డెంగీ బూచి..కాసులు దోచి!

People Suffering With Dengue Fever - Sakshi

సాధారణ జ్వరపీడితులకూ డెంగీ పరీక్షలు

వ్యాధి నిర్ధారణ పరీక్షల పేరుతో నిలువుదోపిడీ

అవసరం లేకున్నా ప్లేట్‌లెట్లు ఎక్కిస్తున్న వైనం

అనవసరంగా ఎక్కిస్తే

అనర్థమే అంటున్న నిపుణులు

బైరమల్‌గూడకు చెందిన కరుణాకర్‌ తీవ్ర జ్వరంతో బాధపడుతున్నాడు. చికిత్స కోసం సమీపంలో ఉన్న ఓ కార్పొరేట్‌ ఆస్పత్రిలో చేరాడు. వైద్యపరీక్షల్లో డెంగీ పాజిటివ్‌గా తేలింది. ప్లేట్‌లెట్స్‌ కౌంట్‌పడిపోయిందని చెప్పి..ఐసీయూలో చేర్చి...ఉదయం, సాయంత్రం వైద్య పరీక్షలు చేయడంతో పాటు ప్లేట్‌లెట్స్‌ ఎక్కించారు. వారం రోజులకు రూ.1.50 లక్షలు చెల్లించారు. డిశ్చార్జ్‌ సమయంలో చేతికిచ్చిన బిల్లు చూసి కుటుంబసభ్యులు వణికిపోయారు. ఇలా ఒక్క కరుణాకర్‌ కుటుంబసభ్యులు మాత్రమే కాదు..సాధారణ జ్వరంతో బాధపడుతూ చికిత్స కోసం ఆస్పత్రులకు చేరుకుంటున్న అనేక మంది వైద్య పరీక్షలు, వాటికవుతున్న ఖర్చులు చూసి వెంటవచ్చిన బంధువులు సైతం ఆశ్చర్యపోతున్నారు.

సాక్షి, సిటీబ్యూరో:డెంగీ జ్వరం సంగతేమో కానీ..ఆ పేరుతో ఆస్పత్రిలో చేరిన తర్వాత వైద్యులు చేతికిచ్చే బిల్లులను చూస్తే మాత్రం కచ్చితంగా వణికిపోవాల్సిందే. ప్రస్తుతం సీజన్‌ మారడంతో నగరంలో డెంగీ జ్వరాలు చాపకింది నీరులా విస్తరిస్తున్నాయి. ఉస్మానియా, గాంధీ, ఫీవర్, నిలోఫర్‌ ఆస్పత్రి సహా నగరంలో కార్పొరేట్, ప్రైవేటు ఆస్పత్రులన్నీ రోగులతో కిక్కిరిసిపోతున్నాయి. కేవలం ప్రభుత్వ ఆస్పత్రుల్లోనే కాదు కార్పొరేట్‌ ఆస్పత్రుల్లోనూ బెడ్లు దొరకని పరిస్థితి. సాధారణ జ్వరాలతో పోలిస్తే డెంగీ కొంత ప్రమాదకరమైనది. ఈ డెంగీ జ్వరంపై రోగుల్లో భయాన్ని నగరంలోని కొన్ని కార్పొరేట్, ప్రైవేటు ఆస్పత్రులు అవకాశంగా తీసుకుంటున్నాయి. దీన్ని బూచీగా చూపించి...సాధారణ జ్వర పీడితులను ఆ చికిత్సల పేరుతో నిలువుదోపిడీకి గురిచేస్తున్నాయి. అవసరం లేకపోయినా ఐసీయూ చికిత్సలు, గంటకోసారి వైద్య పరీక్షలు, హడావిడిగా ప్లేట్‌లెట్స్‌ ఎక్కిస్తున్నారు. తీవ్రమైన డెంగీ బాధితులే కాదు..సాధారణ జ్వర పీడితులు సైతం చికిత్సల తర్వాత ఆస్ప త్రులు చేతికిచ్చే బిల్లులు చూసి విస్తుపోవాల్సి వస్తుంది. చికిత్సల పేరుతో ఒక్కో రోగి నుంచి రూ.1.50 లక్షల నుంచి మూడు నుంచి నాలుగు లక్షలకుపైగా వసూలు చేస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. అనవసరంగా ప్లేట్‌లెట్లు, ప్లాస్మాలను మోతాదుకు మించి ఇస్తే..భవిష్యత్తులో అక్యూట్‌లంగ్‌ ఇంజ్యూరీ, కొన్ని సార్లు అలర్జిక్‌ రియాక్షన్లు, బ్యాక్టీరియల్‌ ఇన్‌ఫెక్షన్లు వచ్చే ప్రమాదం లేకపోలేదని హెమటాలజిస్టులు చేస్తున్న హెచ్చరికలను సైతం వారు బేఖాతారు చేస్తుండటంపై స ర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. 

