స్థానిక పోరుకు ‘బస్తీ’మే సవాల్‌..!

Political Parties Active In Local Elections - Sakshi

సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్‌: మున్సిపల్‌ ఎన్నికలకు సంబంధించి ఇప్పటికే వార్డుల విభజన.. అభ్యంతరాల స్వీకరణ.. పరిశీలన ప్రక్రియ పూర్తయింది. వార్డులు, కులాల వారీగా ఓటర్ల జాబితా తయారు కసరత్తు శరవేగంగా జరుగుతోంది. ఇటు అధికారిక ఏర్పాట్లు చురుకుగా సాగుతున్నాయి. మరో నెల రోజుల వ్యవధిలో ఎన్నికలు పూర్తయ్యే అవకాశాలుండడంతో ప్రధాన పార్టీలన్నీ గెలుపు వ్యూహాల్లో నిమగ్నమయ్యాయి. గత పాలకవర్గంలో కౌన్సిల్‌లో ఉన్న బలాబలాలు లెక్కలేసుకోవడంతో పాటు ఈ సారి ఆయా పట్టణాల్లో గెలుపు వ్యూహాలకు పదునుపెడుతున్నాయి. ఇప్పటికే అన్ని పట్టణాల్లో తమదైన శైలిలో ప్రచారానికి తెరలేపిన ప్రధాన పార్టీల నేతలు మున్సిపాలిటీల వారీగా తమ గెలుపునకు కలిసొచ్చే అంశాలతో పాటు ప్రతికూల పరిస్థితుల గురించి ఆరా తీస్తున్నారు.

ఉమ్మడి జిల్లాలో పాత మున్సిపాలిటీలైన మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్, బాదేపల్లి, నారాయణపేట, గద్వాల, అయిజ, వనపర్తి, కల్వకుర్తి, అచ్చంపేట, కొల్లాపూర్‌ మున్సిపాలిటీతో పాటు ఈసారి అదనంగా కొత్తగా కొలువుదీరిన అమరచింత, పెబ్బేరు, కోస్గి, మక్తల్, అలంపూర్, వడ్డేపల్లి, కొత్తకోట, ఆత్మకూరు, భూత్పూర్‌ ‘పుర’ పీఠాల కైవసం కోసం అన్ని పార్టీలు పావులు కదుపుతున్నారు. అచ్చంపేట మున్సిపాలిటీ పాలకవర్గం పదవీ కాలం 2021 మార్చి వరకు ఉండడం, బాదేపల్లి మున్సిపాలిటీ గ్రామ పంచాయతీ పరిధిలో ఉండడంతో ఆ రెండు మినహా 17 మున్సిపాలిటీలకు ఎన్నికలు జరగనున్నాయి. 

అధికార పార్టీకి రెబెల్స్‌ బెడద 
ఈ ఎన్నికల్లో అధికార టీఆర్‌ఎస్‌ పార్టీకి గట్టిపోటీ తప్పేటట్లు లేదు. అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాలు ప్రధాన ఎజెండాతో ప్రజల ముందుకు వెళ్లాలని భావిస్తోన్నా.. వనపర్తి, నాగర్‌కర్నూల్, కొత్తకోట మినహా మిగిలిన స్థానాల్లో రెబెల్స్‌ బెడదతో పాటు బీజేపీ, కాంగ్రెస్‌ నుంచి గట్టిపోటీ ఇవ్వనున్నాయి. గద్వాల జిల్లా పరిధిలోని అయిజ, అలంపూర్, వడ్డేపల్లి, నాగర్‌కర్నూల్‌ జిల్లా పరిధిలోని కొల్లాపూర్, కల్వకుర్తి, నారాయణపేట జిల్లా పరిధిలోని కోస్గి మున్సిపాలిటీల్లో అధికార టీఆర్‌ఎస్‌ వర్గపోరును ఎదుర్కొంటోంది. దీంతో ఆయా మున్సిపాలిటీల్లో టికెట్లు ఆశిస్తున్న వారి సంఖ్య ఎక్కువే ఉంది. ఒకవేళ వీరిలో ఎవరికైనా టికెట్లు రాని పక్షంలో వారందరూ రెబెల్స్‌గా పోటీ చేస్తామని ఇప్పటికే తేల్చి చెప్పారు. ఇలాంటి పరిస్థితుల్లో టికెట్ల ఖరారు ఆయా ఎమ్మెల్యేలకు సవాల్‌గా మారిందనే చెప్పవచ్చు. 

పుంజుకున్న కమలం 
కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ సైతం సాధ్యమైనంత వరకు మున్సిపాలిటీల్లో పాగా వేయాలనే పట్టుదలతో ఉంది. ఇప్పటికే సంప్రదాయ ఓట్లు ఉన్న మక్తల్, నారాయణపేట మున్సిపాలిటీలను ఈ సారి ఎలాగైనా కైవసం చేసుకోవాలనే పట్టుదలతో ఆ పార్టీ ఉంది. మరోవైపు అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల తర్వాత కేంద్రం, రాష్ట్రంలో చోటు చేసుకున్న పరిణామాలతో గద్వాల, భూత్పూర్, మహబూబ్‌నగర్, అమరచింత, ఆత్మకూరు పట్టణాల్లో కాషాయ పార్టీ బలం పుంజుకుంది. దీంతో ఆ ఏడు మున్సిపాలిటీల్లో అధికార టీఆర్‌ఎస్‌కు గట్టిపోటీ ఇచ్చేందుకు బీజేపీ పావులు కదుపుతోంది. అయితే మహబూబ్‌నగర్‌లో మంత్రి శ్రీనివాస్‌గౌడ్, గద్వాలలో ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి బీజేపీని ఢీ కొనేందుకు సిద్ధంగా ఉన్నారు. 

ఉనికి కాపాడుకునే ప్రయత్నంలో కాంగ్రెస్‌  వరుస ఓటములతో చతికిలపడ్డ కాంగ్రెస్‌ పార్టీ ఈ సారి మున్సిపల్‌ ఎన్నికల్లో అత్యధిక సీట్లు గెలుచుకుని ఉనికి కాపాడుకునే ప్రయత్నం చేస్తుంది. అయిజ, వడ్డేపల్లి, అలంపూర్, కొత్తకోట, పెబ్బేరు, కల్వకుర్తి, కోస్గి మున్సిపాలిటీల్లో అధికార టీఆర్‌ఎస్‌కు గట్టిపోటీ ఇచ్చే పరిస్థితులు కనబడుతున్నాయి. వీటిలో కొత్తకోట, పెబ్బేరు మినహా అన్ని పట్టణాల్లో టీఆర్‌ఎస్‌కు రెబెల్స్‌ బెడద పొంచి ఉన్న నేపథ్యంలో ఆయా పురాల్లో గెలుపుపై ఆశలు పెట్టుకుంది. ఏదేమైనా ప్రస్తుత పరిస్థితులు ఇలా ఉన్నప్పటికీ నోటిఫికేషన్‌ వెలువడిన వెంటనే రాజకీయ సమీకరణాల్లో భారీగా మార్పులొస్తాయని రాజకీయ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top