నిజామాబాద్‌లో.. వేడెక్కిన రాజకీయం

Political Heat Increase In Nizamabad - Sakshi

అధికార పార్టీలోకి  భారీగా వలసలు

ప్రచారంలోనూ  దూసుకెళ్తున్న టీఆర్‌ఎస్‌

బీజేపీ, కాంగ్రెస్‌లో కనిపించని జోష్‌

మోపాల్‌(నిజామాబాద్‌రూరల్‌): పార్లమెంట్‌ ఎన్నికల వేల గ్రామాల్లో రాజకీయం వేడెక్కింది. ఇప్పటికే అధికార పార్టీ ప్రచారంలో దూసుకెళ్తుండగా, ఆ స్థాయి జోష్‌ ప్రతిపక్ష పార్టీల్లో కనిపించడం లేదు. ఎన్నికలు సమీపిస్తుండడంతో టీఆర్‌ఎస్‌లోకి వలసలు జోరందుకున్నాయి. గ్రామ స్థాయి నుంచి నియోజకవర్గ స్థాయి నాయకుల వరకూ గులాబీ గూటికి చేరిపోతున్నారు. కాంగ్రెస్, బీజేపీ తేడా లేకుండా నాయకులంతా అధికార పార్టీలోకి చేరుతుండడంతో అనేక గ్రామాల్లో ఆ రెండు పార్టీలకు నాయకత్వం కొరత ఏర్పడుతోంది. నిజామాబాద్‌ పార్లమెంట్‌ స్థానాన్ని అన్ని పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. ఈ స్థానానికి 185 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. ఏడుగురు అభ్యర్థులు ఆయా రాజకీయ పార్టీలకు చెందిన వారు కాగా, మిగతా వారంతా రైతులు స్వతంత్రులుగా బరిలో నిలిచారు. బరిలో నిలిచిన రైతులంతా ఆర్మూర్, బాల్కొండ, కొరుట్ల, జగిత్యాలకు చెందిన వారే అధికంగా ఉన్నారు.

టీఆర్‌ఎస్‌లోకి వలసల జోరు
నిజామాబాద్‌ రూరల్‌ నియోజకవర్గంలో టీఆర్‌ఎస్‌లోకి వలసల జోరు కొనసాగుతోంది. ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ, కాంగ్రెస్‌ కోసం పనిచేసిన నాయకులంతా గులాబీ కండువాను కప్పుకుంటున్నారు. ఏకంగా బీజేపీ రూరల్‌ నియోజకవర్గ ఇన్‌చార్జి గడ్డం ఆనంద్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ, కాంగ్రెస్‌నాయకులు అరికెల నర్సారెడ్డి, టీడీపీ జిల్లా అధ్యక్షుడు బాగారెడ్డి, టీడీపీ ఎస్టీ సెల్‌రాష్ట్ర కార్యదర్శి తారాచంద్‌ నాయక్, పీసీసీ మాజీ కార్యదర్శి, మాజీ ఎంపీపీ సందగిరి భూమారెడ్డి, మాజీ సర్పంచ్‌ చిలుకసాయిలు తమ అనుచరులతోపాటు ఆయా పార్టీల మండల అధ్యక్షులు, మాజీ జెడ్పీటీసీలు సభ్యులు, మాజీ ఎంపీపీలు, వివిధ పార్టీల మద్దతుతో గెలుపొందిన సర్పంచులందరూ టీఆర్‌ఎస్‌లో చేరుతున్నారు. నిజామాబాద్‌ పార్లమెంట్‌ స్థానాన్ని టీఆర్‌ఎస్‌ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. పార్టీలో చేరుతున్న అభ్యర్థులతో నిజామాబాద్‌ రూరల్‌ ఎమ్మెల్యే నివాసం సందడిగా మారింది.

గులాబీ గూటికి సర్పంచ్‌లు
నిజామాబాద్‌ రూరల్, మోపాల్‌ మండలాల్లో మొత్తం 40 గ్రామపంచాయతీలు ఉన్నాయి. ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికల్లో దాదాపు 10 నుంచి 12 మంది సర్పంచులు స్వతంత్రులు, కాంగ్రెస్, టీడీపీకి చెందిన వారు గెలుపొందారు. కానీ రోజురోజుకూ మారుతున్న సమీకరణాల్లో ఒక్కొక్కరుగా టీఆర్‌ఎస్‌ గూటికి చేరుతున్నారు. ఇప్పటికే నిజామాబాద్‌ రూరల్‌ మండలంలోని 19 మంది సర్పంచులు టీఆర్‌ఎస్‌లో చేరిపోగా, మోపాల్‌ మండలంలో ఒకరు మినహా అందరూ టీఆర్‌ఎస్‌లో చేరారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top