దేవుడా.. నీదే భారం..!

ఇష్టదైవాలకు మొక్కుకున్న తర్వాతే అభ్యర్థుల నామినేషన్లు 

ఏ రంగంలోనైనా జయాపజయాలు సహజం. అయినా.. కొందరు తమ సెంటిమెంట్‌కు ఎంతో ప్రాధాన్యం ఇస్తుంటారు. ఏ పని మొదలుపెట్టాలన్నా తొలుత తమ ఇష్టదైవాల దీవెనలు అందుకుని కార్యక్రమాలు ప్రారంభిస్తుంటారు. అదే తరహాలో ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని మన రాజకీయ నేతలూ దేవుళ్ల ఆశీస్సులు పొందిన తర్వాతే ముందుకు వెళుతున్నారు. అందులో భాగంగానే తమ ఆరాధ్యదైవాలకు ప్రత్యేక పూజలు నిర్వహించిన తర్వాతే ఎన్నికల ప్రచారం.. నామినేషన్‌ దాఖలు చేస్తున్నారు. ఉమ్మడి జిల్లాలోని ఆయా నియోజకవర్గాల్లో ఎన్నికల బరిలో నిలిచిన కాంగ్రెస్, టీఆర్‌ఎస్‌ అభ్యర్థుల ఇష్టదైవం ఎవరో తెలుసుకుందామా.
ఆంజనేయస్వామికి పూజలు చేసి .. 


ఆంజనేయస్వామికి పూజలు చేస్తున్న ఉత్తమ్‌కుమార్‌రెడ్డి (ఫైల్‌ ) 
సాక్షి,హుజూర్‌నగర్‌ :  హుజూర్‌నగర్‌ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా బరిలో దిగుతున్న తెలంగాణ కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్‌.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ప్రతి ఏడాది ఆంజనేయస్వామికి పూజలు చేసి నామినేషన్‌కు బయలుదేరి వెళతారు. గత సాధారణ ఎన్నికల సమయంలో 09 ఏప్రిల్, 2014న హుజూర్‌నగర్‌ మండలం గోపాలపురం ఆంజనేయస్వామి దేవాలయానికి వెళ్లి స్వామి వారికి ప్రత్యేక పూజలు చేశారు. అక్కడ నుంచి హుజూర్‌నగర్‌కు చేరుకుని నేరుగా స్థానిక తహసీల్దార్‌ కార్యాలయానికి వెళ్లి నామినేషన్‌ దాఖలు చేశారు. గత ఎన్నికల నాటి నుంచి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఆంజనేయస్వామి భక్తుడిగా కొనసాగుతూ నియోజకవర్గానికి వచ్చిన ప్రతిసారీ స్వామి వారిని దర్శించుకుని వెళుతున్నారు. 
అమరవీరుల స్థూపం వద్ద నివాళులర్పించి ..
2014 సాధారణ ఎన్నికల సమయంలో టీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా పోటీచేసిన కాసోజు శంకరమ్మ పట్టణంలోని అమరవీరుల స్థూపం వద్ద నివాళులర్పించి నామినేషన్‌ వేశారు. తెలంగాణ అమరవీరుడి తల్లిగా ఆమె అమరవీరులను స్మరించుకుంటూ టీఆర్‌ఎస్‌ పార్టీ నాయకులతో కలిసి వెళ్లి నామినేషన్‌ దాఖలు చేశారు.

ఇష్టదైవాల ఆశీస్సులతో ‘జానా‘ నామినేషన్‌


త్రిపురారం: నాగార్జున సాగర్‌ నియోజకవర్గ కాంగ్రెస్ట్‌ ఎమ్మెల్యే అభ్యర్థి కుందూరు జానారెడ్డి సాగర్‌లోని సత్యనారాయణస్వామి, అల్వాల ఎక్స్‌ రోడ్డులో ఉన్న ఆంజనేయ స్వామి ఆలయాలను సందర్శించుకొని ఇష్ట దైవాల ఆశీస్సులతో నామినేషన్‌ దాఖలు చేసి వరుస విజయాలు సాధిస్తూ వస్తున్నారు. అదే సెంటిమెంట్‌తో గత 2014 ఎన్నికల్లో ముందు కూడా ఆయా దేవాలయాలను సందర్శించి జానారెడ్డి, నామి నేషన్‌ పత్రానికి పూజలు నిర్వహించి నామినేషన్‌ వేసే వారు. జానారెడ్డికి 9 లక్కి నెంబర్‌. గత ఎన్నికల్లో కూడా జానారెడ్డి 9వ తేదీన నామినేషన్‌ వేశారు. ప్రస్తుతం ఆయన కార్లకు కూడా 9తో కూడా నాలుగు నెంబర్లు ఉంటాయి. 2018 ఎన్నికల్లో ఆయన ఈనెల 19వ తేదీన నామినేషన్‌ వేయనున్నట్లు విశ్వనీయ సమాచారం. 

