గల్లీ గస్తీ ముమ్మరానికి పోలీస్‌శాఖ కసరత్తు

Police Patrolling With High Security In Telangana Villages - Sakshi

గల్లీ గస్తీ ముమ్మరానికి పోలీస్‌శాఖ కసరత్తు 

అన్ని స్టేషన్లకు నూతన పెట్రోలింగ్, కమాండ్‌ సెంటర్‌ వ్యవస్థ 

త్వరలోనే ప్రతి పీఎస్‌కూ ఒక కారు, మూడు బ్లూకోల్ట్స్‌ వాహనాలు 

జిల్లాల్లోని అర్బన్‌ పీఎస్‌ల ఆప్‌గ్రెడేషన్‌కు ప్రతిపాదన 

నార్త్, వెస్ట్‌ జోన్లలో 42 స్టేషన్లకు సీఐ ర్యాంకు ఎస్‌హెచ్‌ఓలు

సాక్షి, హైదరాబాద్‌ : రాష్ట్రవ్యాప్తంగా అన్ని పోలీస్‌స్టేషన్లలో గల్లీ గస్తీ ముమ్మరం చేయాలని పోలీస్‌ ఉన్నతాధికారులు నిర్ణయించారు. హైదరాబాద్‌ కమిషనరేట్‌తో పాటు సైబరాబాద్, రాచకొండలో విజిబుల్‌ పోలీసింగ్‌ కింద అత్యాధునిక పెట్రోలింగ్‌ వాహనాలు, బ్లూకోల్ట్స్‌ బైకులను ప్రవేశపెట్టారు. వీటితో పోలీస్‌ రెస్పాన్స్‌ టైమ్‌ గంటల నుంచి నిమిషాల్లోకి చేరింది. హైదరాబాద్‌ కమిషనరేట్‌ పరిధిలో కేవలం 3 నుంచి 5 నిమిషాల్లోనే ఘటనాస్థలికి చేరుతున్నారు. మిగతా కమిషనరేట్లలోనూ ఇది దాదాపు 10 నిమిషాల్లోపే ఉందని డయల్‌ 100 ఇప్పటికే నివేదిక అందించింది. ఇదే రీతిలో రాష్ట్రంలోని అన్ని మారుమూల పోలీస్‌స్టేషన్లతో పాటు అర్బన్‌ ప్రాంతాల్లోని పోలీస్‌స్టేషన్లలో విజిబుల్‌ పోలీసింగ్‌ను విస్తృతం చేయాలని నిర్ణయించారు. దీనికోసం మరో నెల రోజుల్లో కొనుగోలు చేయబోయే పెట్రోలింగ్‌ వాహనాలు, బ్లూకోల్ట్స్‌ బైకులను మండలాలు, అర్బన్‌ పోలీస్‌స్టేషన్లకు అందించాలని ఉన్నతాధికారులు భావిస్తున్నారు. మండలంలోని పోలీస్‌స్టేషన్‌కు ఒక పెట్రోలింగ్‌ కారు, రెండు లేదా మూడు బ్లూకోల్ట్స్‌ బైకులు అందించాలని ప్రతిపాదన సిద్ధం చేశారు. దీంతో మండల పరిధిలో నిమిషాల్లోనే గ్రామాలు, ఘటనాస్థలాలకు పోలీసులు చేరిపోనున్నారు. సంబంధిత గస్తీ వాహనాలకు జీపీఎస్‌ వ్యవస్థను అనుసంధానించి ప్రతీ పోలీస్‌స్టేషన్, సబ్‌డివిజినల్‌ వారీగా పర్యవేక్షించనున్నారు. 
గ్రామానికి 10 వరకు సీసీ కెమెరాలు! 
హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండలో సీసీటీవీల ఏర్పాటు భారీస్థాయిలో జరుగుతోంది. కమ్యూనిటీ సీసీటీవీలు, నేను సైతం సీసీటీవీలు.. ఇలా రెండు పద్ధతుల్లో సీసీ కెమెరాలను పోలీసు శాఖ ఏర్పాటు చేస్తోంది. ఇప్పుడివే ప్రాజెక్టుల ద్వారా ప్రతీ గ్రామంలో కనీసం 5 నుంచి 10 కెమెరాలు ఏర్పాటు చేసేలా కార్యాచరణ రూపొందించింది. పోలీస్‌శాఖ తరఫున కొన్ని.. పలు వ్యాపార సంస్థలు, తదితరాల నుంచి మరికొన్ని ఏర్పాటు చేయించబోతున్నారు. దీనిపై పోలీస్‌శాఖ ప్రజలకు అవగాహన కల్పించనుంది. ఈ కెమెరాలను సంబంధిత మండల, అర్బన్‌ పోలీస్‌స్టేషన్లలో ఏర్పాటు కాబోయే కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌కు అనుసంధానించనున్నారు. ఈ కమాండ్‌ సెంటర్‌ ద్వారా గ్రామాల్లో ప్రశాంత వాతావరణం ఉండేలా మానిటరింగ్‌ చేయనున్నారు. సర్కిల్‌ ఇన్‌స్పెక్టర్, డీఎస్పీ, ఎస్పీ కార్యాలయాల్లోని కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్లకు మొదటి దఫాలో.. హైదరాబాద్‌లో పూర్తిగా అందుబాటులోకి వచ్చే కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌కు రెండో దఫాలో ఈ కెమెరాలు అనుసంధానించనున్నారు.
ఠాణాలకు గ్రేడ్‌లు.. 
నూతన జిల్లాల ఏర్పాటు తర్వాత అర్బన్‌ ప్రాం తాల విస్తృతి పెరుగుతూ వస్తోంది. దీంతో పోలీస్‌ సేవలను సైతం విస్తృతం చేసేందుకు రాష్ట్ర పోలీస్‌ ఉన్నతాధికారులు నిర్ణయించారు. అర్బన్‌ ప్రాంతాల్లోని సబ్‌ ఇన్‌స్పెక్టర్‌ ఎస్‌హెచ్‌ఓ (స్టేషన్‌ హౌజ్‌ ఆఫీసర్‌) పోలీస్‌స్టేషన్లను ఇన్‌స్పెక్టర్‌ ర్యాంక్‌ ఎస్‌హెచ్‌ఓగా అప్‌గ్రేడ్‌ చేయాలని నిర్ణయించారు. ఇందులో కమిషనరేట్‌ పరిధిలో ఉన్న ఠాణాలను ‘ఏ’గ్రేడ్‌ పోలీస్‌స్టేషన్లుగా, జిల్లా యూనిట్‌గా ఎస్పీ పరిధిలోని వాటిని ‘బీ’గ్రేడ్‌ ఠాణాలుగా అప్‌గ్రేడ్‌ చేయాలని ప్రతిపాదించినట్టు తెలిసింది. దీని ప్రకారం ఏ గ్రేడ్‌ పోలీస్‌స్టేషన్లకు రూ.75 వేలు, బీ గ్రేడ్‌ ఠాణాలకు రూ.50 వేలు ప్రతీ నెల నిర్వహణ కోసం చెల్లించనున్నారు. అలాగే నూతన భవనాలు, ఆధునీకరణ సైతం చేయాలని నిర్ణయించారు. అప్‌గ్రేడ్‌కు సంబంధించి వరంగల్‌ జోన్, హైదరాబాద్‌ జోన్లలోని 42 పోలీస్‌స్టేషన్లను ఇన్‌స్పెక్టర్‌ ర్యాంక్‌ ఎస్‌హెచ్‌గా ఆధునీకరించాలని పోలీస్‌ శాఖ ప్రతిపాదించినట్టు సమాచారం.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top