ఎన్డీ రాష్ట్ర కమిటీ సభ్యుడు గోపన్న అరెస్ట్‌

Police Arreted ND Leader Gopi In Khammam - Sakshi

సాక్షి, ఖమ్మం (కొత్తగూడెం) : వ్యాపారులు, స్థానికంగా పని చేస్తున్న కాంట్రాక్టర్లను చందాల నిమిత్తం తుపాకులతో బెదిరిస్తూ భయభ్రాంతులకు గురి చేస్తున్న సీపీఐ (ఎంఎల్‌) న్యూడెమోక్రసీ రాష్ట్ర కమిటీ సభ్యుడు దనసరి సమ్మయ్య అలియాస్‌ గోపన్నను అరెస్టు చేసినట్లు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ సునీల్‌దత్‌ వెల్లడించారు. మంగళవారం స్థానిక ఎస్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎస్పీ వివరాలను వెల్లడించారు. కొద్ది రోజుల క్రితం పోలీసులపై కాల్పులు జరిపి పారి పోయిన అజ్ఞాత సాయుధ దళ సభ్యుల కొరకు వెతుకుతుండగా కొత్తగూడ మండలం మహబూబాబాద్‌ జిల్లాకు చెందిన గోపన్న గుండాలలోని రాయగూడెం అటవీ ప్రాంతంలో, కేసు పరిశోధన అధికారి, మహబూబాబాద్‌ డీఎస్పీ, గుండాల సీఐ సిబ్బందితో కలిసి గోపన్నను అరెస్టు చేసి, ఆయన వద్ద ఉన్న 303 బోల్ట్‌ యాక్షన్‌ తుపాకీ, తూటాలు స్వాధీన పరుచుకున్నట్లు వివరించారు. గోపన్నపై మహబూబాబాద్, భద్రాద్రి కొత్తగూ డెం జిల్లాలోని వివిధ పోలీసు స్టేషన్లలో 13 కేసులు నమోదు అయినట్లు తెలిపారు. గోపి అమాయక గిరిజనులను, ప్రజలను రెచ్చగొడుతూ పోడుభూముల పేరుతో అడవులను నరికిస్తున్నాడు.

న్యూడెమోక్రసీ పార్టీకి ఓపెన్‌ క్యాడర్‌ ఉన్నప్పటికీ వారి మాట వినని ప్రజలను, నాయకులను, ప్రభుత్వ అధికారులను అజ్ఞాత సాయుధ దళాలచే బెదిరిస్తూ వారిపై భౌతికదాడులకు పాల్పడుతున్నారని వివరించారు. అజ్ఞాత సాయుధ దళాల కార్యకలపాలు పెచ్చుమీరిపోయి సాధారణ ప్రజానీకానికి అభివృద్ధి కార్యకలాపాలకు అడ్డంకిగా మారారు. వీరిని అదుపు చేసే క్రమంలో గతంలో చాలాసార్లు అజ్ఞాత సాయుధ దళాలు పోలీసుల మీద కాల్పులకు దిగగా వివిధ పోలీసు స్టేషన్లలో కేసులు కూడా నమోదయ్యాయి. అయినప్పటికీ వారి పద్ధతి మార్చుకోకుండా అజ్ఞాత సాయుధ దళాల నాయకుడు లింగన్న ఆధ్వర్యంలో చట్ట వ్యతిరేక కార్యకలాపాలు నిర్వహిస్తున్నాడు. చందాల కోసం ఇటీవల తునికాకు కాంట్రాక్టర్లను బెదిరించి వసూళ్లకు పాల్పడిన న్యూడెమోక్రసీ పార్టీ ఇల్లెందు టౌన్‌ కార్యదర్శి తుపాకుల నాగేశ్వరరావును పట్టుకొని ఇల్లెందు పోలీసు స్టేషన్‌లో కేసు నమోదు చేసి రూ.6 లక్షలు స్వాధీన పరుచుకున్నట్లు వివరించారు.

గతంలో వారిపై అనేక కేసు లు నమోదు అయినప్పటికీ వారి పద్ధతి మా ర్చుకోకుండా అజ్ఞాత సాయుధ దళం కొద్ది రోజుల క్రితం గుండాల మండలం రోళ్లగడ్డ అటవీ ప్రాం తంలో మకాం వేసి చందాల కొరకు కాంట్రాక్టర్లు, వ్యాపారస్తులను, పోడు భూముల పేరుతో అమాయక ప్రజలను రెచ్చగొడుతూ చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారనే సమాచారం మేరకు పోలీసులు జూలై 31న గాలింపు చర్యలు చేపట్టి అజ్ఞాత సాయుధ దళాన్ని అదుపులోకి తీసుకొనే క్రమంలో లింగన్న సాయుధ దళం పోలీసులపై కాల్పులు జరుపగా, ఇరువైపులా జరిగిన కాల్పుల్లో దళ నాయకుడైన లింగన్న మరణించాడని, ఇతర దళ సభ్యులు తుపాకులతో తప్పించుకున్నారని వివరించారు. పారిపోయిన అజ్ఞాత సాయుధ దళ సభ్యుల కొరకు వెతుకుతుండగా గోపన్న దొరకడంతో అరెస్టు చేశామని, అతడిని కోర్టులో హాజరు పరుస్తున్నట్లు వివరించారు. ఈ సమావేశంలో ఓఎస్డీ ఉదయ్‌కుమార్‌రెడ్డి, మహబూబాబాద్‌ డీఎస్పీ నరేష్‌కుమార్, సీఐ శ్రీనివాస్, ఎస్సై సురేష్, శ్రావణ్‌కుమార్‌ పాల్గొన్నారు. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top