నడవాలంటే నరకమే..!

People Suffering With roads in Medchal - Sakshi

అభివృద్ధికి ఆమడదూరంలో మున్సిపాలిటీలు

అస్తవ్యస్తంగా అంతర్గత రోడ్లు, డ్రైనేజీలు

పట్టింపులేని పారిశుద్ధ్యం..తాగు నీరూ కరువే

పాలకవర్గం లేక అధికారుల ఇష్టారాజ్యం ప్రజల అవస్థలు

సాక్షి,మేడ్చల్‌జిల్లా:  జిల్లాలో కొత్తగా ఏర్పడిన నాలుగు మున్సిపల్‌ కార్పొరేషన్లు, తొమ్మిది మున్సిపాలిటీలు అభివృద్ధికి ఆమడదూరంలో ఉన్నాయి. మౌళిక సదుపాయాలు లేక ప్రజలు అవస్థలు పడుతున్నారు .గ్రామ పంచాయతీల నుంచి  పట్టణాలుగా అప్‌గ్రేడ్‌ అయినప్పటికీ ఎలాంటి అభివృద్ధి పథకాలు చేపట్టలేదు. అస్తవ్యçస్తమైనరోడ్లు, డ్రైనేజీలతో వర్షం వస్తే రహదారులు బురదమయంగా మారుతున్నాయి. డ్రైనేజీల పరిస్థితి మరింత అధ్వాన్నంగా ఉంది. ఇంకా కొన్ని మున్సిపాలిటీల్లో  మట్టి రోడ్లే దర్శనమిస్తున్నాయి.  దీంతో పట్టణ ప్రజలు నరక యాతన అనుభవిస్తున్నారు. కొత్తగా ఏర్పడిన కార్పొరేషన్లు, మున్సిపాలిటీలపై ఉన్నతాధికారుల పర్యవేక్షణ లేకపోవడం, పాలక వర్గాలు ఏర్పాటు కాకపోవడంతో స్థానిక అధికారులు ఆడిందే ఆట ..పాడిందే పాట అన్నట్లుగా మారింది .

కార్పొరేషన్లలోనూ అదే తీరు
మేజర్‌ గ్రామపంచాయతీల విలీనంతో  మున్సిపల్‌ కార్పొరేషన్లుగా   మారిన బోడుప్పల్, పీర్జాదిగూడ ప్రాంతాల్లోనూ çసమస్యలు యథాతథంగా ఉన్నాయి.   శివారు కార్పోరేషన్లకు  దాదాపు ఐదేళ్లకు  పైగా  పాలకవర్గం లేక పోవటంతో అధికారులు ఇష్టా రాజ్యంగా వ్యవహరిస్తున్నారు.  పీర్జాదిగూడ మున్సిపాలిటీ పరిధి లో మేడిపల్లి, పర్వాతాపూర్, పీర్జాదిగూడ ప్రాంతాలు ఉండగా, బోడుప్పల్‌ మున్సిపాలిటీ పరిధిలో చెంగిచర్ల, బోడుప్పల్‌  ప్రాంతాలు ఉన్నాయి. నిజాంపేట్, జవహర్‌నగర్‌ మున్సిపల్‌ కార్పొరేషన్ల పరిస్థితి కూడా ఇలాగే ఉంది.  దాదాపు ఐదు లక్షలపైగా  ప్రజలు నివాసం ఉంటున్న ఆయా మున్సిపల్‌ కార్పొరేషన్లలో ప్రజల నుంచి పన్నుల రూపేణా  ఏటా రూ.130 కోట్లు  వసూలు చేస్తున్న అధికారులు వసతులు కల్పించటంలో ఏమాత్రం శ్రద్ధ చూపడం లేదు. దీంతో వాటి పరిస్థితి గ్రామానికి ఎక్కువ, పట్టణానికి తక్కువ అన్న చందంగా మారింది. పారిశుద్ధ్యం, చెట్ల పొదలు, దోమల బెడదతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పీర్జాదిగూడ, బోడుప్పల్‌  పరిధిలో మూసీ కాలువ కారణంగా దోమల బెడద తీవ్రంగా ఉంది.

జవహర్‌నగర్‌కు ‘మిషన్‌ భగీరథ’ పథకం కింద ఇంటింటికి తాగునీరు సరఫరా చేస్తామని పాలకులు ఇచ్చిన హామీలు  ప్రతిపాదనలకే పరిమితమయ్యాయి. పలు కాలనీల్లో పైప్‌లైన్లు వేసినా ఇప్పటి వరకు చుక్కనీరు పంపిణీ చేయలేదు. యాప్రాల్‌ నుంచి దమ్మాయిగూడ, నాగారం వెళ్లే ప్రధాన రహదారిలో విద్యుత్‌ దీపాలు లేక నిత్యం అంధకారం అలుముకుంటోంది. జవహర్‌నగర్‌ ప్రధాన రహదారిని వెడల్పు చేసి సెంట్రల్‌ లైటింగ్‌ను ఏర్పాటు చేస్తామన్న ప్రజాప్రతినిధుల హామీ అమలుకు నోచుకోలేదు. బాలాజీనగర్, అంబేద్కర్‌నగర్‌ రోడ్డు ఇరుగ్గా ఉండడంతో తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి.

