ్మెల్యే చల్లా 

కోయదొరల మాయ మాటలు నమ్మి నా కూతురు పూజలు చేయించింది. గతంలో రెండు సార్లు నేను వారిని వెళ్లగొట్టాను. నేను లేని సమయంలో వారు ఇంటికి వచ్చి నా కూతురును నమ్మించారు. దీంతో రూ. 57 లక్షలు వారికి చెల్లించింది. ఈ విషయం నాకు తెలియడంతో పోలీస్‌ కేసు పెట్టాం. వారి నుంచి రూ.50 లక్షలు తిరిగి వచ్చాయి.మేము పోగొట్టుకున్న డబ్బు తిరిగి వచ్చినా.. జనాలకు మూఢ నమ్మకాలు వద్దనే విషయం  కేసు పెట్టాను. నా పదవి కోసం పూజలు చేయడం అనేది అబద్ధం.కుటుంబ సభ్యుల ఆరోగ్యం కోసం కుమార్తె పూజలు చేసింది.  
Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top