పైసలియ్యకపోతే పనికాదా..?

Power Department Officials Who Have Not Repaired Broken Columns in Khammam - Sakshi

పొలాల్లో విరిగిపడ్డ విద్యుత్‌ స్తంభాలు 

కొత్తవి ఏర్పాటు చేసేందుకు డబ్బులడుగుతున్న అధికారులు 

లబోదిబోమంటున్న రైతులు

రఘునాథపాలెం: ప్రభుత్వ శాఖలను అవినీతి జాడ్యం పట్టిపీడిస్తోంది. ఒక వైపు రెవెన్యూ శాఖ తీవ్ర స్థాయిలో అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటుంటే.. మరోవైపు విద్యుత్‌ శాఖాధికారులు కూడా తక్కువ కాదంటూ అన్నదాతను ఇబ్బందిపెడుతున్నారు. పొలాల్లో నేలకూలిన విద్యుత్‌ స్తంభాల స్థానంలో కొత్తవి ఏర్పాటు చేసేందుకు డబ్బులు అడుగుతున్నారని రైతులు ఆరోపిస్తున్నా రు. వివరాలు.. రఘునాథపాలెం మండలంలోని కోయచెలకలో రైతుల పోలాల్లో  విద్యుత్‌ లైన్‌కు చెట్లు అల్లుకున్నాయి. నెలరోజుల క్రితం అధికారులకు చెప్తే పట్టించుకోలేదు. మీరే కొట్టుకొండి అంటే, కొంత మంది రైతులు కలిసి చెట్లు కొట్టారు. ఆ క్రమంలో ఒక చెట్టు కొమ్మ విరిగి విద్యుత్‌ లైన్‌పై పడి స్తంభం విరిగింది. ఈ విషయం ఆనాడే అధికారుల దృష్టికి తీసుకెళ్లామని రైతులు చెపుతున్నారు.

వెంటనే అధికారులు స్పం దించకపోవడంతో తర్వాత వచ్చిన గాలివానకు విరిగిన స్తంభం పక్కనే మరో స్తంభం లోడుతో నేలకూలింది. దాంతో లైన్‌ మొత్తం నేలపై వాలింది. దీంతో పొలాలకు విద్యుత్‌ సరఫరా నిలిచిపోయింది. మళ్లీ ఈ విషయం అధికారుల దృష్టికి తీసుకెళ్తే మరమ్మతులు చేస్తామని, విరిగిన స్తంభాల వద్దకు కొత్త స్తంభాలను చేర్చాలని చెప్పడంతో ట్రాక్టరు ద్వారా రైతులే తోలుకున్నారు. ఆ తర్వాత అధికారులు పట్టించుకోలేదు. పలుమార్లు రైతులు అధికారులను సంప్రదించి, లైన్‌ సరి చేయాలని కోరుతుంటే అధికారులు ఖర్చు అవుతుందని, రూ.7వేలు డిమాండ్‌ చేసినట్టు తెలిపారు. ఉన్నతాధికారులు తమ గోడును విని, ఎండిపోతున్న తమ పత్తి పంటను కాపాడాలని రైతులు వేడుకుంటున్నారు.  

రైతులంటే ఎందుకంత చులకన?
తమ లైన్‌ సమస్యలపై అధికారుల చుట్టూ తిరిగినా పట్టించుకోవడం లేదు. రైతులుంటే వారికి అంత చులకన ఎందుకో అర్థకావట్లేదు. అదును కాలం పోతుంది. పోలం మధ్యలో లైన్‌ ఇలా నేల పైన ఉంటే సాగు పనులు ఎలా చేసుకోవాలి. పొలాని నీళ్లు ఎలా అందించాలి.   – అమరం అప్పారావు, రైతు 

మీటింగ్‌లో ఉన్న..
కోయచెలకలో రైతులకు సంబంధించిన విద్యుత్‌ లైన్‌ మరమ్మతులు చేసేందుకు ఏఈ శ్రీనివాసరావుకు ‘సాక్షి’ ఫోన్లో వివరణ కోరేందుకు ప్రయత్నించగా తాను మీటింగ్‌లో ఉన్నానని తర్వాత మాట్లాడుతని ఏఈ అన్నారు.   

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top