ఆ రెండు రోజులే..

Pollution Control From Three Days in Hyderabad - Sakshi

సంక్రాంతికి సగానికితగ్గిన కాలుష్యం

ఈనెల 14,15 తేదీల్లో స్వచ్ఛమైన గాలి

సిటీజనులు పల్లెబాట..

రహదారులపై తగ్గిన వాహనాల రద్దీ

సాక్షి,సిటీబ్యూరో: మహానగరం సంక్రాంతి పండగకు ‘ఊపిరి’ పీల్చుకుంది. ట్రాఫిక్‌ రద్దీలో రణగొణ ధ్వనులు, ముక్కుపుటాలను అదరగొట్టే కాలుష్యంతో ఉక్కిరిబిక్కిరయ్యే సిటీజనులు భోగి, సంక్రాంతి రోజుల్లో శబ్ద, వాయు కాలుష్యం లేకుండా గడిపారు. సాధారణ రోజులతో పోలిస్తే ప్రధాన రహదారులు, ముఖ్య కూడళ్లలో సూక్ష్మ, స్థూల ధూళికణాల మోతాదుతో పాటు కార్బన్‌ మోనాక్సైడ్, నైట్రోజన్‌ ఆక్సైడ్, సల్ఫర్‌ డయాక్సైడ్‌ వంటి కాలుష్య ఉద్గారాలు భారీగా తగ్గినట్టు పీసీబీ ప్రాథమిక పరిశీలనలో తేలింది. కాలుష్య నియంత్రణ మండలి ప్రమాణాల ప్రకారం ఘణపు మీటర్‌ గాలిలో ధూళికణాల సాంధ్రత 60 మైక్రోగ్రాములు దాటరాదు.

కానీ సాధారణ రోజుల్లో  బాలానగర్, ఉప్పల్, జూబ్లీహిల్స్, చార్మినార్, ప్యారడైజ్, జూపార్కు, పంజగుట్ట, కూకట్‌పల్లి, చిక్కడపల్లి, ఎంజీబీఎస్, మాదాపూర్‌ లో రెట్టింపు స్థాయి కాలుష్యం నమోదవుతుంది. ఆయా ప్రాంతాల మీదుగా రాకపోకలు సాగిస్తున్న పాదచారులు, ప్రయాణికులు, వాహన చోదకులు ఈ ధూళి కాలుష్యంతో ఉక్కిరిబిక్కిరవడం, శ్వాసకోశాలు తీవ్రంగా దెబ్బతిని ఆస్పత్రుల పాలవడం సర్వసాధారణమైంది. అయితే, పండగ వేళ ఈ ప్రాంతాల్లో పరిస్థితి సమూలంగా మారిందని పీసీబీ ప్రకటించింది. కొన్ని ప్రాంతాల్వాయు కాలుష్యం సగానికి తగ్గగా.. మరికొన్ని చోట్ల గణనీయంగా తగ్గుముఖం పట్టింది.

కాలుష్యం తగ్గుదల కారణాలివీ..
సంక్రాంతి పండగ సందర్భంగా నగరం నుంచి సుమారు 30 లక్షల మంది సొంతూళ్లకు పయనం కావడంతో నగరంలో వ్యక్తిగత వాహనాలు, ఆర్టీసీ బస్సుల్లో రాకపోకలు సాగించే వారి సంఖ్య సగానికి పైగా తగ్గిపోయింది.  
నగరంలో నిత్యం తిరిగే 50 లక్షల వాహనాల్లో 14,15 తేదీల్లో కేవలం 25 లక్షలకు మించలేదు.  
ఆయా వాహనాలకు వినియోగించే డీజిల్, పెట్రోల్‌ వినియోగం సైతం బాగా తగ్గింది. దీంతో వాయు కాలుష్య ఉద్గారాలైన కార్బన్‌ మోనాక్సైడ్, సల్ఫర్‌ డయాక్సైడ్, నైట్రోజన్‌ ఆక్సైడ్‌ మోతాదు సైతం తగ్గింది.  
ప్రధాన రహదారులపై ట్రాఫిక్‌ ఝాంజాటం లేకపోవడంతో సగటు వాహనవేగం 18 కేఎంపీహెచ్‌ నుంచి 40 కేఎంపీహెచ్‌కు పెరిగింది. దీంతో రణగొణ ధ్వనులు, కాలుష్య ఉద్గారాలు తగ్గాయి. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top