వేంకటేశ్వరుడికి మొక్కుకుని..


సూర్యాపేట :  రాష్ట్ర  మంత్రి జగదీశ్‌రెడ్డి చౌటుప్పల్‌ శివారులోని శ్రీ ఆందోళ్‌మైసమ్మ తల్లి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. అదే విధంగా సూర్యాపేట పట్టణంలోని   శ్రీ వేంకటేశ్వరస్వామి దేవస్థానంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరమే రాష్ట్ర మంత్రి జగదీశ్‌రెడ్డి తన ఎన్నికల ప్రచారాన్ని చేపడుతున్నారు. అయితే 2014 ఎన్నికల్లో కూడా జగదీశ్‌రెడ్డి ముందుగా నామినేషన్‌ వేసేందుకు వెళ్లే సమయంలోనే  దేవస్థానంలో సతీసమేతంగా కలిసి ప్రత్యేక పూజలు చేశారు.  పూజలు చేసిన అనంతరరం సూర్యాపేట ఆర్డీఓ కార్యాలయానికి చేరుకొని నామినేషన్‌ వేశారు.  

వేంకటేశ్వర స్వామి  దేవాలయంలో పూజలు చేసి..


నామినేషన్‌ పత్రాలు అందజేస్తున్న కోమటిరెడ్డి(ఫైల్‌) 
నల్లగొండ : కాంగ్రెస్‌ నల్లగొండ అసెంబ్లీ అభ్యర్థి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తన ఇష్ట దైవమైన పట్టణంలోని హైదరాబాద్‌ రోడ్డులోని వెంకటేశ్వర కాలనీలోగల శ్రీదేవి, భూదేవి సహిత వేంకటేశ్వర దేవాలయంలో ప్రత్యేక పూజలు చేసి నామినేషన్‌ వేయనున్నారు. 2014 ఎన్నికల్లో కూడా కోమటిరెడ్డి అదే దేవాలయంలో బీఫాంతో ప్రత్యేక పూజలు నిర్వహించి అనంతరం ర్యాలీగా వచ్చి నామినేషన్‌ పత్రాలను సమర్పించారు. ఈసారి కూడా ఆ దేవాలయంలోనే పూజలు చేయనున్నారు. ఈ నెల 19వ నామినేషన్ల చివరి తేదీన నామినేషన్లు సమర్పించే అవకాశం ఉంది.

నకిరేకల్‌ :  మాజీ ఎమ్మెల్యే, టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే అభ్యర్థి వేముల వీరేశం ఏ మంచి పని తలపెట్టినా తొలుత కనకదుర్గ దేవాలయంలో తన సతీమణి పుష్పతో కలిసి పూజలు చేయడం ఆనవాయితీ. ప్రస్తుతం నకిరేకల్‌ టీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా ఆగస్టులోనే  వేముల వీరేషంను ప్రకటించారు.దీంతో శ్రావణ మాసం ముగుస్తున్న నేపథ్యంలో మంచి  శుభముహర్తాలు తర్వాత లేకపోవడంతో  నకిరేకల్‌లోనే  తన నివాసానికి దగ్గరలో ఉన్న శ్రీకనకదుర్గదేవాలయంలో తన శ్రీమతి పుష్పతో కలిసి పూజలు చేసి.   ఎన్నికల ప్రచారం  ప్రారంభించారు. గత 2014 ఎన్నికల మందు కూడ ఇక్కడి పూజలు చేసి ప్రారంభించారు.   

అంజన్నకు మొక్కుకొని.. 


ఆంజనేయస్వామి దేవాలయంలో పూజలు చేస్తున్న మాజీ మంత్రి ఆర్డీఆర్‌.
మాజీ మంత్రి, కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి రాంరెడ్డి దామోదర్‌రెడ్డి 2014 ఎన్నికల్లో కూడా ముందుగా పట్టణంలోని ఆంజనేయస్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ఈ సారి కూడా అభ్యర్థిగా ప్రకటించగానే దేవాలయంలో మంగళవారం పూజలు చేశారు. అనంతరం నామినేషన్‌ వేయనున్నారు. 

