రోడ్డెక్కితే వేటే..!

Police Challans to Vehicles on Roads Hyderabad - Sakshi

కూకట్‌పల్లి జోన్‌ బృందం : కరోనా వైరస్‌ నియంత్రణలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా లాక్‌డౌన్‌ ప్రకటించినా ప్రజలు రోడ్లపైకి వస్తున్నారు.  సోమవారం మధ్యాహ్నం నుంచి పోలీస్‌ అధికారులు కఠిన నిర్ణయాలు తీసుకుంటామని హెచ్చరించినా వారిని సూచనలు విస్మరిస్తున్నారు. దీంతో పోలీసులు రోడ్లపై బారికేట్లు ఏర్పాటు చేసి ఎక్కడి వాహనాలు అక్కడే ఆపి ఇళ్లకు పంపిస్తున్నారు. రాకపోకలు సాగించేటప్పుడు అత్యవసర కారణాలు లేకుంటే తిరిగి పంపించి మళ్లీ వస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరిస్తున్నారు. 

కరోనా వైరస్‌తో పలు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు హెచ్చరిస్తున్నా పలువురు పట్టించుకోవడం లేదు. కొన్ని ప్రాంతాల్లో అధికారులు చర్యలు తీసుకుంటున్నా, కొన్ని ప్రాంతాల్లో విస్మరించడంతో దుకాణాదారులు ఇష్టారాజ్యంగా సరుకులను అమ్ముతున్నారని వాపోతున్నారు. మూసాపేటలో ఎస్సై భానుప్రసాద్, ఏఎస్సై మన్యంలు సిబ్బందితో కలిసి పలు దుకాణాలు మూసివేయించారు. స్థానికులు రోడ్లపై ఉండటంతో ఫొటోలు తీస్తూ ఇంట్లోకి వెళ్లాలని హెచ్చరిస్తున్నారు.  

ఆటోలు సీజ్‌..
భాగ్యనగర్‌కాలనీ: కరోనా కట్టడికి చేస్తున్న ఆదేశాలను ఉల్లంఘిస్తున్న ఆటోలను సీజ్‌ చేశారు.  సోమవారం కూకట్‌పల్లి పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని సీఐ లక్ష్మీ నారాయణ రెడ్డి ఆధ్వర్యంలో 30 ఆటోలను సీజ్‌ చేసి ముగ్గురిపై  కేసు నమోదు చేశారు.  ప్రభుత్వ ఆదేశాలు పట్టించుకోకుండా రోడ్లపైకి వచ్చే వాహనాలపై చర్యలు తీసుకుంటామని సీఐ తెలిపారు.

స్వీయ నియంత్రణే మార్గం
మోతీనగర్‌: ప్రధానమంత్రి మోదీ, ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆదివారం ప్రకటించిన జనతా కర్ఫ్యూకు విశేష స్పందన లభించింది.  సోమవారం నుంచి వారం రోజుల పాటు ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఇచ్చిన పిలుపునకు ప్రజలు పాక్షికంగా స్పందించారు.  జనతా కర్ఫ్యూ తరువాత నిత్యావసర సరుకులు, పాలు వంటి వస్తువులను ఎక్కువగా కొనుగోలు చేశారు.  దీన్ని ఆసరాగా తీసుకొని పలువురు ధరలు పెంచి దండుకున్నారు. అయినా తప్పని స్థితిలో కొనుగోలు చేయాల్సి వస్తుందని వాపోతున్నారు. పెట్రోల్‌ బంకుల వద్ద ఉదయం నుంచే బారులు తీరారు. కొంతమంది స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు కరపత్రాలు, ఫ్లెక్సీ ద్వారా అవగాహన కల్పిస్తూ మాస్కులు పంపిణీ చేశారు. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top