ఐపీఎంకు చేరని రెండో శాంపిల్‌:
ప్రభుత్వం ఐజీఎం ఎలీసాటెస్టులో పాజిటివ్‌ వచ్చిన కేసులను మాత్రమే డెంగీగా పరిగణిస్తుంది. కానీ కార్పొరేట్‌ ఆస్పత్రులు, నర్సింగ్‌ హోమ్స్‌ ఎన్‌ఎస్‌–1 టెస్టు లో పాజిటివ్‌ వచ్చిన కేసులను కూడా డెంగీగా నమోదు చేస్తున్నాయి. నిజానికి క్లినికల్‌ వైద్య పరీక్షలో డెంగీ పాజిటివ్‌ నిర్ధారణ అయిన రోగి నుంచి రెండో శాంపిల్‌ సేకరించి, ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ ప్రివెంటీవ్‌ మెడిసిన్‌(ఐపీఎం)కు పంపాలనే నిబంధన ఉంది. కానీ ఉస్మానియా, గాంధీ, ఫీవర్‌ వంటి ప్రభుత్వ ఆస్పత్రులు మినహా నగరంలోని ఏ ఒక్క ఆస్పత్రి కూడా దీన్ని పట్టించుకోడం లేదు. సాధారణ జ్వరాలను కూడా అనుమానిత డెంగీగా నమోదు చేసి గుట్టు చప్పుడు కాకుండా చికిత్సలు చేస్తున్నాయి. సీజనల్‌ వ్యాధుల వివరాలను ఎప్పటికప్పుడు జిల్లా వైద్య ఆరోగ్యశాఖలోని ఎపిడమిక్‌ సెల్‌కు అందజేయక పోవడంతో ఏ ఆస్పత్రిలో ఎంత మంది ఏ వ్యాధిబాధితులు చికిత్స పొందుతున్నారనే విషయం వైద్య ఆరోగ్యశాఖ అధికారులకు కూడా తెలియడం లేదు. ఫలితంగా సీజనల్‌ వ్యా ధుల తీవ్రత ప్రభుత్వ దృష్టికి వెళ్లడం లేదు.

జ్వరాలన్నీ డెంగీ కాదు– డాక్టర్‌ రంగనాథ్,మాజీ సూపరింటెండెంట్, నిలోఫర్‌
ఈడిస్‌ ఈజిప్ట్‌(టైగర్‌)దోమ కుట్టడం వల్ల డెంగీ వస్తుంది.
నల్లని ఈ దోమ ఒంటిపై తెల్లని చారలు కన్పిస్తూ కేవలం పగటిపూట మాత్రమే కుడుతుంది.
కళ్లమంట, కండరాల నొప్పులు, అధిక జ్వరం, వాంతులు, విరేచనాలు, చర్మంపై దద్దుర్లు ఏర్పడుతాయి.
చర్మం చిట్లిపోయి రక్తస్తావం అవుతోంది.  
బీంగ్‌ వల్ల బీపీ పడిపోవడంతో షాక్‌కు గురై కోమాలోకి వెళ్లే అవకాశం ఉంది.

ఈ జాగ్రత్తలు తీసుకోవాలి– డాక్టర్‌ సందీప్‌రెడ్డి, జనరల్‌ ఫిజిషియన్‌
డెంగీ వ్యాధి బారిన పడుకుండా ఉండాలంటే వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలి.  
ఇంటి పరిసరాల్లో మురుగు నీరు, పాత టైర్లు, ఖాళీ కొబ్బరి బోండాలు నిల్వ ఉండకుండా చూసుకోవాలి.  
నీటి ట్యాంకులు, కుండలు, క్యాన్లు వారానికోసారి శుభ్రం చేసుకోవాలి.
ఇంటి గదుల్లో గాలి వెలుతురు ఎక్కువగా ఉండేలా చూడాలి. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top