‘కరెంటు’ బంధం కట్‌?


 తెలంగాణ, ఏపీ మధ్య తారస్థాయికి బిల్లుల బకాయిల వివాదం

∙బకాయిలు చెల్లించకుంటే సరఫరా ఆపేస్తామంటూ పరస్పర నోటీసులు




సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాల మధ్య విద్యుత్‌ పంపకాలకు సంబంధించిన బిల్లుల బకాయిల వివాదం పతాక స్థాయికి చేరింది. తెలంగాణ నుంచి రావాల్సిన రూ.3,139 కోట్ల బకాయిలు చెల్లించకుంటే ఏ క్షణంలోనైనా రాష్ట్రానికి విద్యుత్‌ సరఫరా ఆపేస్తామంటూ ఏపీ జెన్‌కో బుధవారం తుది నోటీసు పంపడం తెలిసిందే.  ప్రతిగా తెలంగాణ ట్రాన్స్‌కో, జెన్‌కో కూడా ఏపీ జెన్‌కోకు తాజాగా నోటీసు పంపాయి. ఇరు రాష్ట్రాలు పరస్పరం చెల్లించుకోవాల్సిన బకాయిల సర్దుబాటు తర్వాత ఏపీ నుంచి రాష్ట్రానికి రావాల్సిన రూ.1,676.46 కోట్ల మిగులు బకాయిలు చెల్లించని పక్షంలో ఆ రాష్ట్రానికి విద్యుత్‌ సరఫరాను  నిలిపేస్తామని అందులో గట్టిగా పేర్కొన్నాయి.



 ఇరు రాష్ట్రాల మధ్య రెండేళ్లుగా నలుగుతున్న బిల్లుల బకాయి వివాదం ఈ పరస్పర నోటీసులతో తారాస్థాయికి చేరింది. ఇరు రాష్ట్రాలూ ఏ క్షణమైనా విద్యుత్‌ బంధాన్ని తెగతెంపులు చేసుకునే పరిస్థితులు ఉత్పన్నమయ్యాయి. విభజన చట్టం ప్రకారం ఉమ్మడి జెన్‌కో విద్యుత్‌ ప్లాంట్ల నుంచి తెలంగాణకు 53.89 శాతం, ఏపీకి 46.11 శాతం వాటాలున్నాయి. తెలంగాణ, ఏపీ మధ్య థర్మల్‌ విద్యుత్‌ పంపకాలు మూడేళ్లుగా జరుగుతున్నాయి. ఇరు రాష్ట్రాల వద్దా విద్యుత్‌ లభ్యత డిమాండ్‌కు మించి ఉన్న నేపథ్యంలో తాజా వివాదంతో పంపకాలు ఆగిపోయినా ఏ రాష్ట్రంలోనూ కరెంటు కొరత గానీ, సరఫరాలో సమస్యలు గానీ ఉత్పన్నమయ్యే పరిస్థితులు లేవు.



రూ.1676.46 కోట్లిస్తేనే కరెంటిస్తాం

తెలంగాణ, ఏపీ విద్యుత్‌ సంస్థలు పరస్పరం చెల్లించుకోవాల్సిన బిల్లుల బకాయిలను సర్దుబాటు చేసి, ఆ తర్వాత తెలంగాణ విద్యుత్‌ సంస్థలకు చెల్లించాల్సిన మిగులు బకాయిలను విడుదల చేసి వివాదాన్ని స్నేహపూర్వకంగా పరిష్కరించాలని గతంలో పలుమార్లు కోరినా ఏపీ విద్యుత్‌ సమన్వయ కమిటీ (ఏపీపీసీసీ) చైర్మన్‌ పట్టించుకోలేదని ట్రాన్స్‌కో, జెన్‌కో సీఎండీ, టీఎస్‌పీసీసీ చైర్మన్‌ డి.ప్రభాకర్‌రావు ఆరోపించారు. బకాయిలు చెల్లించకుండానే ఏపీ విద్యుత్‌ సంస్థలు ఏకపక్షంగా, విభజన చట్టానికి విరుద్ధంగా తెలంగాణకు విద్యుత్‌ ఆపేవేస్తామంటూ నోటిసులిచ్చాయంటూ తప్పుబట్టారు. తమ విజ్ఞప్తులను విస్మరించడమే గాక ఏపీ జెన్‌కోకు తెలంగాణ చెల్లించాల్సిన బకాయిల కోసమే ఏపీసీసీ ఒత్తిడి చేసిందని ఆక్షేపించారు. ‘‘డిస్కంలకు చెల్లించాల్సిన ఐసీడీ బకాయిలు, ట్రాన్స్‌కోకు చెల్లించాల్సిన బాండ్ల వడ్డీలు, ఎత్తిపోతల పథకాల నిధల బకాయిలు, ఉమ్మడి రుణాలకు సంబంధించి తెలంగాణ జెన్‌కో చెల్లించాల్సిన అధిక చెల్లింపుల మొత్తం, ఏపీపీడీసీఎల్‌లో తెలంగాణ విద్యు త్‌ సంస్థల పెట్టుబడులను చెల్లించాల న్న విజ్ఞప్తులకు స్పందించకపోవడం బాధాకరం.



 విభజన జరిగి మూడేళ్లయినా ఏపీ జెన్‌కో వారికి రావాల్సిన బకాయిల కోసం మాత్రమే ఒత్తిడి చేస్తోంది. బకాయిల వివాదాన్ని రాష్ట్రాల స్థాయిలోనే సామరస్యంగా, శాశ్వతంగా పరిష్కరించుకోవాలని తెలంగాణ విద్యుత్‌ సంస్థలు కోరుకుంటున్నాయి’’అని పేర్కొన్నారు. తమకు రూ.1,676.46 కోట్ల మిగులు మొత్తం చెల్లించాలని మరోసారి విజ్ఞప్తి చేశారు. ‘‘వివాద పరిష్కరానికి ఏపీ విద్యుత్‌ సంస్థలు సహకరించకపోవడం వల్ల తెలంగాణ విద్యుత్‌ సంస్థలు తీవ్ర ఆర్థిక సమస్యలు ఎదుర్కొంటున్నాయి.



ఉమ్మడి రాష్ట్రంలో అనంతపురం, కర్నూలు జిల్లాల కోసం తీసుకున్న రుణాల బకాయిలను మేం బలవంతంగా చెల్లించాల్సి వస్తోంది. తెలంగాణ జెన్‌కో కూడా ఉమ్మడి రుణ భారాన్ని తన వాటాకు మించి భరించాల్సి వస్తోంది. ఈ నేపథ్యంలో తెలంగాణ జెన్‌కో నుంచి ఏపీ డిస్కంలకు విద్యుత్‌ సరఫరాను నిలిపేయక తప్పదు’’అని స్పష్టం చేశారు. బకాయిలు చెల్లించాక ఏపీకి సరఫరాను పునరుద్ధరిస్తామన్నారు. తెలంగాణకు సరఫరా చేయని కరెంటుపై కెపాసిటీ చార్జీలను తమ డిస్కం లు చెల్లించాల్సిన అవసరం లేదన్నారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top