 
అర్వపల్లి : పూజలు చేస్తున్న టీఆర్‌ఎస్‌ అభ్యర్థి గాదరి కిశోర్‌కుమార్‌(ఫైల్‌) 
అర్వపల్లి : సాధారణ ఎన్నికలకు ఈప్రాంత అసెంబ్లీ అభ్యర్థులు ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన అర్వపల్లిలోని శ్రీయోగానంద లక్ష్మినర్సింహస్వామి దేవాలయంలో పూజలు చేశాకే నామినేషన్లు వేస్తుంటారు. రాష్ట్ర విద్యుత్‌శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి గత ఎన్నికల్లోనూ ఇక్కడి దేవాలయంలో నామినేషన్‌ పత్రాలను తెచ్చి స్వామి పాదాల వద్ద ఉంచి పూజలు చేశాక వెళ్లి సూర్యాపేటలో నామినేషన్‌ వేశారు. అలాగే బీ–పారంనకు మంత్రి సతీమణి సునీత కూడా గత ఎన్నికల సందర్భంగా ఆమె ప్రత్యేకంగా వచ్చి పూజలు చేయించి వెళ్లారు. ఆ ఎన్నికల్లో మాజీ ఎమ్మెల్యే గాదరి కిశోర్‌కుమార్‌ కూడా ఇక్కడ పూజలు చేశాకే నేరుగా వెళ్లి నామినేషన్‌ వేశారు. అలాగే తమ ఇలవేల్పు దేవుడైన నర్సింహస్వామి దేవాలయంలో పూజలు చేశాకే మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్‌రెడ్డి నామినేషన్‌ వేయనున్నారు. ఇప్పటి వరకు ఆయన ప్రతి ఎన్నికల్లో నామినేషన్‌ పత్రాలతో ఇక్కడి ఆలయానికి వచ్చి పూజలు చేసి నామినేషన్‌ వేస్తారు. ఈసారి కూడా వీరంతా అలాగే నామినేషన్‌ వేయాలని నిర్ణయించారు. మిగిలిన పార్టీల అభ్యర్థులు కూడా ఇక్కడి స్వామికి పూజలు చేశాకే నామినేషన్లు వేయనున్నారు.

యాదగిరీశుడిని దర్శించుకుని..


ఆలేరు : ఆలేరు టీఆర్‌ఎస్‌ అభ్యర్థి గొంగిడి సునీత 2014 సార్వత్రిక ఎన్నికల్లో నామినేషన్‌ పత్రాలకు గుట్టలోని శ్రీలక్ష్మీనర్సింహస్వామి ఆలయంలో పూజలు నిర్వహించి నామినేషన్‌ వేశారు. అలాగే ఈనెల 14న బుధవారం నామినేషన్‌ పత్రాలకు  ఇదే ఆలయంలో పూజలు జరిపి నామినేషన్‌ వేయనున్నట్లు అమె తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ స్వామి వారి ఆశీస్సులతోనే వంగపల్లి సర్పంచ్‌గా, గుట్ట ఎంపీపీగా, ఆలేరు ఎమ్మెల్యేగా గెలిచానని పేర్కొన్నారు.

చర్చిలో కంచర్ల ప్రత్యేక ప్రార్థన


నల్లగొండ : టీఆర్‌ఎస్‌ అభ్యర్థి కంచర్ల భూపాల్‌రెడ్డి బుధవారం ఒక సెట్‌ నామినేషన్‌ను మొదటి విడత సమర్పించనున్నారు. అయితే కేసీఆర్‌ అభ్యర్థులతో సమావేశం నిర్వహించి ఇప్పటికే బీఫాంలను అభ్యర్థులకు అందించారు. దాంతో కంచర్ల భూపాల్‌ రెడ్డి సావర్కర్‌నగర్‌లోని న్యూఅపోస్తులిక్‌ చర్చిలో రెవరెండ్‌ మాచర్ల జగ్జీవన్‌ ఆధ్వర్యంలో ప్రత్యేక ప్రార్థనలు చేశారు. సీఎస్‌ఐ సెయింట్‌పాల్‌ చర్చి ఫాదర్‌ రెవరెండ్‌ ఎం. కనకరత్నం, బ్రదర్‌ బి.సుందర్, విశ్వరాణి, శ్రీధర్, కొంక శ్యాంసన్‌ తదితరులు ప్రత్యేక ప్రార్థనలు చేయించుకొని వారి నుంచి భూపాల్‌రెడ్డి ఆశీర్వాదం పొందారు.   

