పేదలకు బాసట

People Happy With Hike Pension In Telangana - Sakshi

సాక్షి, రంగారెడ్డి జిల్లా : ఆసరా పింఛన్‌దారులకు మరింత భరోసా లభించింది. పింఛన్‌ సొమ్మును రెట్టింపు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీ చేయడంతో  వారిలో ఆనందం వెల్లివిరుస్తోంది. ఈ నిర్ణయంతో జిల్లా వ్యాప్తంగా ఆయా కేటగిరీల్లో పింఛన్‌ పొందుతున్న 1.73 లక్షల మందికి లబ్ధిచేకూరనుంది. ప్రస్తుతం ప్రతినెలా వికలాంగులు రూ.1,500, వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు, గీత, చేనేత, బీడీ కార్మికులు రూ.1,000 చొప్పున పింఛన్‌ పొందుతున్నారు. వికలాంగుల పింఛన్‌ను రూ.3,016, ఇతర లబ్ధిదారుల పింఛన్‌ను రూ.2,016 పెంచుతూ సర్కారు ఉత్తర్వులు జారీచేసింది. పెంచిన  పింఛన్‌ సొమ్మును జులై ఒకటో తేదీ నుంచి లబ్ధిదారులు తీసుకోవచ్చు. ఎప్పటిలాగే 23 మండలాలు, మూడు మున్సిపాలిటీల పరిధిలోని లబ్ధిదారులు పోస్టల్‌ విధానంలో తీసుకోవాల్సి ఉంటుంది. ఇతర మున్సిపాలిటీలతోపాటు జీహెచ్‌ఎంసీ పరిధిలో ఉన్న లబ్ధిదారులకు బ్యాంకు ఖాతాల్లో సొమ్ము జమ అవుతుంది.  

రూ.18.80 కోట్లు అదనం
ఇంతకుముందు ఆసరా లబ్ధిదారులకు ప్రతినెలా జిల్లాలో రూ.18.52 కోట్లను పింఛన్‌ రూపంలో అందజేశారు. తాజా పెంపుతో ఈ మొత్తం 37.33 కోట్లకు చేరుకోనుంది. అదనంగా రూ.18.80 కోట్లను ప్రభుత్వం ఖర్చు చేయాల్సి ఉంటుంది. ఆసరా సొమ్మును పెంచుతామని సీఎం కేసీఆర్‌ గతేడాది డిసెంబర్‌లో జరిగిన శాసనసభ ఎన్నికల ముందు హామీ ఇచ్చిన విషయం తెలిసిందే.  ఇది అసెంబ్లీ ఎన్నికలు పూర్తికాగానే అమలు కావాల్సి ఉంది. అయితే, ఈలోగా పంచాయతీ, లోక్‌సభ, స్థానిక సంస్థల ఎన్నికలు వరుసగా రావడంతో సాధ్యం కాలేదు. ఇటీవలే ఇవి ముగియడంతో.. పింఛన్‌ సొమ్మును పెంచుతూ ఉత్వర్వులు జారీచేసింది. ఈ నిర్ణయంపై లబ్ధిదారులు సర్వత్రా హర్షం వ్యక్తం చేస్తున్నారు.

వారికి మరింత ఆలస్యం..
కుదించిన వయసుకు అనుగుణంగా గుర్తించిన అర్హులకు కొత్తగా వృద్ధాప్య పింఛన్‌ అందజేసేందుకు మరికొంత సమయం పట్టే అవకాశముంది. వృద్ధాప్య పింఛన్‌ వయసును ప్రభుత్వం కుదించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం 65 ఏళ్ల పైబడిన వ్యక్తులకు వృద్ధాప్య పింఛన్‌ను అందజేస్తున్నారు. ఈ వయస్సును 57 ఏళ్లకు తగ్గించింది. అంటే.. 57 నుంచి 64 ఏళ్లలోపున్న వారు పింఛన్‌ తీసుకోవడానికి అర్హులన్నమాట. ఈ నిర్ధిష్ట వయసు ఉన్న వారి వివరాలను ఓటరు జాబితాలో నమోదైన వయసును ప్రామాణికంగా తీసుకుని జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ (డీఆర్‌డీఏ) సేకరించింది. ఇలా గుర్తించగా.. 1.94 లక్షల మంది వివరాలు సేకరించారు. ఇందులో నుంచి పింఛన్‌ నిబంధనలకు లోబడి ఉన్న 31,947 మందిని అర్హులుగా తేల్చిన డీఆర్‌డీఏ.. ఈ జాబితాను ప్రభుత్వానికి నివేదించింది. అయితే, వీరికి ఇప్పటికిప్పుడే పింఛన్‌ అందజేసే పరిస్థితులు కనిపించడం లేదు. ప్రస్తుతం ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్‌ అమల్లో ఉండటమే ఇందుకు ప్రధాన కారణం. ఈ కోడ్‌ ముగిస్తే వీరికి కూడా పింఛన్‌ అందజేసే వీలున్నట్లు అధికారులు పేర్కొంటున్నారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top