పురపాలక ఎన్నికల్లో హైటెక్‌ ప్రచారం..!

Political Parties Using Social Media For Municipal Elections - Sakshi

పురపాలక ఎన్నికల్లో సామాజిక మాధ్యమాలే ప్రచార వారధులు

ఇప్పటికే అభ్యర్థుల పేర్లతో వాట్సప్‌ గ్రూప్‌ల ఏర్పాటు  

సాక్షి, పాలమూరు: ‘పురపాలక’ ఎన్నికల కోసం ప్రచారం క్రమంగా వేడెక్కుతోంది. బరిలో నిలిచే నేతలు ఓటర్లను ఆకట్టుకోవడానికి ‘వినూత్నంగా’ ప్రయత్నిస్తున్నారు. సామాజిక మాధ్యమాల్లో ప్రచారంపై దృష్టి కేంద్రీకరిస్తున్నారు. వాట్సప్, ఫేస్‌బుక్‌ను వేదికగా ఎంచుకొంటున్నారు. ఉమ్మడి జిల్లాలో పలువురు అభ్యర్థులు ఇప్పటికే పట్టణ మున్సిపాలిటీల్లో విడివిడిగా వాట్సప్‌ గ్రూపులు ఏర్పాటు చేసి పోస్టులు పెడుతున్నారు. కొందరు అభ్యర్థులు ఒక అడుగు ముందుకు వేసి సామాజిక మాధ్యమాల్లో ప్రచారం నిర్వహించడానికి ప్రత్యేకంగా సిబ్బందిని నియమించుకున్నారు.

గతంలో ఎన్నికల ప్రచారంలో గోడ రాతలు, ఇంటింటికీ కరపత్రాలు, బ్యానర్ల వినియోగం ఎక్కువగా ఉండేది. కాలానికనుగుణంగా నేతలు డిజిటల్‌ ప్రచారంపై దృష్టి సారించారు. ప్రస్తుతం అందరి చేతిలో స్మార్ట్‌ఫోన్‌ ఉంది. పలు కంపెనీలు ఇస్తున్న ఆన్‌ లిమిటెడ్‌ నెట్‌ కనెక్షన్‌ వల్ల ఇంటర్‌నెట్‌ వినియోగం బాగా పెరిగింది. వాట్సప్, ఫేస్‌బుక్, యూట్యూబ్, ట్విట్టర్‌ వాడటం రోజురోజుకు పెరుగుతుంది. నేతలు ఓటర్లును ఆకట్టుకోవడానికి వీటినే ప్రచార మార్గాలుగా ఎంచుకొంటున్నారు.

సామాజిక మాధ్యమాల్లో అనేక యాప్‌లు అందుబాటులో ఉన్నాయి. ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లాలో ప్రజలు వినియోగించే వాటిలో మాత్రం వాట్సప్, ఫేస్‌బుక్‌దే సింహభాగం. ఈ మాధ్యమాల్లో బృందాలను ఏర్పాటు చేసి తమ సందేశాలను పంచుకొంటున్నారు. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ఓటర్లలో 60శాతం మందికి వాట్సప్‌ అకౌంట్‌ ఉందని ఓ అంచనా. ఇక ఫేస్‌బుక్, ట్విటర్‌ విద్యార్థులు, యువత ఎక్కువగా వినియోగిస్తున్నారు.

ఫేస్‌బుక్‌లలో యువసేనలు
ఫేస్‌బుక్‌లలో అభ్యర్థులు, ఆశావహుల అభ్యర్థులైన నాయకుల పేర్లమీద యువసేన పని చేస్తోంది. వీరే తమ నాయకుల ప్రచారం బాధ్యతలను స్వీకరిస్తున్నాయి. యువతే అధికంగా ఉండటం, సామాజిక మాధ్యమాల్లో ఎక్కువ సమయం గడిపేవారే ఎక్కువకావడంతో ఆయా పార్టీలకు ఉపయోగపడనుంది. మున్సిపాలిటీ వారీగా ఆయా పార్టీలు వాట్సప్‌ ద్వారా తమ సందేశాన్ని తెలిపేందుకు యత్నిస్తున్నాయి. ఇందుకు ఓటర్ల సెల్‌ఫోన్‌ నంబర్లు అవసరం. వాటి సేకరణ బాధ్యత ఆయా గ్రామాల పార్టీ శ్రేణుల నుంచి తీసుకోవాలనే ఆలోచనలో ఉన్నారు. ముఖ్యంగా ఆయా కాలనీ బాధ్యులతో పార్టీ ప్రచార సందేశాన్ని ఆ ప్రాంత ఓటర్లకు చేరవేసే ప్రయత్నం చేస్తున్నారు. సాంకేతికతను వినియోగించే యువ సైన్యం కోసం అన్వేషిస్తున్నారు.

ఒక్కో ప్రాంతంలో ఒక్కోరకమైన ప్రచారం
ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లాలో ఉన్న మున్సిపాలిటీల్లో పోటీ చేయడానికి సిద్ధంగా ఉండి ఇతర పార్టీల నుంచి టికెట్లు ఆశించే ఆశావహులు సైతం ఇప్పటికే ప్రచారం ముమ్మరం చేయడంతో పాటు సామాజిక మాధ్యమాలలో చేసిన ప్రచారం ఫొటోలు, వీడియోలు ఆఫ్‌లోడ్‌ చేస్తూ మరింత ప్రచారం చేసుకుంటున్నారు. వాట్సప్‌లో బృందాలు ఏర్పాటు చేసి తమ అభిమాన నాయకుల కార్యక్రమాలు వారి గుణగణాలను తెలియజేస్తూ సమాచారం పంపిణీ చేస్తున్నారు. ఇదంతా ద్వితీయ శ్రేణి నాయకుల కనుసన్నల్లో కొనసాగుతోంది. జిల్లాలో ఒక్కో ప్రాంతంలో ఒక్కోరకమైన ప్రచారం సాగుతోంది.

ఇప్పటికే టీఆర్‌ఎస్‌ అభ్యర్థులు అక్కడక్కడ ప్రచారం చేసుకుంటున్నారు. ఇది కాకుండా నేరుగా అభ్యర్థిని చేరుస్తూ ముఖ్యనాయకుల గ్రూప్‌ ఒకటి ప్రత్యేకంగా నిర్వహిస్తున్నారు. ఈ గ్రూప్‌ ద్వారా అసంతృప్తులు, ప్రజలేమనుకుంటున్నారు? ఏం కోరుకుంటున్నారు? అనే విషయాలను క్షేత్రస్థాయి కార్యకర్తల గ్రూప్‌ ద్వారా అధ్యయనం చేస్తున్నారు. దీన్ని ఆధారం చేసుకొని ఎన్నికల ప్రచారంలో వ్యూహాలు రూపొందిస్తున్నట్లు సమాచారం.

నాయకుల కుటుంబ సభ్యులు ప్రత్యేకంగా వారి తరఫున సామాజిక మాధ్యమాల ఖాతాలను నిర్వహిస్తున్నారు. సామాజిక మాధ్యమాల్లోనే అభ్యర్థుల కటౌట్‌లతో ఫొటోలను తయారు చేసి ప్రచారం చేస్తున్నారు. అభ్యర్థుల అనుచరులు ఫేస్‌బుక్‌లో ఎప్పటికప్పుడు ఫొటోలను ఆప్‌లోడ్‌ చేస్తున్నారు. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top