రామలింగేశ్వరుడిని, దుర్గమ్మను దర్శించుకుని.. 

కనకదుర్గ దేవాలయంలో పూజలు చేస్తున్న చిరుమర్తి లింగయ్య (ఫైల్‌) 

నకిరేకల్‌లో.. మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య తన ఎన్నికల ప్రచారం, నామినేషన్‌ వేసే ముందు నార్కట్‌పల్లి మండలం చెరువుగట్టులోని శ్రీపార్వతీ జడల రామలింగేశ్వరస్వామి దేవాలయం, నకిరేకల్‌లోని శ్రీకనకదర్గుదేవాయలంలో పూజలు చేస్తారు. 2009లో,2014లో జరిగిన ఎన్నికల్లో కూడా తొలుత చెరువుగట్టులో పూజలు చేసి ఆ తర్వాత నకిరేకల్‌లోని శ్రీకనకదర్గుదేవాయలంలో పూజలు చేసి నామినేషన్‌ వేశారు. త్వరలో నామినేషన్‌ వేసే ముందు కూడా అదే ఆనవాయితీని కొనసాగిస్తానని చిరుమర్తి లింగయ్య తెలిపారు.  

శ్రీలింగబసవేశ్వరస్వామిని వేడుకుని.. 


పడమటి సోమారం గ్రామంలోని శ్రీలింగబసవేశ్వర స్వామి ఆలయం(పునః నిర్మాణం కంటే ముందు)   

భువనగిరి : టీఆర్‌ఎస్‌ అభ్యర్థి, మాజీ ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డి ఎన్నికల సమయంలో నామినేషన్‌ వేసే ముందు శ్రీలింగబసవేశ్వర స్వామి ఆలయంలో పూజలు నిర్వహించడం ఆనవాయితీ. 2014లో జరిగిన ఎన్నికల్లో ఇదే ఆలయంలో నామినేషన్‌ వేసే ముందు నామినేషన్‌ ప్రతాలకు ఆలయంలో పూజలు నిర్వహించారు. అనంతరం జరిగిన ఎన్నికల్లో గెలుపొందిన ఆయన తిరిగి అదే ఆలయంలో పూజలు నిర్వహించారు. బీబీనగర్‌ మండలంలోని పడమటి సోమారం గ్రామంలో ఎన్నో సంవత్సరాల చరిత్ర కలిగిన శ్రీలింగబసవేశ్వర స్వామి ఆలయంలో శివుడిని  గిరిజనులు ఆరాధ్య దైవంగా కొలుస్తారు. ఆలయంలో పూజలు నిర్వహించి కోరిన కోరికలు నెరవేరతాయనేది ఓ నమ్మకం. నాటి నుంచి నేటి వరకు ఆలయంలో మొక్కులు తీరడం కోసం భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహిస్తుంటారు. దీంతో టీఆర్‌ఎస్‌ అభ్యర్థి పైళ్ళ శేఖర్‌రెడ్డి డిసెంబర్‌ 7న జరిగే ఎన్నికల సందర్భంగా నామినేషన్‌వేసే ముందు ఇదే ఆలయంలో పూజలు నిర్వహించడానికి సిద్ధమౌతున్నారు. 1985 నుంచి 1999 వరకు నాలుగు సార్లు భువనగిరి నియోజకవర్గం నుంచి పోటీ చేసి గెలుపొందిన దివంగత మాజీ మంత్రి ఎలిమినేటి మాధవరెడ్డి ఇక్కడే పూజలు నిర్వహించే వారు. తదనంతరం ఆయన సతీమణి ఉమామాధవరెడ్డి 2000 నుంచి 2009 వరకు జరిగిన ఎన్నికల్లో నామినేషన్‌వేసే ముందు ఇక్కడే పూజలు నిర్వహించడం ఆనవాయితీగా వచ్చింది. ప్రస్తుతం ఇదే ఆలయంలో నామినేషన్‌వేసే ముందు పూజలు నిర్వహించడం సెంటిమెంట్‌గా పెట్టుకున్నారు.  

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top