అధ్వానంగా మున్సిపాలిటీలు
మేడ్చల్‌ çమున్సిపాలిటీలో సీసీ రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థ లేకపోవడంతో రహదారులు చిత్తడిగా మారుతున్నాయి. వర్షపు నీరు ఇళ్ల మధ్యన ఖాళీ స్థలాల్లోకి చేరుతుండటంతో  మురికి కూపాలుగా మారుతున్నాయి.
గుండ్లపోచంపల్లి మున్సిపాలిటీలో  రోడ్లు అధ్వాన్నంగా ఉన్నాయి. పారిశుధ్య నిర్వహణ లేకపోవడంతో గతవారం 20 మంది భవన నిర్మాణ రంగకార్మికులు అస్వస్థతకు గురయ్యారు. తూంకుంట మున్సిపాలిటీలోనూ ఎటు చూసినా గుంతలే కనిపిస్తున్నాయి. ఘట్‌కేసర్‌ మున్సిపాలిటీలో  ఓఆర్‌ఆర్‌ జంక్షన్‌ వద్ద సర్వీస్‌ రోడ్డు, జాతీయ రహదారిపై ఘట్‌కేసర్‌ అండర్‌పాస్‌ నుంచి ఎన్‌ఎఫ్‌సీనగర్‌ రైల్వేవంతెన వరకు సర్వీస్‌ రోడ్డు నిర్మించాల్సిఉంది.  జాతీయ రాహదారిపై ఘట్‌కేసర్‌ బైపాస్‌ రోడ్డు చౌరస్తా నుంచి ఎన్‌ఎఫ్‌సీనగర్‌ వంతెన వరకు సెంట్రల్‌ లైటింగ్‌ లేకపోవటంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పోచారం మున్సిపాలిటీలోనూ ఇంకా మట్టి రోడ్లే దర్శనమిస్తున్నాయి. నారపల్లి, ఇస్మాయిల్‌ఖాన్‌గూడ, అన్నోజిగూడ, పోచారం తదితర ప్రాంతాల్లోని కొత్త  కాలనీల్లో సీసీ రోడ్ల నిర్మాణం చేపట్టలేదు. ïడ్రైనేజీ, వీధి దీపాలు, తాగునీటి వసతి లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నాగారం, దమ్మాయిగూడ మున్సిపాలిటీల్లో మంచినీటి సమస్య తీవ్రంగా ఉంది.  జవహర్‌నగర్‌  డంపింగ్‌యార్డు కారణ ంగా ప్రజలు నానాఇబ్బందులు పడుతున్నారు.  మున్సిపాలిటీ పరిధిలోని అహ్మద్‌గూడ, కుందన్‌పల్లి, రాంపల్లి గ్రామాల ప్రజలు తరచూ అస్వస్థతకు గురవుతున్నారు.

అన్నీ మట్టి రోడ్లే
పోచారం మున్సిపాలిటీ పరిధిలో చాలా వరకు మట్టి రోడ్లే ఉన్నాయి. నారపల్లి, ఇస్మాయిల్‌ఖాన్‌గూడ, అన్నోజిగూడ, పోచారంలో  కొత్త కాలనీల్లో సీసీ రోడ్లు నిర్మించాలి. వీటితో పాటు డ్రైనేజీ, వీధి దీపాలు, తాగునీటి వసతి కల్పించాలి.    – వెంకన్న, ఎల్‌ఐజీ, పోచారం

పారిశుధ్యంపై శ్రద్ధ చూపాలి
మేడ్చల్, గుండ్లపోచంపల్లి మున్సిపాలిటీల్లో  పారిశుధ్య నిర్వహణ, అంతర్గత రోడ్ల నిర్మాణంపై ప్రత్యేక దృష్టి పెట్టాలి. కాలనీల్లో మట్టి రోడ్ల కారణంగా వర్షం పడితే ఇళ్ళ నుండి ప్రజలు బయటకు రాలేకపోతున్నారు.      – మహిపాల్‌రెడ్డి

నడవలేక పోతున్నాం  
చిన్నపాటి వర్షానికే నడవలేని పరిస్ధితి నెలకొంది. కార్పొరేషన్‌గా అభివృద్ధి చేసినా ఇప్పటి వరకు ఒక్క రోడ్డు కూడా వేయలేదు.   – కొత్తకొండ  వేణు, జవహర్‌నగర్‌ 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top