కేసీఆర్‌ను కలసిన ‘పైలట్‌’ సంజన

కేసీఆర్‌ను కలసిన ‘పైలట్‌’ సంజన

ముఖ్యమంత్రి సహాయనిధితో అమెరికాలో పైలట్‌ శిక్షణ

- తెలంగాణ భవన్‌లో సీఎంను కలసి కృతజ్ఞతలు

 

కౌడిపల్లి(నర్సాపూర్‌): తెలంగాణ ఉద్యమంలో పాలుపంచుకున్న ఆ విద్యార్థినికి ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు సహాయం చేయడంతో అమెరికాలో పైలట్‌ శిక్షణ పూర్తి చేసింది. ఇండియన్‌ పైలట్‌ లైసెన్స్‌ కన్వర్షన్‌ చేసుకునేందుకు ఢిల్లీలో శిక్షణ కోసం వెళ్లే క్రమంలో ఆదివారం సీఎంను కలసి కృతజ్ఞతలు తెలిపింది. మెదక్‌ జిల్లా కౌడిపల్లి గ్రామానికి చెందిన ఉపాధ్యాయుడు ఓంప్రకాశ్‌. ఆయన భార్య అనితా ఓంప్రకాశ్‌ టీఆర్‌ఎస్‌ నాయకురాలు. వీరి చిన్నకూతురు సంజన చిన్నతనంలోనే తెలంగాణ ఉద్యమంలో పాలుపంచుకుంది. 2001లో కేసీఆర్‌ టీఆర్‌ఎస్‌ స్థాపించినçప్పుడు.. పార్టీ ప్రచారంలో సైతం తిరిగి ఆకట్టుకుంది.రెండేళ్ల క్రితం ఇంటర్‌ పూర్తయ్యాక పైలట్‌ కావాలన్న ఆకాంక్షను సీఎం కేసీఆర్‌ దృష్టికి తీసుకువెళ్లింది. దీంతో సీఎం కేసీఆర్‌ సంజన కోరిక మేరకు ముఖ్యమంత్రి సహాయనిధి నుంచి రెండు విడతలుగా రూ.30 లక్షలు ఆర్థిక సహాయం చేయడంతో ఆమె అమెరికాలో పైలట్‌ శిక్షణను విజయవంతంగా పూర్తిచేసింది. శిక్షణ పూర్తయ్యాక ఇండియన్‌ పైలట్‌ లైసెన్స్‌ కన్వర్షన్‌ కోసం ఢిల్లీలో రెండు పరీక్షలకు హాజరు కావాల్సి ఉంటుంది. శిక్షణ నిమిత్తం తండ్రితో కలసి ఢిల్లీకి బయలుదేరింది. ఆదివారం తెలంగాణ భవన్‌లో సీఎం కేసీఆర్‌ను కలసి శిక్షణ కోసం ఆర్థిక సహాయం చేసినందుకు కృతజ్ఞతలు తెలిపింది. సీఎం కేసీఆర్‌ సైతం సంజనను ఆశీర్వదించి పంపించారు. ముఖ్యమంత్రికి సంజన తల్లిదండ్రులు ఓంప్రకాశ్, అనిత కూడా ధన్యవాదాలు తెలిపారు. 

సంబంధిత వీడియోలు

Back to Top