గెలుపు గుర్రాల కోసం అన్వేషణ

Political Parties Focuses On ZPTC And MPTC Elections In Telangana - Sakshi

కొత్త జిల్లాల్లో తొలిసారి ప్రాదేశిక సమరం జరగనుంది. అసెంబ్లీ, సర్పంచ్, పార్లమెంట్‌ ఎన్నికల్లో క్షణం తీరిక లేకుండా గడిపిన అన్ని పార్టీల నేతలకు ప్రాదేశిక ఎన్నికల రూపంలో మరో సవాల్‌ను ఎదుర్కొనే పరిస్థితి వచ్చింది. ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల ప్రకటనలతో అన్ని పార్టీల్లోనూ మళ్లీ హడావిడి మొదలైంది. పార్టీ గుర్తుతో ఎన్నికలు జరుగుతుండడంతో ప్రధాన పార్టీలు గెలుపు గుర్రాల కోసం అన్వేషణ మొదలెట్టాయి.

సాక్షి, నాగర్‌కర్నూల్‌: ప్రాదేశిక ఎన్నికలకు సంబంధించి ఒకట్రెండు రోజుల్లో నోటిఫికేషన్‌ విడుదలయ్యే అవకాశం ఉండడంతో అన్ని పార్టీలు సిద్ధమవుతున్నాయి. పల్లెల్లో మరోసారి రాజకీయం వేడెక్కుతోంది. ఇప్పటికే ఆశావహులు నేతలను ప్రసన్నం చేసుకునే పనిలో నిమగ్నమయ్యారు. పార్టీల వారీగా సమావేశాలు నిర్వహిస్తూ అభ్యర్థుల ఎంపికపై కసరత్తు చేస్తున్నారు. మెజార్టీ అభిప్రాయం మేరకు జాబితాను సిద్ధం చేసుకుంటున్నారు. ఇప్పటికే ఖరారైన రిజర్వేషన్ల ప్రకారం పోటీల ఉంటే అభ్యర్థి వ్యక్తిగత బలం, పార్టీ బలం, ఆర్థికస్థోమత వంటి అంశాలను లెక్కలోకి తీసుకుని గెలుపే లక్ష్యంగా అభ్యర్థుల ఎంపికకు కరసత్తు చేస్తున్నారు. అసెంబ్లీ, సర్పంచ్‌ ఎన్నికల్లో సత్తాచాటిన టీఆర్‌ఎస్‌ ప్రాదేశిక ఎన్నికల్లోనూ అదే ఊపును కొనసాగించాలని పట్టుదలతో ఉంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో అవలంబించాల్సిన వ్యూహాలపై రెండు రోజుల క్రితం నిర్వహించిన టీఆర్‌ఎస్‌ రాష్ట్ర కార్యవర్గ సమవేశంలో అధినేత కేసీఆర్‌ ఎమ్మెల్యేలు, మంత్రులకు దిశా నిర్దేశం చేయడంతో పార్టీ శ్రేణుల్లో మరింత ఉత్సాహం వచ్చింది.   

రిజర్వేషన్లు ఇలా..   
ఇప్పటికే అన్ని జిల్లాల్లో జనాభా ప్రకారంగా రిజర్వేషన్లు, ఓటర్ల జాబితా ఖరారయ్యాయి. కొత్త జిల్లాలకు జెడ్పీ చైర్మన్‌ పదవి కూడా కేటాయించారు. నాగర్‌కర్నూల్‌ జిల్లాలో 212 ఎంపీటీసీ, 20 చొప్పున జెడ్పీటీసీ, ఎంపీపీ స్థానాలున్నాయి. జెడ్పీ చైర్మన్‌ పదవి ఎస్సీ జనరల్‌కు రిజర్వ్‌ అయింది. అలాగే ఎంపీటీసీ, ఎంపీపీ, జెడ్పీ స్థానాలు కూడా రిజర్వ్‌ చేశారు. జిల్లాలోని 212 స్థానాలకు ఎస్సీలకు 44, ఎస్టీలకు 29, బీసీలకు 34 స్థానాలు ఖరారయ్యాయి. ఎంపీపీల్లో ఎస్సీలకు 4, ఎస్టీలకు 4, బీసీలకు 2, మహిళలకు 11 కేటాయించగా, జెడ్పీటీసీల్లో ఎస్సీలకు 4, ఎస్టీలకు 3, బీసీలకు 3, మహిళలకు 10 చొప్పున కేటాయించారు. ఇందులో 50శాతం మహిళలకే సీట్లు రిజర్వ్‌ అయ్యాయి. అలాగే వనపర్తి జిల్లాలో 14 ఎంపీపీ, 14 జెడ్పీ స్థానాలు, 128 ఎంపీటీసీ స్థానాలున్నాయి. జోగుళాంబ గద్వాల జిల్లాలో 12 ఎంపీపీ, 12 జెడ్పీటీసీ స్థానాలు, 141 ఎంపీటీసీ స్థానాలున్నాయి. వాటన్నింటికీ ఇప్పటికే రిజర్వేషన్లు ఖరారు అయ్యాయి. మండల పరిషత్‌ స్థానాల ఆధారంగా చూస్తే ఉమ్మడి జిల్లాలో మహబూబ్‌నగర్, వనపర్తి జిల్లాల్లో 14 చొప్పున, గద్వాలలో 12, నారాయణపేటలో 11 స్థానాలు మాత్రమే ఉన్నాయి. నాగర్‌కర్నూల్‌ జిల్లాలోనే అత్యధికంగా మండల పరిషత్‌లు ఉన్నాయి. గద్వాల జిల్లాలో రెండు విడతల్లో, వనపర్తి, నాగర్‌కర్నూల్‌ జిల్లాలో మూడు విడతల్లో ప్రాదేశిక ఎన్నికలు జరగనున్నాయి.  

జోరు కొనసాగించేందుకు టీఆర్‌ఎస్‌ సన్నద్ధం  
మరోసారి పల్లెపోరులో జోరు చూపించేందుకు టీఆర్‌ఎస్‌ సిద్ధమవుతోంది. ఇటీవల జరిగిన పార్లమెంట్‌ ఎన్నికల్లో అన్ని స్థానాల్లో విజయం ఖాయమని చెప్పిన కేసీఆర్‌ అదే తరహాలోనే వచ్చే మండల పరిషత్, జిల్లా పరిషత్‌ ఎన్నికల్లో గులాబీ జెండాలను ఎగురవేయాలని కేసీఆర్‌ శ్రేణులకు సూచించారు. పంచాయతీ ఎన్నికల్లో గులాబీ పార్టీ గుబాళింపు తరహాలోనే పార్టీ గుర్తుతో జరిగే ఎన్నికలు జరుగుతుండడంతో.. ప్రాదేశిక ఎన్నికలను మరింత ప్రతిష్టాత్మకంగా తీసుకొని విజయం సాధించాలనే పట్టుదలతో ముందుకెళ్తోంది. రాష్ట్రంలో మారిన రాజకీయ సమీకరణలతో జిల్లా, మండల పరిషత్‌ ఎన్నికల్లో జెడ్పీటీసీ, ఎంపీటీసీ సభ్యులుగా పోటీకి అధికార టీఆర్‌ఎస్‌లో తీవ్రమైన పోటీ నెలకొంది. రిజర్వేషన్లకు అనుగుణంగా తమకే అవకాశాలు కల్పించాలని ఒక్కో స్థానం నుంచి నలుగురు, ఐదుగురు పోటీ పడుతుండటంతో పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్‌చార్జ్‌లకు అభ్యర్థుల ఎంపిక కత్తిమీద సాముగా మారుతోంది.

ఆయా నియోజకవర్గాల ఎమ్మెల్యేల వద్ద పోటీకి ఆసక్తి చూపుతున్న అభ్యర్థుల, వారి మద్దతుదారులతో పెద్ద ఎత్తున లాబీయింగ్‌లకు పాల్పడుతున్నారు. మొత్తంగా అభ్యర్థుల ఎంపిక టీఆర్‌ఎస్‌తో నేతలకు కొంత తలనొప్పిగానే మారనుంది. వనపర్తి, జోగుళాంబ గద్వాల జిల్లాల బాధ్యతను వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డికి, నాగర్‌కర్నూల్‌ బాధ్యతను ఇటీవల ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసిన టీఆర్‌ఎస్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి.రాములకు కేసీఆర్‌ అప్పగించారు. వీరి నేతృత్వంలోనే, ఎమ్మెల్యేలకు ప్రధానంగా బాధ్యతలు అప్పగించి గెలుపే లక్ష్యంగా ముందుకెళ్లేందుకు వ్యూహాలు రచిస్తున్నారు. జెడ్పీచైర్మన్‌ పదవికి ఎవరికి ఇవ్వాలనే విషయంపై ఒక స్పష్టత వచ్చినట్లు సమాచారం.

పట్టు నిలుపుకొనేందుకు కాంగ్రెస్, బీజేపీ ప్రయత్నం
ప్రాదేశిక ఎన్నికల్లో తమ పట్టు నిలుపుకునేందుకు కాంగ్రెస్, బీజేపీ కూడా కసరత్తు చేస్తున్నాయి. జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థుల ఎంపికకు కాంగ్రెస్‌ ఇప్పటికే కసరత్తు ప్రారంభించింది. మండలాల వారీగా కీలక నేతలతో సమావేశాలు నిర్వహిస్తూ అభ్యర్థి ఎంపిక పై మాజీ ఎమ్మెల్యేలు, పార్టీ కీలక నేతలు దృష్టి సారించారు. పోటీకి ఆసక్తి ఉన్న అభ్యర్థుల జాబితాను సిద్దం చేసుకుంటున్నారు. పోటీకి ఆసక్తి చూపిస్తున్న అభ్యర్థుల్లో క్షేత్రస్థాయి పరిస్థితుల ప్రకారం ఎవరైతే గెలుపునకు అవకాశం ఉందో అలాంటి వారికి ప్రాధాన్యత ఇస్తున్నారు. జెడ్పీటీసీ, ఎంపీటీసీ సభ్యులతో పాటు రిజర్వేషన్లకు అనుగుణంగా జెడ్పీ చైర్మన్, ఎంపీపీ అభ్యర్థుల పేర్లను ముందే ఖరారు చేయాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. అలాగే బీజేపీ కూడా తమకు పట్టున్న స్థానాల్లో పోటీలో ఉండాలని భావిస్తోంది. అంతర్గతంగా సమావేశాలు నిర్వహిస్తూ అభ్యర్థుల ఎంపికకు కసరత్తు చేస్తున్నారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top